26, సెప్టెంబర్ 2020, శనివారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము*


 తృతీయ స్కంధం -30


కర్దమునికిహరిప్రత్యక్షంబగుట 


ఓ పుణ్యాత్ముడవైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుని చేత ప్రజలను సృష్టించడానికి కర్దమ మునీశ్వరుడు నియమింపబడ్డాడు. అందుకు కర్దముడు సంతోషించి…ధీరుడైన ఆ ముని సరస్వతీ నదీతీరంలో పదివేల దేవతా సంవత్సరాలు విడువకుండా తపస్సు చేస్తూ ఒకనాడు ధ్యానతత్పరుడై, ఏకాగ్రచిత్తంతో అత్యంత సంతోషంతో…వరాల నిచ్చేవాడూ, దయతో కోరిన కోరికలను తీర్చే స్వభావం కలవాడూ, దేవతల చేత నమస్కరింపబడేవాడూ, లక్ష్మీపతీ, పాపాలను తొలగించేవాడూ, సుదర్శన చక్రాన్ని ధరించేవాడూ అయిన విష్ణువును ఆరాధించగా ఆ దేవుడు కరుణించి…

ఆకాశంలో ప్రత్యక్షం కాగా…సూర్య చంద్ర కిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, కలువపూలతోను కట్టిన అందమైన పూలమాలను ధరించినవాడూ, కంకణాలను, నూపురాలను, కంఠాభరణాలను, ఉంగరాలను, రత్నహారాలను, మకర కుండలాలను, కిరీటాన్ని ధరించి ప్రకాశించేవాడూ, అందమైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో అలంకరింపబడి మెరిసే వక్షస్థలం కలవాడూ, సొగసైన చిరునవ్వు వెన్నెలతో ప్రకాశించే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నవాడూ, శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించినవాడూ, తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలభాగం కలవాడూ, పచ్చని పట్టువస్త్రం ధరించినవాడూ, మందహాసంతో దయ పొంగిపొరలే చూపులు కలవాడూ, పద్మనాభుడూ అయిన హరిని…ఇంకా శబ్దబ్రహ్మమే శరీరంగానూ, అస్తిత్వమే ఆత్మగానూ కలిగి జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోదగినవాడై గరుత్మంతుని మూపుమీద పాదపద్మాలు మోపి ఉన్న ఆ గోవిందును చూచి కర్దముడు ఆనంద తరంగాలతో పరవశుడై కోరిక తీరినవాడై సాష్టాంగ ప్రణామాలు చేసి…చేతులు జోడించి నిర్మలమైన భక్తిభావంతో మైమరచి వికసించిన పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుముఖాన్ని చూస్తూ ఇలా అన్నాడు. ఓ పుండరీకాక్షా! అఖిల ప్రాణులకు అంతరాత్మవై ఉండే నీ దర్శనం కోరి పురాకృత పుణ్యంతో నిండి అనేక జన్మలుగా నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు కీర్తిస్తుంటారు. అట్టి యోగీశ్వరులకు ఈశ్వరుడవైన నీ పాదపద్మాలను దర్శించాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయారూపా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం ఇప్పుడు లభించింది. అంతేకాక దేవా! నీ మాయవల్ల సమ్మోహితులై మతిమాలినవారై సంసార సముద్రాన్ని దాటించే నీ చరణకమలాలను తుచ్ఛమైన కోరికలతో ఆరాధించి, నరకపు దారి పట్టే కాముకుల కోరికలను కూడ నీవు తీర్చుతూ ఉంటావు. అటువంటి కాముకులను నిందించే నేనుకూడ గృహయజ్ఞ నిర్వహణలో గోవువలె ఉపకరించేదీ, అన్నింటికీ మూలమైనదీ, ధర్మార్థకామములకు నెలవైనదీ, అనుగుణమైన నడవడి గలదీ అయిన భార్యను పెండ్లాడాలని కోరి కల్పవృక్షమూలాల వంటి నీ పాదపద్మాలను సేవించాను. అయినా ఒక విశేషం ఉంది. విన్నవిస్తాను విను. పరబ్రహ్మ స్వరూపుడవైన నీ వాక్కులు అనే త్రాళ్ళతో బంధింపబడిన ప్రజలు కామోపహతులైనారట. నేను కూడా వారిని అనుసరించడం కాలాత్మకుడవైన నీకు ఇష్టమైన విధంగా కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించడానికే కాని కామం కోసం కాదు. నీ మాయచేత నిర్మించ బడినదీ, కాలాత్మకమైన మహావేగం కలదీ, అక్షర పరబ్రహ్మాన్ని అనుసరించి తిరిగేదీ, అధిక మాసంతో కలిసి పదమూడు నెలలు అనే ఆకులు గలదీ, మూడువందల అరవై అహోరాత్రాలు అనే కణుపులు గలదీ, ఆరు ఋతువు అనే చుట్టు పట్టా కలదీ, మూడు చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితాలైన క్షణాలు అనే ఆకులతో విరాజిల్లేదీ, అయిన కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మ్రింగివేయటానికి ఆసక్తి కలదై కామోపహతులైన వారిని అనుసరించే పశుప్రాయులైన లోకులను విడిచి, సంసార తాపాన్ని శాంతింపచేసే నీ పాదాలనే గొడుగుల నీడలను ఆశ్రయించిన వారినీ, నీ గుణవర్ణనమనే అమృతరసాన్ని అస్వాదిస్తూ దేహధర్మాలను లెక్కచేయని నీ భక్తులైనవారి ఆయుస్సును హరించడానికి సమర్థం కాదు” అని పలికి…పుణ్యాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! నీవు ఒక్కడివే అయినా నీ మాయవల్ల పుట్టిన సత్త్వం మొదలైన శక్తులు సాలీడు సాలెగూడును సృష్టించి మళ్ళీ తనలో లీనం చేసుకున్నట్టు ఈ లోకాలు పుట్టడానికి, వృద్ధిపొందడానికి, నాశం కావడానికి కారణభూత మౌతున్నాయి. అటువంటి నీ అపార లీలావిలాసమైన మహాసముద్రాన్ని దాటడం ఎవరికైనా సాధ్యం అవుతుందా?దేవా! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలచే సుఖం కలిగించే స్వరూపాన్ని వృద్ధిచేయడం మమ్మల్ని అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ఈ లోకవ్యాపారాలన్నీ ప్రవర్తింప చేస్తూ మా మనోరథ సిద్ధి అనే అమృతాన్ని నిండుగా వర్షించే నీకు నమస్కరిస్తున్నాను.” అని ఈవిధంగా కర్దముడు స్తోత్రం చేయగా విష్ణువు విని గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా కూర్చొని అనురాగంతో కూడిన చిరునవ్వు వెన్నెలలు వెల్లివిరిసే చల్లని చూపులతో ఆ మునీంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. మునీంద్రా! నీవు ఏమి కావాలని కోరి నన్ను భక్తితో ఆరాధించావో ఆ కోరిక నీకు తప్పక నెరవేరుతుంది సుమా!”అని పలికి ఇంకా “బ్రహ్మదేవుని కుమారుడూ చక్రవర్తీ అయిన స్వాయంభువ మనువు బ్రహ్మావర్త దేశంలో సప్తసముద్రాల నడుమ ఉన్న భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు. ఆ మహాత్ముడు రేపు తన భార్య శతరూపతో కూడి, పెండ్లి కావలసిన కూతురును వెంటబెట్టుకొని వచ్చి వయస్సులో, స్వభావంలో, సంకల్పంలో, ఉత్తమగుణాలలో నీకు తగినట్టి ఆ పుత్రికను నీకిచ్చి వివాహం చేస్తాడు. నీ కోరిక తీరుతుంది. నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఆ మనుపుత్రిక నిన్ను పెండ్లాడి, నీ వల్ల మిక్కిలి సౌందర్యవతులైన తొమ్మిదిమంది కుమార్తెలను కంటుంది. ఆ తొమ్మిదిమంది కన్యలకు మునులవల్ల ఉత్తములైన కుమారులు జన్మిస్తారు. నీవు నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్త కార్యాలనూ నాకు అర్పిస్తూ ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణికోటికి అవసరమైనప్పుడు అభయ మిస్తూ, దానాలు చేస్తూ, కరుణామూర్తివై, సుజ్ఞానివై, నాలో లోకాలన్నీ ఉన్నాయనీ, నీలో నేనున్నాననీ తెలుసుకొని నన్ను సేవించు. అంత్యకాలంలో నన్ను చేరగలవు. నీ తేజస్సువల్ల నేను నీ భార్య గర్భంలో ప్రవేశించి నా కళాంశతో నీ కుమారుడనై జన్మించి నీకు తత్త్వవిద్యను బోధిస్తాను.” అని ఈ విధంగా విష్ణువు కర్దమునికి తెలిపి అతడు చూస్తూ ఉండగా అంతర్ధానమై…సాటిలేని సరస్వతీ నదీజలాలతో పెంపొందిన గున్నమామిడి గుబురులతో కనువిందు చేస్తున్న బిందు సరోవరాన్ని దాటి, గరుత్మంతునిపై ఎక్కి, అతని రెక్కల కదలికల చప్పుళ్ళలో సలక్షణమైన సామగానాన్ని వింటూ ఆనందిస్తూ…హరి వైకుంఠానికి వెళ్ళాడు. అనంతరం కోరికలు కొనలుసాగగా జనులచేత నమస్కరింపబడే కర్దముడు పారవశ్యంతో వెంటనే బిందుసరోవరానికి వెళ్ళి, భక్తితో విష్ణువును స్మరిస్తూ ఉన్నాడు.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: