చూపున్న మాట
వానల్లో ఈవీ.. జాగ్రత్తలు ఇవీ..
తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణహిత విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చితే ప్రయాణ ఖర్చు తక్కువ అవుతుండడంతో ప్రజలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిచోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని వారు సూచిస్తున్నారు.
100 శాతం... వద్దు!
వానల్లో ఈవీ.. జాగ్రత్తలు ఇవీ..
బ్యాటరీలు ఫుల్‌ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80 శాతం వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది.
దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్ చేస్తుంటారు. వాహనం అప్పటికే వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా ఒత్తిడి పెరిగి, పేలిపోయే అవకాశం ఉంది.
ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా చూసుకుంటే మంచిది. బండి కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్ పెట్టాలి.
సర్వీసింగ్ ఎప్పుడు?
వాహనంలో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది. లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్ ఆపేసి బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి.
బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కు తుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే చల్లబడుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్‌ని సంప్రదించాలి.
వాహనం సరిగ్గానే నడుస్తున్నా.. ప్రతి మూడు నెలలకోసారి తనిఖీ చేయించాలి.. ఆరు నెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయించాలి.
వర్షాకాలంలో ముసురు, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రికల్ కనెక్టర్లు, వైర్లు, రంగు లేని చోట వాహనం తుప్పు పడుతుంటుంది.
వాటర్ ప్రూఫ్ ఉన్నా.. నీటిలో ఉన్నప్పుడు అరగంట వరకే అది రక్షణ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి