*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*356 వ రోజు*
*ద్రోణుడిలో పరివర్తన*
ద్రోణుడు అలాగే రథము మీద వాలి పోయాడు. ద్రోణునిలో పరివర్తన మొదలైంది. తాను పాండవుల చేసిన పాపం తలచుకుని కుమిలి పోయాడు. ఋషులు మాటలు చెవుల్లో మారు మోగుతున్నాయి. తాను ఎంతో మంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదు. ఇలా అనుకుని పైకి చూడగానే ఎదురుగా ధృష్టద్యుమ్నుడు అవకాశం కొరకు ఎదురు చూస్తుండటం చూసి అతడితో యుద్ధము చేయాలను ఉన్నా చేతులు రాలేదు. ధనుర్భాణాలు చేతి నుండి జారాయి. అతడిలో ఉన్న యుద్ధనిష్ఠ, శౌర్యము, గర్వము నశించాయి. తన కుమారుడు మరణించాడు అన్న దుఃఖం అతడిని కుంగదీసింది. అతడి అవయవములు ముడుచుకు పోయి అలాగే రథము మీద కూర్చుండి పోయాడు. ద్రోణవధ కొరకు అగ్ని నుండి జన్మించిన ధృష్టద్యుమ్నునికి ద్రోణుడిని వధించాలి అన్న కోరిక బలీయంగా కలిగి అతడి మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడికి యుద్ధం చేయాలని ఉన్నా దివ్యాస్త్రములు స్పురణకు రాక మామూలు బాణాలతో ధృష్టద్యుమ్నుడి బాణాలు ఖండిస్తూ ధృష్టద్యుమ్నుడి రథమును, ధ్వజమును ఖండించి, సారథిని చంపాడు. ధృష్టద్యుమ్నుడు రథము నుండి దిగి గదను తీసుకున్నాడు. ద్రోణుడు ఆ గదను తన బాణములతో ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని ద్రోణుని మీదకు ఉరికి అతడి హయములను, సారథిని చంపాడు ద్రోణుడు తన బాణములతో ధృష్టద్యుమ్నుడి కత్తిని ఖండించాడు. ఆ సమయంలో సాత్యకికర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మలతో యుద్ధము చేస్తున్నాడు. దూరం నుండి ఇది గమనించి పది బాణము ద్రోణుడి మీద వేసాడు. భీముడు తన రథము మీద వచ్చి ధృష్టద్యుమ్నుడిని తన రథము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. ద్రోణుడు అతడిని పోనేలే అని వెంబడించక వదిలాడు.
*ద్రోణుడు ప్రశాంతిని పొందుట*
ఇప్పుడు ద్రోణుడి మనస్సు ప్రశాంతమైంది. తన రథము మీద కూర్చుని యోగ నిమగ్నుడయ్యాడు. మనసులో శాంతి పొంది చుట్టూ చూసాడు. " ఓ కర్ణా! ఓ కృతవర్మా ! ఓ సుయోధనా ! మీరు నన్ను యుద్ధం చేయడం లేదని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. అయినా నేను నా చేతనైనంత యుద్ధం చేసాను. ఇంక నిశ్చింతగా పైలోకాలు చేరుకుంటాను. నేను నా ధనుర్భాణాలు విడిచి అస్త్రసన్యాసం చేస్తున్నాను. మీరంతా ఇకనైనా తెలివిగా ప్రవర్తించండి " అని ఎలుగెత్తి అరిచాడు. ద్రోణుడు తన ధనుర్భాణాలు రథము మీద వదిలి తేజోమయమైన ఆత్మతో వెలుగొందు తున్నాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుడి వైపు నడిచాడు. అది చూసి ఉభయసైన్యాలు హాహాకారాలు చేసాయి. కాని అప్పటికే ద్రోణుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. అతడి ఆత్మ జ్యోతి రూపంలో పైకెగసి పరమాత్మను చేరుకుంది. అతడి ఆత్మ తేజో రూపంతో పకి వెళ్ళడం నేను, కృపాచార్యుడు, కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు మాత్రమే చూసాము. మిగిలిన వారికి అది గోచరించ లేదు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుని రథము ఎక్కి అతడి జుట్టు పట్టుకుని మెడ నరకడానికి కత్తి పైకి ఎత్తాడు. వద్దు, వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, అది ధర్మవిరుద్ధమని ధర్మజుడు ఎంత అరచినా వినక అతడి తలను నరికి మొండెమును నుండి తలను వేరుచేసి నేల మీదికి వేసాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి