*తిరుమల సర్వస్వం -218*
*శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)-3*
3 బ్రహ్మోత్సవాల్లో భక్తుల సందర్శనార్థం అన్నమయ్య విరచిత తామ్రపత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు మాత్రమే రాగిరేకుల అసలు ప్రతులను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో వాటి నకలు ప్రతులను మాత్రమే సంగ్రహాలయంలో ప్రదర్శిస్తారు. అన్నమయ్య, వారి కుమారుడు, మనుమడు రచించిన 32 వేల కీర్తనలలో కొన్నింటినైనా ఈ రాగిరేకుల రూపంలో దక్కించుకో గలగటం తెలుగువారి పుణ్యఫలమనే చెప్పుకోవాలి.
మూడవ అంతస్తు లోని చరిత్ర విభాగంలో, ఆలయచరిత్రను దృశ్యరూపంలో వివరించే అరుదైన చిత్రాలు ప్రదర్శించ బడుతున్నాయి. వీటిలో ప్రముఖ చిత్రకారుడు పిలకా లక్ష్మీనరసింహం గారు చిత్రించిన దశావతార చిత్రమాలిక ప్రముఖమైనది. ఈ విభాగంలోనే ప్రస్తుతం వాడుకలో లేని శ్రీవారి అమూల్యమైన ఆభరణాలను కూడా భద్రపరిచారు.
కాంస్యవిభాగంలో శతాబ్దాల క్రిందట పోతపోసిన కంచు విగ్రహాలు, వక్కలను కత్తిరించే కత్తెర వంటి సాధనాలు (నట్ క్రాకర్స్), కంచుగంటలు, లోహపు పాత్రలు ఉన్నాయి.
తరతరాల ఆలయ చరిత్రను ఆసాంతం వర్ణించే వెయ్యికి పైగా శిలాశాసనాలను మ్యూజియం బయట ఉన్న గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ శాసనాల ద్వారానే ఆలయానికి చెందిన చారిత్రిక విశేషాలు, ఆయా పాలకులు ఆలయాభివృద్ధికి చేసిన కృషి, శ్రీవారికిచ్చిన కానుకల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీవారిసేవలో తరించిన 12 మంది ఆళ్వారుల లోహ ప్రతిమలు సంగ్రహాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మూర్తుల ముఖారవిందాలలో ఉట్టిపడే జీవకళ అనన్య సామాన్యమైనది.
[ఈ పన్నెండు మంది ఆళ్వారుల గురించి మరో ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం!]
ఎందరెందరో సాహిత్యకారులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ఆలయసిబ్బంది యొక్క సమిష్టికృషితో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ సంగ్రహాలయం, తిరుమల చరిత్రను భావితరాల కందించే విశేషమైన కృషిలో ఒక మైలురాయి. మొత్తం పది విభాగాలలో ఏర్పాటు చేయబడ్డ *'శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల'* తరతరాల తిరుమల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచి, తిరుమలలో దర్శించుకోదగ్గ ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా రాణిస్తోంది. శ్రీవారి భక్తులు, చారిత్రక అంశాలపై ఆసక్తి కలవారు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, అందరూ తప్పనిసరిగా చూసి తీరవలసినదీ ప్రదర్శనశాల.
తిరుపతి నగరంలో కూడా ఇలాంటిదే ఒక అద్భుతమైన ప్రదర్శనశాలను 1983వ సంవత్సరంలో, గోవిందరాజస్వామి ఆలయానికి ఉత్తరమాడవీధిలో ఉన్న ఓ పురాతన మండపంలో తి.తి.దే. ఏర్పాటు చేసింది. దీనిలో వివిధ ఆలయాల ఆకృతులు, వాటి కొలతలు, నిర్మాణ శైలులు, పూజావిధానాలు, పూజాసామగ్రి, మతపరమైన సాంప్రదాయాలు, ఆలయకళలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన వివిధ వృత్తులు మొదలగు వాటిని ప్రదర్శిస్తున్నారు. తిరుపతి నగరంలో తప్పనిసరిగా చూసి తీరవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ముందు ముందు తెలుసుకుందాం!
[ రేపటి భాగంలో ...*సామాజిక సేవా కార్యక్రమాలు* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి