22, డిసెంబర్ 2020, మంగళవారం

వైకుంఠ ఏకాదశి

 వైకుంఠ ఏకాదశి:


ఒక సంవత్సరంలో ఇరవైనాలుగు తిథులలో వచ్చే ఏకాదశులతో ధనుర్మాసంలో మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. సౌరమానములో ధనుర్మాసము వచ్చినా, చాంద్రమాన పంచాంగము ప్రకారమే వైకుంఠ ఏకాదశిని అవలంబించుతారు. పరమాత్మా శ్రీ హరి దివ్య తేజస్సు ఈ పండుగ ద్వారానే వ్యక్తమౌతోంది. ఈ రోజునే రావణ సంహారము గావిస్తానని, మహావిష్ణువు బ్రహ్మకు వరమిచ్చినట్లు ప్రతీతి. అసురులైన మధుకైటభులు మరణానంతరము దివ్య రూపములు పొంది ఈ రోజు పూజ చేసిన భక్తులకు ఉత్తర ద్వారా దర్శనము చేసికొని వైకుంఠ ప్రాప్తి కలుగునట్లుగా వరమడిగితే శ్రీహరి తథాస్తు అని అనుగ్రహించాడట. ఈ రోజున నియమనిష్టలతో పూజించిన భక్తులు మోక్షమును పొందుదురు కావున ఈ రోజును మోక్షోత్సవ దినము అని కూడా అంటారు. దీనినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన అంశతో ఒక యువతి ఉద్భవించి మురుడు అను రాక్షసుణ్ణి సంహరించిందిట. ఆమె పేరు ఏకాదశి అని అంటారు.ఈమె పేరున ఏకాదశి వ్రతమును చేసి సుకేతుడు అను రాజు పుత్రవంతుడయ్యాడు. రాజైన రుక్మాంగదుడు, మహాభక్తుడైన కుచేలుడు, ఈ ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధించి సఫల మనోరధుడయ్యారు. అదే విధముగా ధర్మరాజు వైఖానసుడను రాజు, విష్ణువు నారాధించి కృతార్ధులయ్యారు. చాక్షుష మన్వంతరములో వికుంఠ అనే  స్త్రీకి జన్మించుటచే హరి వైకుంఠుడయ్యాడు. ఈ రోజు నియమ నిష్ఠలతో, ఉపవాస దీక్షతో, సేవించిన భక్తులు వైకుంఠ ప్రాప్తిని జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మ స్వరూపులుగా మారిపోతారు. అందువలన ఈ మహాపర్వదినాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి తరిద్దాం.     


వి. రామలింగేశ్వర రావు:9490195303

కామెంట్‌లు లేవు: