26, సెప్టెంబర్ 2020, శనివారం

*శ్రీ నరసింహ శతకము*

 : 




*(99) అమరేంద్రవినుత నిన్ననుసరించినవారు ముక్తిబొందిరి వేగ ముదముతోడ*


*నీ పాదపద్మముల్ నెరనమ్మి యున్నాను నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర*


*కాచి రక్షించినన్ కడతేర్చు వేగమే నీ సేవకుని జేయు నిశ్చయముగ*


*గాపాడినను నీకు గైంకర్యపరుడనై చెలగి నీ పనులను చేయువాడ*


*ననుచు బలుమారు వేడెద నబ్జనాభ నాకు బ్రత్యక్షమగుము నిన్ నమ్మినాను*


*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*




శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.




తండ్రీ! సురరాజ పూజితా! నిన్ను అనుసరించిన వారు శీఘ్రముగా ముక్తిని పొందినారు. కమలనేత్రా! నీ చరణకమలాలను నమ్మియున్న నాకు ముక్తిని ప్రసాదింపుము. నన్ను కాపాడి, కడతేర్చి, తొందరగా నీ దాసుని చేసుకో. నన్ను పూర్ణంగా నీకు సమర్పించుకొని, అతిశయించి నిన్ను సేవిస్తాను. నిన్ను పదేపదే యాచిస్తున్నాను. పద్మనాభా! నిన్నే నమ్మియున్నాను. నాకు ప్రత్యక్షము కమ్ము.




*జై నారసింహా*

కామెంట్‌లు లేవు: