🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏
మొదటి భాగం
ముందు హిందువుగా పుట్టడం ఒక అదృష్టమయితే బ్రాహ్మణునిగా జన్మించడం, వేదాధ్యయనం చేసి పురోహితుడు కావడం జన్మాన్తర సుకృతం అనే చెప్పాలి. వివాహ వ్యవస్థలోని సంప్రదాయాలు వ్రాస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపు ఉండవచ్చు. అలాగే వధూవరుల వస్త్రధారణలోనూ, భాషికములువిషయాలలోనూ. అలాగే గోదావరి జిల్లాల్లో తెలుపు తలంబ్రాలు, మిగిలిన ప్రాంతాల వారు పసుపు తలంబ్రాలు ఉపయోగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు అనుకోండి. ఋగ్వేద సంప్రదాయంలో అయితే ముందు తలంబ్రాలు తరువాత తాళిగట్టుట జరుగును.
సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర:
తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:
ఈ మంత్రములో పతి శబ్దం వాడబడినది. ఇక్కడ పతి అంటే ప్రజాపతి అని అర్ధం. ప్రజా అంటే సంతానం. పతి అంటే సంరక్షకుడు ప్రజాపతి అంటే సంతాన సంరక్షకుడు అని అర్ధం చెప్పుకోవాలి.
ఇక్కడ కొందరు విపరీతార్ధము చెప్పి ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అది మహాపచారం.
ప్రతి వధువు ఐదు సంవత్సరాలవరకు చంద్రుని సంరక్షణలో ఉండి ముఖకాంతిని పొందుతుంది. ఆపై చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి పది సంవత్సరాలవరకు శరీరక సౌందర్యం ఇచ్చి సంరక్షణ చేస్తాడు. ఆ తరువాత గంధర్వుని సాక్షిగా అగ్ని దేవుడు స్వీకరించి మానసిక శరీరక వికాసం నిచ్చి ఆమెను భర్తకు అప్పగిస్తాడు. వరుడు అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం అంటాము.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. నా ఆందోళన తెల్పి తరువాత విషయంలోకి వెడతాను.
ఈ రోజుల్లో ఎవరు పురోహితుల మంత్రాలు వినడం లేదు. వారిని గౌరవించడం లేదు. చాలా నీచానికి దిగజారి ఫొటోస్ కు అడ్డువస్తున్నారు అంటూ పురోహితులను విసుక్కుంటున్నారు. ఇది ఎంత దారుణమో ఈ విషయలో బ్రాహ్మణులు అతీతులు కారు. ఈ జాడ్యం అందరిలోనూ ఉంది.ఆలోచించండి.ముందు బ్రాహ్మణుల్లో మార్పు వచ్చి సంస్కరింపబడాలి. తరువాత మిగిలిన వారికి చెప్పవచ్చు.. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. హిందూ సంస్కృతిని ఎటువైపు తీసుకొని వెడుతున్నారు.
వివాహ ఘట్టాలను చదివి తెలుకుంటే దంపతుల మధ్య ప్రమాదకరమైన అభిప్రాయభేదాలు ఉండవు.
విడాకులు అనే మాట ఉండదు. నా మాట నిజం నమ్మండి.ఇక విషయంలోకి వెడదాము.
ముఖ్య ఘట్టలాను పరిశీలిద్దాం.
వివాహము మహా పవిత్రమైన విషయం.
మంగళ స్నానములు:- కొందరు ముత్తైదువులు సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులకు మంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు.
మంగళాష్టకాలు:- నూతనవధూవరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.
బాషికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాషికధారణ చేస్తారు.
(బ్రాహ్మణులలో కొందరికి ఈ సంప్రదాయం లేదు)
కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.
కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -
'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా "
భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.
విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై
భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను
.
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే
భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.
నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు.
సమీక్షణం:- వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నూరి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది. జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి