22, డిసెంబర్ 2020, మంగళవారం

ధర్మాచరణ

 *ధర్మాచరణ* 


🍁🍁🍁🍁🍁


ధార్మికులు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటే అధర్మాన్ని అనుసరించేవారు సుఖంగా జీవిస్తుండటం మనం చూస్తుంటాం. అందుకని ధర్మాచరణ వలన ప్రయోజనమేమిటని కొందరు ప్రశ్నిస్తుంటారు.


అయితే ఒక విషయాన్ని గుర్తించాలి. ధర్మాన్ని అనుసరించే వారికి చివరికి కష్టాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ఆనందం కలుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే వారి బాధలు ముగిసి సంతోషం లభిస్తుంది. అలాగే అధర్మంగా ప్రవర్తించే వారి సంతోషం తాత్కాలికమే. చివరికి వారికి దుఃఖం కలిగి తీరుతుంది.


శ్రీరామచంద్రునికి అరణ్యవాస సమయంలో కష్టాలు తప్పలేదు. కాని చివరికి శత్రువును వధించి, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై చాలా సంవత్సరాలు పేరు ప్రఖ్యాతులతో జీవించాడు. అందుకు విరుద్ధంగా రావణాసురుడు మొదట్లో సుఖాన్ని అనుభవించినా చివరికి నాశనమయ్యాడు. అంతేకాదు, శాశ్వతంగా అపఖ్యాతి పాలయ్యాడు. అందువలన ధర్మం మాత్రమే విజయాన్ని పొందుతుంది. అధర్మం అపజయం పాలవుతుంది.


మంచివాని కష్టం, దుర్గార్గుని సుఖం రెండూ కూడా తాత్కాలికమే. అందువలన ఒక సందర్భంలోని పరిస్థితులను ఆధారంగా తీసుకుని ధర్మాధర్మ ప్రవర్తనల ప్రభావాలపై తీర్పు చెప్పకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అధర్మమార్గాన్ని వీడి ధర్మమార్గాన్నే అందరూ అనుసరించెదరుగాక.


దురాత్ముని సంతోషం దుఃఖంగానే ముగుస్తుంది. అయితే మహాత్ముడు మొదట్లో అనుభవించే దుఃఖం చివరికి సంతోషంగానే ముగిసి తీరుతుంది.


- -----జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.

కామెంట్‌లు లేవు: