22, డిసెంబర్ 2020, మంగళవారం

ప్రాయశ్చిత్తము

 *ప్రాయశ్చిత్తము:-*


దుష్కర్మ ఫలం నుంచి విముక్తి పొందడానికి మార్గం ప్రాయశ్చిత్తం అని అన్నారు. ప్రాయశ్చిత్తము ద్వారా కర్మ ఫలం మార్చవచ్చు అని కూడా విశ్వసించబడింది . ప్రాయశ్చిత్తము అనేది వేదసంహితలలో కనబడుతుంది. కానీ కాలక్రమంలో ఆ శబ్దానికి అర్థం కొన్ని మార్పులు చెందినట్లు కనబడుతోంది. ప్రారంభం లో ఆకస్మికంగా జరిగే దోష నివారణకు చేసే పనిని ప్రాయశ్చిత్తం అని అన్నారు. హారతి ఇచ్చెటప్పుడు జ్వాల ఆరిపోవడం, ఇటువంటి వాటిలో ఒకటి! కానీ ప్రప్రధమంగా కర్మకాండలలో జరిగే ఆకస్మిక దోషముల నివారణకే ప్రాయశ్చిత్తం ఉద్దేశించబడింది. ప్రాయశ్చిత్తములు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి @ కర్మకాండలలో అశ్రద్ధ వలన జరిగే లోపాలను సరిదిద్దటం కోసం! రెండు @ కర్మకాండలు శాస్త్రం నిర్థేశించినట్లు నిర్వర్తింపబడనప్పుడు కలిగే దోషాలను నివారించడానికి. దోష పరిహారం, దెవతల ఆగ్రహమును శాంతింపజేయుట ప్రాయశ్చిత్త కర్మల ముఖ్య ఉద్దేశం. జంతుబలులు, నదీస్నానం, వేదమంత్రాల జపాలు, ఉచ్చాటన ప్రాయశ్చిత్త ప్రక్రియలు. కానీ ఈ ప్రాయశ్చిత్తం కర్మసిధ్ధాంతమును అనుసరించింది కావు. అంటే దుష్కర్మ నివారణకు కాదు. దుష్కర్మకు ప్రాయశ్చిత్తం లేదు. చేసిన పాపం చెబితే పోతుంది అనే సామెత అర్థం పశ్చాత్తాపం ద్వారా కర్మఫలమును తగ్గించవచ్చుననే విశ్వాసం. ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం కాదు. 


ప్రాయశ్చిత్తము అనే శబ్దానికి అర్థం వ్యవాహారికంగా చెప్పడం సులభం కాదు. ప్రాయశ్చిత్తానికి సామాన్య అర్థం పాపపరిహారార్థం చేయు కర్మ. కానీ దాని ఉప్పత్తి అర్థం అందుకు భిన్నంగా ఉంది. అనేక విధాలుగా వ్యుత్పత్తి అర్థం చెప్పారు. తపోనిష్ట ద్వారా మనసు శుద్దం చేయడం, పాపమును శమింపజేయటం , కోల్పోయిన దానిని తిరిగి పొందడం కోసం చేసే ప్రయత్నం , ఇవి కొన్ని అర్థాలు. ఆ తర్వాత కాలంలో మహాపాతక దోషపరిహారం కోసం ప్రాయశ్చిత్తం చెప్పారు. స్మృతుల యందు, దర్మసూత్రములలో ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశ్యమును ఇంకా కాస్త విస్తరింప జేయడం జరిగింది. హత్యాదోషం, మధ్యపాన దోషం, అసత్యదోషం , దోంగతనం, సంతానం లేక బంధువుల జననకాల దోషం వీటి నివారణకు తపస్సు ప్రాయశ్చిత్తం గా చెప్పారు.


ప్రాయశ్చిత్తానికి చాలా రకాల మార్గాలు చెప్పారు. ఉపవాసాలు ఉండటం, ఆహర నియమాలు, పంచగవ్యములను ఉపయోగించడం, ఒక రోజు లో రాత్రి వేళల్లో గానీ పగలు గానీ ఉపవాసం తో నీటిలో మునిగి ఉండటం , మొదలైనవి ప్రాయశ్చిత్తాలు , కానీ ఏ స్మృతి గానీ ధర్మశాస్త్రం గానీ మరొక స్మృతి లేక ధర్మశాస్త్రం చెప్పింది అంగీకరించలేదు. కొన్ని ప్రాయశ్చిత్తమును గురించి సంధేహించాయి కూడా. కర్మ ఫలం అనుభవించక తప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తం నిష్ప్రయోజనం అని కొందరు ధర్మశాస్త్రాకారులు భావిస్తారు. కానీ తపస్సు ప్రాధాన్యం దాదాపు అందరూ అంగీకరించారు.


మనుస్మృతి జరిగిన కర్మ ఉద్దేశాన్ని అనుసరించి పాపపరిహరం యొక్క ఉపయోగం ఉంటుంది అని అంది . పాపకర్మ ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అన్నది ప్రదానం అంది. మనుస్మృతి శిక్షలను కూడా కులమును బట్టి నిర్ణయించింది. యాజ్ఞవల్క్య స్మృతి కూడా సామాన్యముగా స్మృతులు అన్ని దాదాపుగా కర్మ ఫలం అనివార్యం అనే ఉద్ఘాటించి చెప్పాయి. వేదాంత మార్గము లోనే పురుష ప్రయత్నం ద్వారా సంచిత కర్మను నివారించడానికి అవకాశం ఉంది అని గానీ ప్రారబ్ధ కర్మ ఫలం తప్పదు అనే స్మృతులు చెబుతున్నాయి. మొత్తం మీద పాపకర్మ నివారణకు ప్రాయశ్చిత్తం యొక్క సామర్థ్యాన్ని గురించి స్మృతులలో స్థిరమైన అభిప్రాయాలు కనబడదు. ఆఖరికి మనుస్మృతే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ న్యాయ చట్టములు మనుస్మృతినే ఎక్కువ అధికారికంగా గ్రహించాయి. లోతుగా పరిశీలిస్తే ప్రాయశ్చిత్తమును అంగీకరించిన కర్మసిద్దాంతం నిరర్థకమైనది అవుతుంది. మహాభారతం కూడా పురుష ప్రయత్నాన్నే చెప్పింది. పురుష ప్రయత్నం ప్రాయశ్చిత్తం కాదు. చిత్త శుద్ధి తో పురుషార్ధాలను నిర్వర్తించుటే పురుష ప్రయత్నం. ఈ ప్రాయశ్చిత్త ప్రక్రియలు హేతుబద్ధమైన సమాధానాలుగా కనబడవు. ఎక్కడ నుంచో తీసుకుని వచ్చినట్లు కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో ఇవి స్మృతులలో ఇమిడి పోయి ఉండవచ్చు.


బౌద్ధం లో కూడా ప్రాయశ్చిత్తమును అంగీకరించినట్లు లేదు. ప్రాయశ్చిత్త సిద్దాంతం జైనంలో ఒక రూపం పొంది ఉన్నట్లు కనబడుతోంది. కర్మ ద్రవ్యరూపం అని జైన సిద్దాంతం. కర్మ పదార్థం సూక్ష్మ అణురూపంలో నుంచి జీవులను ఆకర్షిస్తుంది. సాహచర్యం చేత జీవి, కర్మ పదార్థం అణువులు కలుస్తుంది. ఒకే ప్రదేశంలో ఏర్పడు ఈ సాహచర్యమే కర్మ పదార్థం జీవుని యందు ప్రవేశించడానికి కారణం. కావున ఇక్కడ కర్మకు ఉద్దేశం ప్రదానం కాదు. అయినా కూడా దురుద్దేశం ఎక్కువ కర్మ పదార్థ అణువులను చేర్చుతుంది. ఈ కర్మ పదార్థమే కర్మబంధం అవుతుంది. కర్మబంధ విముక్తికి ప్రాయశ్చిత్తం చెప్పారు. అది ``సంవరం`` `` నిర్జవం`` అని రెండు విధములు. సంవరం అంటే ధర్మనియతి !! తీర్థంకరుల భోధనల ప్రకారం సంవరంని సాధించవచ్చు అని అన్నారు. నిర్జరముని పూర్వపాపములను కఠిన నిష్ఠతో కర్మ అంటే వర్తమాన కర్మ చేత సంచిత కర్మను నిరోధించడానికి అవుతుంది. కఠిన నిష్ఠతో శరీరాన్ని శిథిలం చేయడమే ఈ నిర్జర అనే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇది కర్మఫలంని శరీరం శిథిలం చేసుకోవడం ద్వారా అనుభవించమే అవుతుంది కదా! అంటే కర్మానుభవమే ప్రాయశ్చిత్తం!!! కాలక్రమంలో చేసిన తప్పుని ఒప్పుకోవడం, పశ్చాత్తాపం చెందడం, ఆపై నిరాహార దీక్షతో కూడిన ఉగ్ర తపస్సు ప్రాయశ్చిత్తం లో చోటు చేసుకున్నాయి. మధ్వాచార్యులు తన సర్వదర్శనం సంగ్రహంలో నిర్జరని రెండు విధాలుగా చెప్పారు. ఒకటి యధాకాల నిర్జర , రెండోది జౌపక్రమిక నిర్జర !! కర్మ పరిపక్వం చెంది పూర్తి అవడం వల్ల ఏర్పడే నిర్జర యదాకాల నిర్జర అని అన్నారు. రెండోది సంకల్పబలం తో తపస్సు చేసి దాని ద్వారా కర్మను పరిపక్వం చేయడం . జైనమతం లో తపశ్చర్య ద్వారా కర్మ నాశనం జైన కర్మ సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కర్మను ఒక పదార్థం గా నిర్వహించారు కాబట్టి. శృతుల కాలం నుంచి స్మృతుల కాలం వరకూ వచ్చినప్పటికీ ప్రాయశ్చిత్త సిద్దాంతం జైన కర్మ సిద్ధాంత ప్రభావానికి లోనై ఉండవచ్చు అని కనిపిస్తుంది. కర్మ సిద్ధాంత పరిధిలోనే స్మృతులు , ధర్మసూత్రముల యందు ప్రాయశ్చిత్త ప్రక్రియలు కూడా ఇమడ్చబడినదిగా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రాయశ్చిత్తం గురించి ఒక నిశ్చితాభిప్రాయం , సిద్దాంత రూపం ఉన్నట్లు కనబడదు. ఒకరు చెప్పింది మరొకరు వ్యతిరేకించడమే జరిగింది కానీ ప్రాయశ్చిత్తం ద్వారా నిజంగా దుష్కర్మ నాశనం సాధ్యం అని పరిపూర్ణ విశ్వాసం తో ఏ ఒక్క వ్యక్తి చెప్పినట్లు కనబడదు. వశిష్టుడు, విశ్వామిత్రుడు లాంటి యోగనిష్ఠాగరిష్టులు , శక్తివంతులు ఇప్పుడు లేరు . ఈ రోజుల్లో ప్రాయశ్చిత్త కర్మలు కూడా చిత్తశుద్ధితో కాకుండా వ్యాపారాత్మకంగా పైపై ఆడంబరంగా జరుగుతోంది. పూజలు , హోమాలు , వ్రతాలు , యజ్ఞ యాగాలు చేయించే వారికి చేసే వారికి చిత్తశుద్ధి శూన్యం గా కనబడుతోంది ఈరోజుల్లో. ప్రాయశ్చిత్తము చేశాం అని సంతృప్తి తప్ప ప్రాయశ్చిత్తం వలన ఉద్దేశించిన ఫలం దక్కుతుంది అని చెప్పడం నిజంగా సాహసమే ఈ రోజుల్లో. నేతి బీరకాయ వంటివే ఈనాటి ప్రాయశ్చిత్తాలు .


🙏🙏🙏🙏🧚🏻‍♂️🧚🏻‍♂️🧚‍♀️


సశేషం.

కామెంట్‌లు లేవు: