*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*352 వ రోజు*
కాని మరునాడు యుద్ధ భూమిలో ప్రవేశించగానే కర్ణుడితో సహా మేమంతా ఆవిషయం మరచి పోతుంటాము. తిరిగి రాత్రి సమయంలో శిబిరాలకు చేరిన తరువాతగాని మాకు గుర్తుకు వచ్చేది కాదు. అది దైవమాయ కాక మరేమిటి చెప్పు అంతే కాదు. సుయోధనుడు " కర్ణా ! అర్జునుడిని మాత్రమే చంపితే కృష్ణుడు మనలనందరిని చంపి పాండునందనుడికి పట్టం కడతాడు. ఆ శక్తితో కృష్ణుడిని చంపితే మనం ఈ ధరాతలాన్ని ఏకచ్ఛత్రంగా పాలించ వచ్చు " అనే వాడు. కర్ణుడు అలాగే చంపుతాను అనే వాడు. కాని మరునాడు అంతా మరిచిపోయే వాడు అదేమి చిత్రమో. మరొక విషయము వినండి. ఘటోత్కచుడి మరణసమయాన శ్రీకృష్ణుడు రథము మీద నాట్యం చేసాడు కదా ! పాండవ శిబిరానికి వెళ్ళి చాటుగా ఉండి వారి మాటలు విన్నాను. కృష్ణుడు ప్రవర్తనకు కారణమేమిటని అర్జునుడు అడిగిన విషయం పక్కనే ఉన్న సాత్యకి విని " అన్నయ్యా ! కర్ణుడు ఇంత కాలము మహా శక్తిని ప్రయోగించి అర్జునుడిని ఎందుకు చంప లేదు " అన్నాడు. కృష్ణుడు " సాత్యకి ! సుయోధనాదులు ప్రతి రోజు ఆ శక్తి ఆయుధంతో అర్జునుడిని చంపమని చెప్తుండే వారు. నేను కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించగానే నా మాయలో పడవేసి అతడికి ఆసక్తి ఆయుధం గుర్తుకు రాకుండా చేసేవాడిని. ఆ కారణంగా కర్ణుడుఅర్జునుడి మీద ఆ శక్తి ప్రయోగించ లేక పోయాడు. సాత్యకీ ! నీ కంటే, ధృష్టద్యుమ్నుడి కంటే మిగిలిన పాడుసుతుల కంటే నాకు అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ. అర్జునుడు నా బహిర్ప్రాణం ఇంత కాలం కర్ణుడి వద్ద ఉన్న శక్తి కారణంగా అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నదని భయపడుతునే ఉన్నాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక నేను సుఖంగా నిద్రిస్తాను " అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునుకి చెప్పాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! దురదృష్టం సుయోధనుడిని వెన్నంటి ఉన్నప్పుడు మనమేమి చేయగలము " అన్నాడు.
*ఘటోత్కచుని మరణానికి ధర్మజుడు విలపించుట*
ఘటోత్కచుడి మరణానికి దుఃఖంతో ధర్మరాజు రథము మీద కూలబడి రోదిస్తున్నాడు. కృష్ణుడు దగ్గరకు వెళ్ళి " ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధమున వీరులు మరణించరా ! అందుకు ఇంత చింతించ తగునా ! నీవిలా చింతించిన సైన్యమును నడుపగల వాడేవడు. నీ సోదరులను ఓదార్చగలవారెవరు లే వారిని ఓదార్చి యుద్ధసన్నద్ధులను చేయి " అన్నాడు. నీకు తెలియనిది ఏముంది ఘటోత్కచుడికి మేమంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మమ్ము ఎంత గౌరవిస్తాడో. అరణ్యవాస సమయంలో మాకు ఎంత సహకరించాడు. నాకు ఘటోత్కచుని మీద సహదేవునికన్నా ప్రేమ ఎక్కువ. అటువంటి ఘటోత్కచుడు మరణుస్తే దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. అంతలోనే ఉగ్రుడై కృష్ణా ! దీనికంతటికి కారణం కర్ణుడు నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణం అయ్యాడు. నేడు ఘటోత్కచుడిని స్వయంగా చంపాడు. కర్ణుడి మీద ప్రతీకారం చేయాలి. కర్ణుడికి సాయం చేసిన వాడు ద్రోణుడు నేను కర్ణుడిని చంపుతాను భీముడు ద్రోణుడిని చంపుతాడు " అంటూ తన రథమును వేగంగా ముందుకు నడిపాడు. కృష్ణుడు కలవరపడి అర్జునా ! అటు చూడు మీ అన్నయ్య కర్ణుడి మీద యుద్ధానికి పోతున్నాడు అతడిని అనుసరించు అన్నాడు. అలా వేగంగా పోతున్న ధర్మరాజు ఎదుటికి వ్యాసమహర్షి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ఉపయోగించబడింది లేకున్న అర్జునుడిని చంపి ఉండే వాడు. అది జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది ధుఃఖంతో బయటపడటం మంచికే జరిగింది. కనుక అకారణంగా కోపం తెచ్చుకొనక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు. ఇకొంక విషయం చెప్తాను. నేటికి సరిగా అయిదవ నాటికి నిన్ను విజయలక్ష్మి వరిస్తుణంది. దీనిలో సందేహం లేదు " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి