26, సెప్టెంబర్ 2020, శనివారం

🕉️విభూది మహిమ🙏🏼


          

దుర్వాస మహర్షి నిత్యం

పరమశివుని మనసులో

ధ్యానించి, విభూది ధరించి

నిత్యానుష్టానాలను ఆరంభించేవాడు.

ఒకనాడు ఉదయాన విభూది

ధరించి పితృలోకానికి బయల్దేరాడు దుర్వాస

మహర్షి. మార్గంమధ్యంలో హఠాత్తుగా

ఒక బావి కనిపించింది. 

గతంలో ఎన్నడూ 

ఆ మార్గంలో ఏ బావి కనపడేదికాదు. ఆ బావిలోయేమి వున్నదో అని ఉత్కంఠ తతో తొంగి చుశాడు మహర్షి. 

ఆ బావిలో పాపాత్ములు

చాలామంది బంధించబడివున్నారు. ఈ లోకాన పాపాలు చేసినవారు అందరూ ఆ నరక కూపంలో త్రోసివేయబడి వున్నారు. విషయం గ్రహించి తన పయనం సాగించాడు

దుర్వాస మహర్షి . ఇంతలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. దుర్వాస మహర్షి

తొంగిచూచి వెళ్ళిన వెంటనే ఆ నరక కూపం స్వర్గధామంగా

మారింది. ఆ కూపంలో ఆత్మలకు బాధలు కలిగించిన

విష జంతువులు , సర్పాలు సుగంధ సుమ మాలలుగా మారి

పోయాయి. సలసలమరిగే

నీరు సుగంధ పన్నీరుగా మారింది. 

తుఫానులాగ వీచిన ప్రచండ గాలులు

పిల్లతెమ్మరలుగా మారాయి. ఆ దుర్గంధ భూయిష్ట కూపం సుగంధంగా మారింది. ఇన్ని రోజులు యమయాతన పడిన ఆత్మలు అన్నీ మోక్షాన్ని పొందాయి. 

ఈ విపరీత పరిణామం చూసి ఆ నరకకూపంలో ఆత్మలను హింసిస్తున్న కింకరులు భయపడి యమధర్మరాజు వద్దకు వెళ్ళి 

మొరపెట్టుకున్నారు. నరక కూపం స్వర్గంగా ఎలా మారినదో తెలియని యముడు , వేగంగా వచ్చి 

ఆ కూపాన్ని చూశాడు. 

స్వర్గం నుండి ఇంద్రుడు కూడా వచ్చి చూసి , ఎలాగ జరిగినదీ తెలియక , విస్మయం చెందాడు. 

ఆశ్చర్యం తో తలమునకలై

దేవేంద్రుడు ,యముడు

కంగారుగా కారణం తెలుసుకుందుకి ఈశ్వరుని

వద్దకు వెళ్ళారు. 

నరక కూపం స్వర్గంగా ఎలా మారినదని ఈశ్వరుని అడిగారు.

త్రికాలజ్ఞుడైన ఈశ్వరునికా

నరకం స్వర్గంగా మారిన కారణం తెలియకుండా

వుంటుందా? 

పరమ శివభక్తుడైన దుర్వాసమహర్షి శాస్త్రానుసారం విభూది ధరించి

సదా తనని పూజించేవాడు . ఆయన

అనుకోకుండా ఆ పితృ కూపాన్ని తొంగి చూసినందువలన , ఆయన నుదుటి నుండి ఒక విభూది

కణం ఆ నరకకూపంలో పడినది. 

ఆ విభూది మహిమ వలన నరక కూపం స్వర్గంగా మారినది. " అని వారికి తెలిపాడు పరమశివుడు.

దుర్వాస మహర్షి నిత్యం ,ఉంగరపు వ్రేలు ,మధ్యవ్రేలు

చూపుడు వ్రేలు ఈ మూడు వ్రేళ్ళను కలిపి 'ఓం'కార మంత్రాన్ని జపిస్తూ

(అకార, ఉకార, మకార) నుదుటన

విభూదిని ధరించడం నియమంగా కలవాడు. 

ఈ విధంగా నిష్టగా ధరించే విభూది మహిమాన్వితమైనదని

మనకి యీ కధ తెలియచేస్తోంది.🙏🏼

కామెంట్‌లు లేవు: