20, అక్టోబర్ 2020, మంగళవారం

అరణ్యపర్వము – 1

 అరణ్యపర్వము – 1

అక్షయపాత్ర

పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంటరాగా అరణ్వానికి బయలు దేరి ఉత్తర దిక్కుగా పయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు పధ్నాలుగు వేల రధాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు ” ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జూదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపడం భావ్యమా ” అనుకుని కంట తడి పెట్టారు ” భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు కౄరులైన దుర్యోదనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది. కనుక మేము మీతో అరణ్యాలకు వస్తాము ” అని పౌరులు పాండవుల వెంట బయలు దేరారు.

ధర్మరాజు ” ఆయ్యలారా మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వన క్లేశం భరించ లేరు. మీరు మా వెంట రా వద్దు మరలి పొండి ” అన్నాడు. ధర్మరాజు మన్నించి పౌరులు వెనుకకు మరలి వెళ్ళారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కాని వారి వెంట నిత్యాగ్ని హోత్రులు వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు ” బ్రాహ్మణోత్తములారా! మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలములు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్ట పడటం ఎందుకు? మరలి వెళ్ళండి ” అన్నాడు. అందుకు వారు ” అయ్యా మీరు లేక మేము బ్రతుక జాలము మీ వలె మేము కంద మూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్థినలో మేము ఉండజాలము ” అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ ” మంచి భోజనం తినే వీరు కందమూలాలను ఎలా తినగలరు? ” అన్నాడు.

అది విని శౌనకుడు ” ధర్మరాజా ! ఇందుకు ఇంత చింతించ తగునా. వివేకులు ఎందుకూ దు॰ఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు ” అని హితవు చెప్పాడు.

అందుకు ధర్మరాజు ” అయ్యా! ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్తు ధర్మం. తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిధి సత్కారం చేయడం నా ధర్మం” అన్నాడు.

అందుకు శౌనకుడు ” ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం . అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో ” అన్నాడు.

ధర్మరాజు ధౌమ్యుడితో ” అయ్యా ! ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను ” అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో ” ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో ” అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి ” ధర్మరాజా ! ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి ” అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు

కామెంట్‌లు లేవు: