24, ఏప్రిల్ 2025, గురువారం

తిరుమల సర్వస్వం 214-*

 *తిరుమల సర్వస్వం 214-*

*పుష్పమండపం-2*

 


*పుష్పాలంకరణ* 


 ఉద్యానవనాల పెంపకం లోనే కాకుండా పుష్పాలంకరణలో కూడా తి.తి.దే. ఉద్యానవనశాఖ ఎంతో నైపుణ్యం సంపాదించింది. అలంకరణ అంటే కేవలం మాలలు కట్టడం, దండలు చుట్టడమే కాదు; ఒక చేయి తిరిగిన చిత్రకారుడు తన కుంచెకు రంగులద్ది కాన్వాస్ పై జీవకళ ఉట్టిపడే చిత్రాన్ని సృష్టించినట్లు రంగురంగుల పూలను ఒద్దికగా అమర్చి, ఎప్పటికప్పుడు సరికొత్త పుష్పకళాకృతులకు తి.తి.దే. ఉద్యానవన శిల్పులు రూపకల్పన చేస్తారు.

2 ఉత్సవ సమయాల్లో పుష్పాలతో స్వాగత తోరణాలు నిర్మించటం, స్వాగత వచనాలు వ్రాయడం, వివిధ దేవతామూర్తుల పౌరాణిక ఘట్టాలను రంగు రంగుల పూల అమరికతో సృష్టించడం లాంటివన్నీ తి.తి.దే. ఉద్యానవనశాఖకు కరతలామలకం. 


 బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఉన్న విద్యుత్ శాఖ ఉద్యానవన శాఖ; వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి, సృజనాత్మకతను రంగరించి, ఉత్సవాలకు మరింత శోభ చేకూర్చుతారు.


 *అలంకరణే కాదు – ఆరోగ్యం కూడా !* 


 ఉద్యానవనశాఖ వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుతోంది. శేషాచలశ్రేణుల్లో ఉండే విలక్షణమైన ప్రాకృతిక స్వభావం వల్ల, ప్రపంచంలో మరెక్కడా లేని అత్యంత అరుదైన వృక్షజాతు లెన్నింటినో తిరుమల కొండపై చూడవచ్చు. వేంకటాచలానికే పరిమితమైన ఎర్రకొవ్వి, రత్నపురుష, చిత్రమూలం, సారిందీ, ఈశ్వర, పల్లేరు, ఏనుగు పల్లేరు, సహదేవి, నేలగల్లిజేరు, గొబ్బి, రణభేరి, దేవదారి, కుక్కతులసి, పేలకాయలు, కుక్కనాలుక, బడిత వంటి విలక్షణమైన, ఔషధ విలువలు గలిగిన ఎన్నో వృక్షజాతులకు తిరుమలక్షేత్రం ఆలవాలం. వీటన్నింటినీ నిపుణులైన వృక్షశాస్త్రజ్ఞుల సాయంతో శ్రద్ధగా, వాటి స్వాభావిక పరిస్థితులలో సంరక్షిస్తూ; ఆయా వృక్షజాతులు అంతరించి పోకుండా తి.తి.దే. శ్రద్ధ వహిస్తోంది.


 *పుష్పదాతలకూ కొదవేం లేదు !!* 


 శ్రీవారి పుష్పకైంకర్యం చేసేందుకు ఇప్పుడు కూడా ఎందరెందరో దాతలు ముందుకు వస్తున్నారు. ఆ పుష్పప్రియుడి సేవలకు అవసరమయ్యే మొత్తం పుష్పాల్లో 60 శాతం దాతలే విరాళాల రూపంలో సమకూర్చు తున్నారు. 30 శాతం పుష్పాలను సొంతంగా సాగుచేసే ఉద్యానవనాల ద్వారా, మిగిలిన 10 శాతం పూలను కొనుగోళ్ల ద్వారా తి.తి.దే. భర్తీ చేసుకుంటుంది. బ్రహ్మోత్సవాలలో, వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు, పుష్పయాగం జరిగే రోజున పూల విరాళాలకై దాతలు పోటీపడతారు. ఆ సందర్భాలలో దాదాపుగా భూమండలంపై లభించే పుష్పజాతులన్నింటినీ తిరుమల కొండపై చూడవచ్చంటే అతిశయోక్తి కాదు. దేశం లోని కేరళ, అస్సామ్, హిమాచల్ ప్రదేశ్ వంటి సుదూరప్రాంతాల నుండే కాకుండా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ వంటి ఖండాంతర దేశాలనుండి కూడా దిగుమతి చేసుకోబడ్డ పూలు శ్రీవారిసేవలో తరించుకుంటాయి.


 ఆ పర్వదినాల్లో తిరుమల పట్టణమంతా ముఖ్యంగా శ్రీవారి ఆలయం ప్రత్యేక పుష్పాలంకరణతో పుష్పమయంగా గోచరిస్తుంది.


 *పూదోటలకు భక్తుల పేర్లు* 


 వందల ఏళ్లక్రితం శ్రీవారికి పుష్పకైంకర్యం చేసిన భక్తుల పేర్లతో కూడా తి.తి.దే. ఉద్యానవనశాఖ అనేక పూలతోటలను పెంచుతోంది. సూరాపురం వారి తోట, పేరిందేవి తోట, హాథీరామ్ జీ తోట ఇలా తిరుమలలో ఎన్నో ప్రాంతాలు, కూడళ్ళు ఆయా పూలతోటల పేర్లతోనే పిలువబడుతున్నాయి. తిరుమలలో పెంచబడుతున్న అనేకానేక ఉద్యానవనాల్లో నారాయణగిరి ఉద్యానవనం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడింది. గోగర్భం ఆనకట్ట ప్రాంతంలోనూ, పద్మావతి వసతిగృహ ప్రాంతంలోనూ ఉన్న పూదోటలు కూడా అత్యంత ఆకర్షణీయంగా మలచబడ్డాయి. ఇప్పుడు వైకుంఠం క్యూ సముదాయం ఉన్న ప్రాంతం కూడా ఒకప్పుడు ఉద్యానవనమే! అప్పుడది చేమకూర తోటగా ఉండేది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: