26, సెప్టెంబర్ 2020, శనివారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఏడవ శ్లోక భాష్యం - రెండవ భాగం


ఎనిమిది జానల శరీరంలో శిరస్సు ప్రధానమైనది కదా! అసలు ముఖం అన్న పదం నుండే ముఖ్యమనే పదం పుట్టింది. అంబిక ముఖమెలా ఉంది ? శరత్కాలపు చంద్రునివలె ఉందట. *పరిణత శరచ్చంద్ర వదనా* – శరత్కాలపు చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. వెన్నెల పిండారబోసినట్లుందంటామే అది ఆ కాలంలోని వెన్నెల గురించే! ఆ కాలంలో రాత్రిపూట వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. *పరిణత* అంటే పూర్తిగా పరిణతి చెందినదన్నమాట.


అంబిక ముఖము శరత్కాల పౌర్ణమి చంద్రునివలె ప్రశాంతంగా ఉంటుందట. చంద్రుని బోలిన అంబిక ముఖము కరుణ అనే వెన్నెలను కురిపిస్తుందన్న మాట. ఆచార్యులవారు అరవైమూడవ శ్లోకంలో *స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం* అంటారు.


ఒక దేవతామూర్తిని, ఆ మూర్తికి ఎన్ని చేతులున్నదీ, ఏ ఏ ఆయుధాలు ధరించినదీ అనే విషయాల ఆధారంగా గుర్తిస్తారు. *ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః* - ఆచార్యులవారు వర్ణించిన దేవతామూర్తి ఆ నాలుగు చేతులలో – విల్లు, బాణాములు, పాశము, అంకుశములను ధరించింది. శ్రీవిద్యాధిదేవత అయిన లలితా త్రిపుర సుందరికి లేదా కామేశ్వరికి చెందిన గుర్తులు ఇవి. పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో ధనుర్బాణములు ఉంటాయి. ఈ ధనుర్బాణములు మన్మథునికి మాదిరి చెఱుకువిల్లు, పూలబాణములే!!


*రాగద్వేషములు* – లోతుగా పరిశిలిస్తే మన లౌకిక జీవనమంతా ఈ రెంటి ద్వారానే చుట్టుముట్టబడినట్లు అర్థమవుతుంది. ఇవే కామక్రోధములు. ఈ రెంటినీ అదుపులో ఉంచుకోవాలి. చిత్రమేమంటే ఈ రెండిటి పుట్టుక అంబిక లీలే! ఆమె అనుగ్రహం వల్లనే అంతమవుతాయి. ఈ విషయం స్ఫురణలో ఉంచుకొన్నపుడే ఆ రెంటినీ అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. అంబిక చేతిలో పాశమున్నదే అదే ఈ రాగము లేక కామము. ఇక అంకుశమున్నదే అది ద్వేషము లేక క్రోధము. అంబిక వేయిపేర్లలో *రాగస్వరూప పాశాఢ్యా*, *క్రోధాకారాంకుశోజ్వలా* అన్న రెండు పేర్లున్నాయి.


ఆశ పాశము వంటిది. మనం వాడుకలో కూడా ఆశాపాశం అంటూ ఉంటాం. ఈ ఆశాపాశం మనలను కట్టిపడవేస్తుంది. ఇక క్రోధము అంకుశం వంటిది. అది గుచ్చుకొని ఉసిగొల్పుతుంది. మన కోపాన్ని ఇతరుల లక్ష్యపెట్టకపోవచ్చు. కానీ అది మనకు చేసిన పుండు సలుపుతూనే ఉంటుంది. ఎవరి కోపం వారికే పొడుచుకొంటుంది. 


ఆధునిక విజ్ఞాన వేత్తలు కూడా కోపము ఎంతో శక్తిని వృధా చేస్తుందని చెబుతున్నారు. శాస్త్రంలో చెప్పబడిన ఇంకో విషయంతో కూడా వారు ఏకీభవిస్తున్నారు. మనకు నచ్చని విషయాలపై నిప్పులు కక్కుతూ మనం వృధా చేసే సమయం కన్నా మనకు ఇష్టమైన విషయాలలో చిక్కుకు పోయినప్పుడు ఎక్కువ శక్తి వృధా అవుతుందట. కామం మనకు హితంగా ఉన్నట్లు కనిపిస్తూ గోతులు తవ్వే సామర్థ్యం కలది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

సేకరణ

కామెంట్‌లు లేవు: