*రేపు తొలి ఏకాదశి (శయనైకాదశి)*
తొలి ఏకాదశి - ఏం చేయాలి..?
తిథుల్లో ఏకాదశి మంచిది. అందులో తొలి ఏకాదశి మరింతా పవిత్రమైంది. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతం ఈ రోజే మొదలవుతుంది. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు కనుక తొలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు.
ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది ఆషాడమాసంలోనే. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభమైన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశిగా ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ పూర్వ కాలంలో ఏరువాక వేడుకల్లో భాగంగా చేసేవారు.
దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువును పూజించి సేవిస్తారు. ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు. అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు మాసములను చాతుర్మాసాలు అంటారు.
విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. దాంతో ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతనికి ధర్మము తప్పడు, సత్యసంధుడు అనే పేరుంది. అతడు పాలించే రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణ గాథ.
ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే, భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. అయిదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం.
ఆధ్యాత్మిక గురువులు, పీఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి 4 మాసముల కాలం పాటు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు. అందువలన ఈ దీక్ష కాలమును 'చాతుర్మాస్య దీక్ష'గా పిలుస్తారు. ఈ దీక్షా కాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు. ఏకాదశి వ్రతం ఆచరించే వారితో పాటు అందరికి ఉపవాసం శ్రేష్టం.
ఏం చేయాలి..?
ప్రతి మాసంము వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి 4 మాసముల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై నిద్రిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాల కథ. అంటే వ్రతం తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.
అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉంది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు.
తినగూడని, విసర్జించవలసిన పదార్థాలు
గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ 4 నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతాకల్పం ప్రారంభించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు పురాణాల్లో ఉంది.
ఈ 4 మాసముల పాటు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువును నివేదన చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి యతులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం. గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి