22, డిసెంబర్ 2020, మంగళవారం

బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య

 #బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య


మానవుడు ఒక ముత్యపు చిప్పను చూసి దానిలోని నైగనిద్యాదుల వలన రజతం అనుకొంటాడు. తరువాత దగ్గరకు సమీపించి చూడగా ఆ భ్రాంతి అతనికి తొలగిపోతుంది. అలాగే స్వప్నంలో అనేక యాత్రాదులు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇలా ద్వైత భ్రాంతి అంత తొందరగా తొలగిపోదు. అది చాలా దీర్ఘమైనది.


మనం రాత్రి ఒక గదిలో పడుకుంటే ఆ రాత్రి కలలో విమానం ఎక్కి కాశీ వెళ్ళి, గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం ఆ తర్వాత రామేశ్వర యాత్ర, సముద్రస్నానం, రామనాథ దర్శనం వంటివన్నీ జరిగాయి. మెలకువ రానంతవరకు అది నిజంగా జరిగినట్లే 'సరే' అనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చాక అబ్బే అదేం జరగలేదు, 4,5 గంటల్లో ఇంత యాత్ర జరపడం సాధ్యమా? కాదు. ఇది అసత్యమే అని ఆ యాత్రా భ్రాంతి తొలగిపోతుంది. కలగంటున్నంత సేపూ నిజంగా కాశీలో ఉన్నట్లే, యాత్రా జరిగిపోయినట్లే అనిపించినా, మెలకువ వచ్చాక అదంతా మిధ్యయే అనే నిర్ణయం కలుగుతుంది.


అలాగే వ్యవహారంలో జగత్తులో సర్వమూ సత్యమే అనిపిస్తుంది. ఎందుకు? ద్వైత భ్రాంతి ఉండేవరకు. ఎపడైతే ద్వైత భ్రాంతి తొలగిపోతుందో అద్వైత సాక్షాత్కారం వెలువడుతుంది. “यत्रत्वस्य सर्वमात्मैवाभूत् तत् केन कं पश्येत् केन कं जिघ्रेत्, केन कं पश्येत् केन कं विजानीयात्" అని శ్రుతి వచనం. అద్వైత సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అపుడు ఇంకేమీ లేదు, అరే అపుడు చూడవలసిందేముంది? వినవలసిందేముంది? అనిపిస్తుంది.


आत्मानं चे द्विजानीया दहमस्मीति पूरुषः |

कि मिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत् ||


దీనికి మనం ఆశ్చర్యపడనవసరం లేదు. వ్యవహారంలో అలాగే అనుకోవడం భ్రాంతి పడడం జరుగుతుంది "यधास्वप्ने" అని. స్వప్నంలో ఆ భ్రాంతి ఉన్నంతసేపూ తదనుగుణమైన వ్యవహారమున్నట్లే, ఈ ద్వైతభ్రాంతి ఉన్నంత వరకూ "अनपेक्षया" జగత్ సత్యమనే వ్యవహారముండనే ఉంటుంది. అవిద్య, అజ్ఞానం నాశనమయేవరకు అలానే అనిపిస్తుంది. సూర్యోదయ అనంతరం అంధకారం నశించినట్లే ద్వైతభ్రాంతి తొలగి జ్ఞానోదయమవుతుంది. అయితే స్వాప్నిక భ్రాంతి మెలకువ వచ్చే వరకూ మాత్రమే. ఇది సుదీర్ఘం. అదే వ్యత్యాసం. కనుక ఆలోచించి, నిత్యానిత్య వివేకంతో "ब्रह्म सत्यं जगत् मिथ्या जीवः ब्रह्मैक ना परः" అని గ్రహించాలి.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.


|| ॐ नमः पार्वती पतये हरहरमहदेव ||


#జగద్గురు_శ్రీశ్రీ_భారతీతీర్థ_మహస్వామివారి_అనుగ్రహ_భాషణములు


-----------------------------------------

కామెంట్‌లు లేవు: