🙏అవస్థా త్రయం --- తురీయావస్తా 🙏
ముందుగా మనస్సు స్థితి ఎల్లావుంటుంది చూద్దాము
ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ధ్యానం చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా మరొక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాకుండా ఉందంటే అది నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది.
మనసు చాలా చంచలమైంది. దానిని నిశ్చలం చేయుటకు ఎన్ని పాట్లు పడాలి. ఆలోచనల పరంపరలో సంచారిస్తూ ఉంటుంది.
మనసు, బుద్ది, అహంకారం, చిత్తం ఇది అంతరంగ చతుష్టయం
శ్రీచక్రార్చనలో మనో బుద్ది చిత్త అహంకారాత్మక అని చతుర్ధావరణలో వస్తుంది. అసలు ఏది మనస్సు? ఏది బుద్ది? ఏది చిత్తం? ఏది అహంకారం తెలుసుకోవాలి
అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.
ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీఅంటాము , ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీఅంటాము , ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ అంటాము , ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీనంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది
మనసు, బుద్ధి, అహంకారంo, చిత్తం-ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం!
మనసు అన్నది ఇక్కడ చేతన మనసును సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.
మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి అనబడుతుంది. "ఇటుగా వచ్చేది ఎవరు?రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి.
ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం అంటారు. మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది.
మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, ఘాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము
ఇక విషయంలోకి వద్దాము
శ్రీం బీజాక్షరానికి ఉన్న అనేక అర్ధములలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్తా చతుష్టయం అని అర్ధం కూడా ఉంది. త్రిపుటి అనేక అర్ధములలో చెప్పబడిన వాటిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి కూడా ఒకటి.జాగ్రత్, స్వప్న, సుషుప్తి జీవకోటికి సర్వ సాధారణము. తమో గుణానికి ప్రతీక నిద్ర. ఇదే మాయాస్వరూపము.అసలు మాయ అంటే అర్ధం ఏమిటి? " మా " అంటే కాదు అని అర్ధం "యా " అంటే ఏది అని అర్ధం.
ఇప్పుడు తాత్పర్యం చూస్తే..ఏది సత్యం కాదో అది మాయ.
మెలకువలో ఉండడం , కలలుకనడం , గాఢనిద్ర ఈ మూడు స్థితులనూ జాగ్రత్, స్వప్న, సుషుప్తి అంటారు . వీటినే అవస్థాత్రయం అంటారు. మెలకువ స్థితిలో బాహ్యప్రపంచ జ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం. ఇది జాగృతావస్థ.
ఇక స్వప్నా వస్థలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు , క్రమపద్ధతిలోనో లేకపోతే మరొక విధంగానో కనిపిస్తాయి. స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.మనస్సు పనిచేస్తూ ఉంటుంది.ఇక సుషుప్తిలో.. అంటే గాఢ నిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.
జాగృత్ (మెలకువ) స్థితిలో ఆత్మతత్వం అనేది కన్నులయందు.., స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తిలో ప్రాణమునందు ఉంటుంది. సుషుప్తిలో ఆత్మ శరీరాన్ని ప్రాణాలకు అప్పగించి తాను అంతర్యామితో (జీవాత్మ ) కలిసి సుఖిస్తుంది. అందుకే గాఢనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ‘నేను సుఖంగా నిద్రపోయాను’ అంటాం. ఇది మనందరికీ అనుభవంలోని విషయమే.
అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము.. యోగం ద్వారా పొందవలసింది.మనకు అనుభవంలో ఉండదు.
మాండూక్యోపనిషత్ లో తురీయావస్థ గురించి చర్చించింది; జాగ్రద, స్వప్న, సుషుప్తి, తురీయం అనే "నాలుగు స్పృహ స్థితులను" చర్చించాయి .
అద్వైతం, మూడు అవస్థలను సూచిస్తుంది, అవి జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి మానవులు అనుభవిస్తారు. ఈ మూడూ, స్థూలము, సూక్ష్మము , కారణము మూడు శరీరాల సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి:
మొదటి స్థితి జాగ్రత్ (మేల్కొన్న) స్థితి, దీనిలో ప్రపంచం గురించి మనకు తెలుసు. ఇది స్థూల శరీరం.
రెండవస్థితి కలలు కనే మనస్సు. ఇది సూక్ష్మ శరీరం.
మూడవ స్థితి గాఢనిద్ర స్థితి. ఇది కారణ శరీరం.
అద్వైతం తురియావస్థ అనే నాల్గవ స్థితిని కూడా ప్రతిపాదిస్తుంది. దీనిని కొందరు స్వచ్ఛమైన స్పృహ అని అంటారు .జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే ఈ మూడు సాధారణ స్థితులనూ అధిగమించే స్థితి. తురీయం అనేది విముక్తి స్థితి. శరీరానికి అతీతం.అద్వైతం ప్రకారం, తురీయావస్థ అంటే ద్వంద్వ ( జీవాత్మ పరమాత్మ) అనుభవం నుండి విముక్తి పొంది, అనంతమైన, అభేదమైన అనుభవాన్ని అనుభవించడం. ఇదే అజాత స్థితి (పుట్టుక లేని స్థితి ). తురియావస్థ అనేది ఆత్మను తెలుసుకున్న స్థితి, దానికి కొలత లేదు, కార్య కారణాల్లేవు, అన్నిటినీ మించిన, బాధలు లేని, ఆనందకరమైన, మార్పులేని, స్వయం ప్రకాశవంతమైన, నిజమైన, అలౌకికమైన స్థితి. తురీయావస్థను అనుభవించిన వారు అందరిలోనూ, అన్నిటి లోనూ తానుండే ద్వంద్వ రహిత స్థితికి చేరుకుని ఉంటారు. వారికి జ్ఞానం, జ్ఞాని, జ్ఞానార్థి ఒకరే అవుతారు. వారు జీవన్ముక్తులు.
గౌడపాదులవారు అద్వైత వేదాంతంలో ప్రారంభ గురువులు . శంకరచార్యుల వారికి గురువు . ఈయన శ్రీ గౌడపాదాచార్య మఠం స్థాపకులు మాండూక్య కారిక రచయిత.
దీనిని మాండూక్య కారిక ఆగమ శాస్త్రం అని కూడా అంటారు. తురియావస్థ నిశ్శబ్దానికి ప్రతీక కాగా మిగిలిన మూడు" ఓం" "కి అనుగుణంగా ఉంటాయి. ఓం మిగతా మూడు స్థితులకు మూలాధారం.
సాధకుడు తన సాధనను బట్టి తురీయ స్థితిలోని వివిధ స్థాయీఘట్టాలను అనుభవిస్తుంటాడు. జీవుడు పరమాత్మతో సామీప్యాన్ని ప్రజ్ఞాపూర్వకంగా అనుభవిస్తాడు. ఇదే బ్రహ్మానుభూతి. సుషుప్తిలోనూ పరమాత్మతో సమీపంగా ఉన్నా.. అక్కడ ప్రజ్ఞలేదు. అనుభవం మాత్రం మిగులుతుంది.
సుషుప్తిలోనూ తురీయ స్థితిలోను పోలిక ఉన్నట్లు కనబడుతుంది. కానీ పోలిక లేదు
సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపతా’
సమాధియందు, సుషుప్తియందు, మోక్షమునందు జీవుడు బ్రహ్మసారూప్యమును పొందుతాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే స్థితికి చేరుతాడు
వైశ్వానరుడు - జాగ్రదావస్థ:
మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటాము, చదువుతుంటాము, ఆడుతూ ఉంటాము, చింతన చేస్తూ ఉంటాము. ఇదంతా చేయిస్తూ, జాగ్రదావస్థలో ఈ జగత్తును అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాము. మనం బాహ్య జగత్తును అనుభవించడం మన స్థూల శరీరంతోనే. అందుకే మన స్థూల దేహం బాహ్య జగత్తు యొక్క అంగంగా సూచించబడుతోంది. ఈ జాగ్రదావస్థలో 19 ద్వారాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవి 5 జ్ఞానేంద్రియాలు, (త్వక్కు = చర్మం చక్షువు = కన్ను రసన = నాలుక శ్రోతం = చెవి ఘ్రాణం = ముక్కు ) 5 కర్మేంద్రియాలు, (వాక్కు, పాణి, పాదం, పాయువు= మల ద్వారం , ఉపస్థ=మూత్ర ద్వారం ) 5 పంచప్రాణాలు, (ప్రాణ, అపాన, .వ్యాన, ఉదాన, సమాన) మరియు మనసు, బుద్ధి, అహం, చిత్తం అనే నాలుగు, ఈ విధంగా జాగ్రదావస్థలో స్థూల ప్రపంచాన్ని అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనబడుతున్నాము. ఇది మన మొదటి పరిమాణం.
రెండవ పరిమాణం - తైజసుడు - స్వప్నావస్థ :
తరువాతది స్వప్నావస్థ. ఇక్కడ బాహ్య జగత్తు లేదు. అనుభవాలన్నీ మానసిక జగత్తు లోనే ఉంటాయి . శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు నిద్రలో మునిగి ఉంటుంది. కానీ సుప్త చేతన మనసు మేల్కొనే ఉంటుంది. ఆ మనసు ఒక నూతన లోకాన్ని సృష్టిస్తుంది. అదే కల -స్వప్న లోకం.
( మనస్సును రెండు విధాలుగా చెప్పారు 1 చేతన మనసు 2 సుప్త చేతన మనసు జాగ్రత్తగా అర్ధం చేసుకోండి.)
శరీరము, చేతన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్త చేతన మనసు ఇటువంటి పనులు చేస్తుంది. ఒక లోకాన్ని తనకంటూ సృష్టించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో మనిషి తైజసుడు అనబడతాడు.
మూడవ పరిమాణం - ప్రాజ్ఞుడు - సుషుప్తావస్థ :
కోర్కెలు , కలలు - ఏది లేని గాఢ నిద్రావస్థ మనిషి యొక్క మూడవ పరిమాణం. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి వుండవు. గాఢ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్రనుండి లేవగానే ' నేను సుఖంగా నిద్రపోయాను' అంటూ మనం చెప్పగలుగుతున్నాము.
బాహ్య జగత్తు యొక్క అనుభవాలు, మానసిక జగత్తు లో పొందే అనుభవాలు కలిసి ఉన్నదే మన జీవితం. 'నేను' అన్న స్పురణ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవాలను మనం పొందగలం. ఈ 'నేను' స్పురణ లేకపోతే ఏ అనుభవాలు ఉండవు. ఈ స్పురణకు ప్రాతిపదికగా ఉన్నది సుషుప్తావస్థ లోని మూడవ పరిమాణమైన ప్రాజ్ఞుడు. కనుక ప్రతి జీవిలోనూ నాయకుని స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు. "నేను'" లేకుంటే 'నాకు' జగత్తు లేదు. అందుకే ప్రాజ్ఞుడు సమస్తానికి మూల కారణం.
నాలుగవ పరిమాణం - ఆత్మ:
నాలుగవ పరిమాణం అని చెప్పబడినప్పటికినీ, ఇది నిజానికి మొదటి మూడు పరిమాణాలు తనలో కలిగి ఉన్నది; కానీ వాటికి అతీతమైన ఒక స్థితి. మన యదార్ధ స్వభావం ఇదే. పై మూడు అవస్థలలోను ఆత్మ ఉనికి ఉన్నది. సూర్యుని సమక్షంలో లోకం నడుస్తోంది. కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు. అలాగే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి.
ఆత్మ ను గురించి మాండూక్యోపనిషత్తు చక్కగా ఈ విధంగా వివరణ ఇస్తోంది:
"ఆత్మ అంతర్ముఖ స్థితికాదు, బాహ్య ముఖ స్థితి కాదు. చైతన్యం సమకూరిన స్థితి కాదు; చేతన స్థితి కాదు, అచేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలు లేని, గ్రహించ శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యం లో మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రపంచ చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే నాలుగవ పరిమాణం. ఇది ఆత్మ. దీనినే తెలుసుకోవాలి"
జాగ్రత్, స్వప్న సుషుప్తి గురించి లలితా సహస్రంలో చెప్పిన శ్లోకాలు చదువుదాము.
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా
విశ్వరూపా జాగరిణీ స్వపన్తీ తైజసాత్మికా
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ
విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.
సుప్తా - నిద్రావస్థను సూచించునది.
ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
తుర్యా - తుర్యావస్థను సూచించునది.
సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
వీటి వివరణ వ్యాసములో ఇచ్చాను కాబట్టి కేవలం అర్ధం మాత్రమే సూచించాను
ఐం హ్రీం శ్రీం జాగ్రత్ స్వప్న సుషుప్తినాం సాక్షీభూత్యై నమో నమః
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి