26, సెప్టెంబర్ 2020, శనివారం

15-06-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అట్టి పరమాత్మపదమును బొందినవారు తిరిగిరారని అనగా మఱల జన్మబంధమున తగుల్కొనరని వచించుచున్నారు –


న తద్భాసయతే సూర్యో 

న శశాఙ్కో న పావకః | 

యద్గత్వా న నివర్తన్తే  

తద్ధామ పరమం మమ || 


తాత్పర్యము:- ఆ (పరమాత్మ) స్థానమును సూర్యుడుగాని, చంద్రుడుగాని అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు. దేనిని పొందినచో (జనులు) మఱల (ఈ సంసారమునకు) తిరిగిరారో అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము (అయియున్నది).


వ్యాఖ్య:- సూర్యచంద్రాగ్నులు దృశ్యవస్తువులను ప్రకాశింపజేయుచున్నవి. నేత్రము ఆ సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నది. బుద్ధి ఆ నేత్రమును ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేయుచున్నది. కావున ఇక సూర్యాదులు ఆత్మ నెట్లు ప్రకాశింపజేయగలవు? ముండకోపనిషత్తునందు ఈవిషయము చక్కగ నిరూపింపబడినది. (న తత్ర సూర్యో భాతి..... ).


"యద్గత్వా న నివర్తన్తే" -.             


            ఆత్మస్థానమును బొందినవారు మఱల జన్మపరంపరలందు, సంసారదుఖరూపగర్తమందు పడరు. బ్రహ్మాండమునం దేలోకమునకేగినను మఱల తిరిగి రావలసినదే. మఱల జన్మింపవలసినదే. దుఃఖము నంతముచేయగలశక్తి వానికిలేదు. కాని ఒక్క పరమాత్మస్థానమునకు మాత్ర మట్టి శక్తికలదు. అద్దానిని బొందినవారు తిరిగిరారు. మఱల దుఃఖప్రదమగు ఈసంసారమున జన్మింపరు. పునరావృత్తిరహిత శాశ్వత కైవల్యపదమే అయ్యది. ఈ విషయమునే పై శ్లోకములో "యస్మిన్గతా న నివర్తన్తి భూయః" అని తెలిపియుండిరి.

తనయొక్క స్థానమును వర్ణించుచు భగవానుడు "పరమమ్” (శ్రేష్ఠమైనది) అని పేర్కొనినందువలన భగవానుని దృష్టియం దన్ని పదములలోనికి ఆ యాత్మపదమే, బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్ఠమను అభిప్రాయమును వెలిబుచ్చినట్లైనది. కావున దేవునిదృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞుడనుసరించవలెనుగాని ప్రాపంచికజనులదృష్టిలో గొప్పదగు వస్తువునుగాదు.

కామెంట్‌లు లేవు: