5, జులై 2025, శనివారం

18-37-గీతా మకరందము

 గీతామకరందము:

18-37-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అll సాత్త్వికసుఖముయొక్క లక్షణమును వచించుచున్నారు –


యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ | 

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం 

ఆత్మబుద్ధి ప్రసాదజమ్ || 


తా:- ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.


వ్యాఖ్య: - అధ్యాత్మక్షేత్రమున సాధకునకు అభ్యాసకాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ఠ, ధ్యాన, వైరాగ్యాదులు ఒకింత కష్టముగా తోచవచ్చును. కాని అభ్యాసము, సాధన పూర్తియగుకాలమున అమృతతుల్యముగ నుండును. ఆత్మసుఖము నవి కలుగచేయును - అని యిచట వచింపబడినది. కావున సాధనదశలోగాని, అభ్యాసకాలములో గాని ఎవరికైనను కష్టముకలిగినచో, విసుగు జనించినచో, అధైర్యపడక, అది వాస్తవమగు బాధ కాదనియు, పరిణామమున అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధనను విడనాడక ధైర్యముతో కొనసాగించవలెను. కనుకనే "విషమివ' అని చెప్పిరేకాని "విషమ్” అని చెప్పలేదు. అనగా ఆ ప్రారంభకష్టము విషమువలె తోచునేగాని వాస్తవముగ విషముకాదని భావము. ఇచట ప్రయోగించిన ‘ఇవ' అను పదమునందు గొప్ప అర్థముకలదు. ‘బాధవలె తోచునేకాని బాధకాద’ని ఆ పదమువలన స్పష్టమగుచున్నది. ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్జితములైన పాపవాసనలకును, ఆధునిక పుణ్యవాసనలకును, మధ్యగలుగు సంఘర్షణమే యగును. పుణ్యవాసనలు బలమై, పాపవాసనలను తొలగద్రోయునపుడు అవి వెడలి పోవుచు పోవుచు జీవుని గిల్లిపోవును. ఆ నొప్పియే ఈ 'విషమివ' అనుదాని యర్థము. అదియే జీవుని ప్రారంభబాధ. వాస్తవముగ అది బాధకాదు. అనుపమ సుఖమునకు నాందియే యగును.

     ఒకానొక రోగమునకు "వేపఉండ" అను మందు ఇచ్చుదురు. అది చేదుగా నున్నను ఆరోగ్యమును గలుగజేయును. ఔషధము సేవించునపుడు అప్రీతిగానున్నను - బలవంతముగా నైనను సేవించవలసినదే ఆరోగ్యముకొఱకు. ఒక ఱాయి దేవవిగ్రహముగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తినునట్లును; బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తిదెబ్బలు తినునట్లును - అనంతమగు బ్రహ్మానందము ననుభవించుటకు ముందు జీవుడొకింత త్యాగము చేయవలసియుండును. అట్లు అల్పసుఖమును వదలునప్పుడు ఒకింత దుఃఖము కలుగవచ్చును. అనేక జన్మలనుండి ఆ విషయసుఖములను బంధువులు జీవుని హృదయగేహములో నివసించుచున్నారు. వారు పోవునపుడు బంధువియోగమందువలె తాత్కాలిక ఆవేదన కొంతకలుగును. అంతమాత్రముతో సాధకుడు బెదరిపోరాదు. కొంత ఓపికబట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాల మేతెంచును.

ఒక విద్యార్థిదశలో రేయింబవళ్లు కష్టపడి చదువును. తదుపరి ఉద్యోగకాలమందు సుఖించును. అట్లే అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించునపుడు, అంతర్యుద్ధఫలితముగ కొంత ప్రయాస కలిగినపుడు దానిని సహించుకొని ముందునకు సాగిపోవలెను. అంతియేకాని భయపడి సాధనను విరమించరాదు. కనుకనే భగవానుడిచట సాత్త్వికసుఖముయొక్క నిజస్థితిని తెలుపుచున్నారు. విషరూపదుఃఖములో అమృతరూప సుఖముయొక్క బీజములున్నవని సెలవిచ్చిరి. తాత్కాలికకష్టరూపమగు ఆ విషము నెట్లైనను దిగమ్రింగివేసినచో వానిలోనగల అమృతబీజము లపుడు మొలకెత్తును. ఇది విషమువలె నున్నదికదాయని పారవేసినచో దానిలోని అమృతబీజములనుగూడ జనులు పోగొట్టుకొనినవారగుదురు. కాబట్టి సాధకు లివ్విషయమున కడు జాగరూకులై యుండి భగవానుని ఈ అమూల్యోపదేశము జ్ఞప్తియందుంచుకొని అనంతాత్మసుఖము తమకై వేచియున్నదని భావించి, కష్టసహిష్ణువులై, త్యాగశీలురై, సాధనను విడువకుండ చేయుచునే యుండవలెను. కనుకనే ‘కశ్చిద్ధీరః’ - ఏ ఒకానొక ధీరుడో (అన్నికష్టముల నోర్చుకొని) ప్రత్యగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడినది. శ్రీ బుద్ధదేవుడు, శ్రీ రామకృష్ణపరమహంస మున్నగువారి సాధనకాలజీవితములను చూచినచో ఈ సత్యము బోధపడగలదు.


     మఱియు 'అమృతోపమమ్'- అమృతమునుబోలి అని యిచట చెప్పుటయు చాల సమంజసముగా నున్నది. ఏలయనిన, ఆత్మసుఖము, దైవసుఖము దేవతల అమృతమును పోలినదేకాని, జడమగు ఆ దేవతల అమృతముకాదు. దానికంటె ఎన్నికోట్ల రెట్లో అధికశక్తివంతమైనదది. దేవతల యొద్దగల అమృతము స్థూలదేహమునకు కొంతకాలము మృతిలేకుండ నివారించును. కాని ఈ ఆత్మసుఖరూపమగు అమృతము

శాశ్వతముగ జననమరణ సంసారప్రవాహమునుండి జీవుని తప్పించివేయును.


"ఆత్మబుద్ధి ప్రసాదజమ్”- ఆ సాత్త్వికసుఖము (ఆత్మసుఖము) యెట్లు కలుగగలదు? బుద్ధి నిర్మలముగానున్నచో, విషయదోషము లెవ్వియు లేకయుండినచో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె ఆత్మసుఖము అందు గోచరింపగలదు. అనుభూతము కాగలదు. కాబట్టి సుఖము నపేక్షించువారు మొట్టమొదట తమబుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను.


 "మోక్షమెచటనున్నది? సుఖమెచటనున్నది?”- అని కొందరు ప్రశ్నించుదురు. దానికి భగవాను డిచట సమాధాన మొుసంగిరి. మోక్షము, దైవసుఖము ఆకాశములో లేదు. పాతాళములో లేదు. నిర్మలమగు తన బుద్ధియందే కలదు. ఈ యర్థమునే శ్రీ వసిష్ఠమహర్షియు శ్రీరామచంద్రున కిట్లు బోధించిరి -

న మోక్షో నభసః పృష్ఠే 

పాతాలే న చ భూతలే 

మోక్షో హి చేతో విమలం సమ్యగ్జ్ఞానవిబోధితం (శ్రీ వసిష్ఠగీత).


ప్ర:- సాత్త్వికసుఖముయొక్క లక్షణమేమి?

ఉ:- ప్రారంభములో (అభ్యాసకాలములో) విషమువలె కష్టముగతోచి తుదకు అమృతమువలె సుఖదాయకముగ నుండునది సాత్త్వికసుఖము.

ప్ర :- అట్టి సాత్త్వికసుఖము జీవున కెట్లు కలుగును?

ఉ :ー నిర్మలబుద్ధినుండి ఆ సుఖము జనించును. కావున సుఖాభిలాషి బుద్ధిని నిర్మలమొనర్చుకొనవలయును.

ప్ర:- కాబట్టి జీవుని కర్తవ్యమేమి?

ఉ:- ఆధ్యాత్మికసాధనలు గావించునపుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ విశ్వాసముంచి, సాధనను ధైర్యముతో కొనసాగించి, బుద్ధియందు విషయదోషమెద్దియు లేకుండ అద్దానిని సునిర్మలముగా గావించవలెను. అత్తఱి మహత్తరమగు ఆత్మసుఖ మాతనికి అనుభూతము కాగలదు. అదియే మోక్షము.

కామెంట్‌లు లేవు: