5, జులై 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*



*428 వ రోజు*


*భీమసేనుడిని ధర్మరాజు మందలించుట*


యుద్ధ పరిమాణాన్ని చూసి ధర్మరాజు ఆవేశపడి అవేదనగా " భీమసేనా ! ఆగు ఏమిటీ పిచ్చితనం. ఈ పిచ్చి ప్రేలాపన ఏమిటి. ఆ తల తన్నడం ఏమిటి ! ఇది అధర్మం అన్యాయం చూడ్డానికే సిగ్గు, అసహ్యం వేస్తుంది. యుద్ధంలో సకల సైన్యాలనూ, బంధు మిత్రులనూ పోగొట్టుకుని నా మాట మన్నించి నీతో గదా యుద్ధానికి సిద్ధమై వీరోచితంగా పోరాడి నేలకూలిన సుయోధనుడి తలను తన్నడం న్యాయమా ! ధర్మమా ! లోకం హర్షిస్తుందా ఇంత వరకు భీమసేనుడు ధర్మం తప్పడని పేరు పొందావు. నేడు గర్వంతో విర్రవీగుతున్నావు నీకు ఇందు కలిగిన ప్రయోజనం ఏమిటి ! నీకిది అపకీర్తి కాదా ! " అని భీమసేనుని మందలించి " సుయోధనా ! విధి వక్రించి మన మధ్య వైరం ఏర్పడింది. ఒకరిని ఒకరు ద్వేషించుకుని సర్వం పోగొట్టుకుని ఈ స్థితికి వచ్చాము. బాల్యం నుండి నీకు అలవడిన లోభం, మదం, మాత్సర్యం, అధర్మం నిన్నీ పరిస్థితికి చేర్చాయి. నీ వలన మన ఇద్దరి బంధుమిత్రులు నశించారు. ధృతరాష్ట్రుడి కోడళ్ళందరకూ వైధవ్యం ప్రాప్తించింది. ఇందుకు నువ్వే కారణమని లోకం నిందిస్తుంది " అని సుయోధనుడిని ఓదార్చాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు.


*బలరాముని ఆవేశం*


సంజయుడు చెప్పిన దృష్టాంతం విని ధృతరాష్ట్రుడు " సంజయా ! భీమసేనుడు అధర్మంగా నా కొడుకు తొడలు విరుగ కొట్టి పడత్రోయటం చూసిన బలరాముడు తన శిష్యుడైనన భీమసేనుని ఏమీ అనలేదా ! " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! భీమసేనుడు సుయోధనుడిని తొడలు విరిచి పడ గొట్టగానే బలరాముడు కోపంతో పైకి లేచి అక్కడి మహారాజులను చూసి " చూసారా ! ఈ భీమసేనుడి ఆగడం. ఈ అధర్మ యుద్ధం ఎక్కడైనా చూసారా ! గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం కాదా ! భీముడు ఇలా సుయోధనుడిని నాభి క్రింద కొట్టి కూల్చడం న్యాయమా ! " అని హలాయుధం పట్టుకుని భీమసేనుడి వైపు పోసాగాడు.


*శ్రీకృష్ణుడు బలరాముని ఆపుట*


అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని వద్దకు వెళ్ళి ఆయనను రెండు చేతులతో పట్టి వారించి " అన్నయ్యా ! తాను తనమిత్రులు వృద్ధిలోకి రావడం శతృవు అభివృద్ధిని నిరోధించడం మానవ లక్షణం. మిత్రునికి ద్రోహం జరుగుతున్నప్పుడు ఆదుకొనడం ధర్మం పాండవులు మనకు బంధువులు, మిత్రులు, విశేషించి మనకు మేనత్త కొడుకులు. అర్జునుడు మన చెల్లెలు సుభద్రకు భర్త. వారంతా అధర్మపరులైన కౌరవుల చేత అవమానించబడి ఇడుముల పాలయ్యారు. కనుక పాడవులను ఆదుకోవడం అభివృద్ధికి తోడ్పాటు అందించడం మన ధర్మం కాదా ! క్షత్రియులకు ప్రతిజ్ఞ చేయుట ధర్మం భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట అధర్మం ఎలా ఔతుంది. అన్నయ్యా ! సుయోధనుడి తొడలను భీమసేనుడు తన గదతో భగ్నపరచగలడు అని మైత్రేయ మహర్షి చెప్ప లేదా ! మహా ముని శాపం అసత్యం ఔతుందా ! ఇందు భీమసేనుడి దోషం ఏముంది కనుక నీ అకారణ కోపం ఉపశమింప చేసి శాంతింపుము " అని బలరాముని అనునయించాడు. కాని బలరాముని కోపం తగ్గ లేదు. " కృష్ణా ! ధర్మార్ధ కామ మోక్షములు ఒక దానికి ఒకటి అనుసంధానింపబడి ఉన్నాయి. అవి ఒక దానిని ఒకటి నాశనం చేసుకోవచ్చా ! పురుషార్ధములలో ధర్మాన్ని పక్కన పెట్టి మిగిలిన పురుషార్ధములను పొందు వాడు నిందితుడు కాదా ! నీవు భీముని ప్రతిజ్ఞ, ముని శాపం అంటున్నావు. వాటిని నెరవేర్చుట కొరకు ధర్మం తప్పి ప్రవఎర్తించుట న్యాయమా ! ఏది ఏమైనా భీముడు గదాయుద్ధంలో ధర్మం తప్పి ప్రవర్తించాడనడం కాదన లేని సత్యం " అని చెప్పాడు. కృష్ణుడు " అన్నయ్యా ! ఈ లోకం నిన్ను లవలేశం అయినా దోషం లేని వాడు, ధర్మ నిరతుడు, చక్కని నడవడి కల వాడుగా కీర్తిస్తుంది.


.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: