26, సెప్టెంబర్ 2020, శనివారం

ఆదిపర్వము -31

 

ద్రోణుడు, ద్రుపద మహరాజు వైరం


భరద్వాజుని స్నేహితుడైన పృషతుడు అనే రాజు పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. అతను కుడా అడవులకు వెళ్లి భయంకరమైన తపస్సు చేసాడు. ఒకరోజు మేనకను చూసాడు,కామంతో అతనికి వీర్య పతనం అయింది. కాని దానిని అతడు తన పాదంతో కప్పివేసాడు. ఆ వీర్యంలోనుండి మరుత్తుని అంశతో ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశం వెళ్ళిపోయాడు.

భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. విలు విద్యను నేర్చుకుంటున్నారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నాడు. కృపుని చెల్లెలు అయిన క్రుపిని ద్రోణుడికి ఇచ్చి వివాహం చేసాడు భరద్వాజుడు. ఆ ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు, అతనే అశ్వత్థామ.

ఇదిలా ఉండగా పరశురాముడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. ధనం దానం చెయ్యమని అడిగాడు.

“ద్రోణా,నేను నా వద్ద ఉన్న ధనమంతయూ బ్రాహ్మణులకు దానం చేసాను. నా వద్ద ఇంక శస్త్రాస్త్రాలు మిగిలి ఉన్నాయి. నీకు కావలిస్తే అవి తీసుకో” అన్నాడు.

ద్రోణుడు సంతోషంగా సమ్మతించాడు. పరశురాముని వద్ద అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు.ఒకరోజు చిన్న నాటి స్నేహితుడైన పాంచాల దేశాధిపతి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. స్నేహపూర్వకంగా మాట్లాడాడు, కాని ద్రుపదుని ఇది నచ్చలేదు.

“పేద బ్రాహ్మణులకు, మహారాజులకు స్నేహం ఎలా కుదురుతుంది. నోరు మూసుకుని పో. అదియును కాక, మిత్రులైనా, శత్రులైనా సమానమైన వారి మధ్యనే జరగాలి. మా వంటి మహారాజులకు నీ వంటి పేద బ్రాహ్మణులతో ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి మన మధ్య స్నేహానికి అవకాశం లేదు” అని గర్వంగా మాట్లాడాడు.

ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేక పోయాడు.ఏమి చెయ్యడానికి తోచక, ఇంక అక్కడ ఉండలేక, భార్యబిడ్డలతో హస్తినా పురానికి ప్రయాణం అయ్యాడు.

ఆ సమయంలో దుర్యోధనాదులు, పాండు కుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా, ఆ బంతి అక్కడే ఉన్న బావిలో పడింది. దానిని బయటకు తీసుకునే మార్గం లేక అందరూ చుస్తూ ఉన్నారు.

అప్పుడు ద్రోణుడు భార్యపుత్ర సమేతంగా అక్కడకు వచ్చాడు. నిస్సహాయంగా ఉన్న రాజకుమారులను చూసి, వెంటనే బాణాలను ఒక దానికి ఇకటి కొట్టి, ఒక తాడుగా చేసి, బావిలో నుండి ఆ బంతిని బయటకు తీసాడు.

రాజ కుమారులు ఈ విషయాన్ని భీష్మునికి చెప్పారు. వెంటనే భీష్ముడు ద్రోణుని దగ్గరకు వెళ్ళాడు. “తమరు ఎక్కడ నుండి వచ్చారు. ఎక్కడ ఉంటున్నారు?” అని అడిగాడు.

“మహాశయా, నా పేరు ద్రోణుడు, నేను అగ్నివేశ్యుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాను. పాంచాల రాజు నా స్నేహితుడు, కాని అతను నా స్నేహాన్ని అవహేళన చేసాడు. ఈ కుమారుడు నా కొడుకు అశ్వత్థామ. చేతిలో ధనము లేక పోవడం వాళ్ళ, సంసారాన్ని పోషించలేక, ఎన్నో బాధలు పడ్డాను.

కనీసం బాల్యంలో నా కుమారునికి పాలు కూడా కొనడానికి ధనం లేక, నా చిన్న నాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్లి, నా కుమారుని పాల కోసం నాలుగు పాడి ఆవులు ఇవ్వమని అడిగాను. కాని ద్రుపదుడు నా పేదరికాన్ని ఎత్తి చూపుతూ, తనతో నాకు స్నేహం తగదన్నాడు. యా విధంగా అతనితో అవమానం పొందాను” అని తన వృత్తాంతాన్ని వివరించాడు ద్రోణుడు.

భీష్ముడు, ద్రోణుడు కోరినంత ధనం ఇచ్చాడు. ధృతరాష్ట్రుని కుమారులకు, పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అర్థించాడు. ద్రోణుడు దానికి ఒప్పుకున్నాడు. వారినందరినీ ద్రోణుడు ఒక కోరిక కోరాడు.

“మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తరువాత,నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు?” అని అడిగాడు.

కౌరవులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వెంటనే అర్జునుడు ముందుకు వచ్చి “గురవర్యా, నేను మీరు ఏది కోరితే అది తీరుస్తాను” అని పలికాడు.

ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అర్జునిని కౌగిలించుకున్నాడు. తరువాత అందరికి విలువిద్య నేర్పించడం ప్రారంబించాడు. దేశ దేశాల నుండి రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. కుంతీదేవికి బాల్యంలో సూర్యుని వరం వలన కలిగిన పుత్రుడు, సూతుని ఇంట పెరుగుతున్న కర్ణుడు కుడా ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. కాని కర్ణుడు ఎప్పుడూ రాకుమారుడైన దుర్యోధనుని పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం వినయంతో గురు పూజ చేస్తూ, ద్రోణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.

ద్రోణుడి కుమారుడు అశ్వత్థామకు విద్యా మత్సరం ఎక్కువ. అర్జునుడు చీకట్లో బాణాలు వెయ్యడం అనే విద్య నేర్చుకోవడం అశ్వత్థామకు ఇష్టం లేదు. అందుకే వంట వాడిని పిలిచి, ఎప్పుడూ అర్జునుడికి చీకటిలో భోజనం పెట్టవద్దని చెప్పాడు.

ఒకరోజు రాత్రి, అర్జునుడు భోజనం చేస్తుండగా, పెద్ద గాలి వీచి దీపం ఆరిపోయింది. అలవాటు ప్రకారం అర్జునుడు అన్నం తింటున్నాడు. అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చీకట్లో అన్నం తిన్నట్టు, చీకట్లో విలు విద్య కూడా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి చీకట్లో బాణాలు వెయ్యడం ఆరంభించాడు.

ఒకరోజు చీకట్లో అర్జునుడి అల్లే తాటి ధ్వని విన్నాడు ద్రోణుడు. అస్త్రవిద్యలో అర్జునినికిగల పట్టుదలకు సంతోషించాడు. ద్రోణుడు తాను పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ నేర్పించి తనంత వాడిగా తయారు చేసాడు.

కామెంట్‌లు లేవు: