20, అక్టోబర్ 2020, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*127వ నామ మంత్రము*


*ఓం శ్రీకర్యై నమః*


సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సిరిసంపదలు, ఆధ్యాత్మిక సంపదలు సంప్రాప్తమయి ఆనందముతో, ఆత్మానందానుభూతితో జీవింతురు.


జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి   అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి. 


*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును. అందుకే జగన్మాత *శ్రీకరీ* అని అనబడినది. నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణి అంటే జగన్మాత. విష్ణుసహస్రంలో 

 

*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః* (విష్ణుసహస్ర నామస్తోత్రము, 65వ శ్లోకము, రెండవ పాదము)


పై శ్లోకంలో *శ్రీకరః* (శ్రీకరుడు) అని శ్రీమన్నారాయణుని స్తుతించాము. 


ఇక్కడ నారాయణి కూడా *శ్రీకరి* అని స్తుతింపబడుతూ, మువురమ్మల (మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి) అనడంచేత కూడా *శ్రీకరీ* అని నామ ప్రసిద్ధమైనది.


*అష్టలక్ష్ములు*


1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీకర్యై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: