20, అక్టోబర్ 2020, మంగళవారం

కూష్మాండ

 కూష్మాండ


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 



నవదుర్గలలో నాల్గవ రూపం కూష్మాండ. కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. కేవలం గుమ్మడికాయ అని కాదు. అందులో పరమార్ధం ఉన్నది. గుమ్మడి గింజలలో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి ఉపయోగకరమైనది కాదు. లోకంలో మూడు రకములైన వేడిలు ఉంటాయి. అవి పరమ భయంకరమైన వేడి. 


ఆధ్యాత్మిక తాపం (వేడి) 


అంటే అది ఆ వ్యక్తి యొక్క శారీరక, మానసిక వేడికి సంబంధించింది. శరీరంలో వచ్చే వ్యాధులకు ఆధ్యాత్మిక తాపం అని పేరు. ఇది వారి వరకే ఆలోచిస్తే (వారి శరీరం) వారిని పరమస్వార్ధమపరులు అంటాము. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా తనకే వచ్చినట్లు బాధపడే వారిని ధర్మాత్ములు అంటాము. అలాంటి అమృత హృదయం ఆ తల్లి కృప ఉంటేనే మనకి అలాంటి హృదయం అబ్బుతుంది. రోగం వల్ల మనసులో పుట్టే తాపం ఆధ్యాత్మిక తాపం. అనారోగ్యం కలగటం తద్వారా చేసే పనులకు విఘ్నం.


ఆధిభౌతికం


అనేక రకములైన మహమ్మారి స్వరూపాలైన అంటువ్యాధులు రావడం, అంటువ్యాధులు ప్రబలడం వలన కళ్ళు ఎర్రబడిపోతూ బయట ఉన్న క్రిమి కీటకాదుల వల్ల అంటురోగాల బారిన బడడానికి బయట వారు చేసే పనివల్ల (దొంగతనం) మనం బాధపడడాన్ని ఆధిభౌతిక తాపం అంటారు. 


ఆధిదైవికం 


ఇది పరమ ప్రమాదకరం. అవైదిక ప్రక్రియలు ఎక్కువైపోవడం వల్ల కురవవలసిన సమయంలో వర్షాలు కురవకపోవడం, ప్రకృతి అసమతుల్యతకి లోనవడం, ఇలాంటి వన్నీ అవైదిక ప్రక్రియల వల్లే జరుగుతాయి. ఉదా: భూకంపములు ఎక్కువవడం, సునామీలు రావడం, పిడుగులు పడటం ఆధిదైవిక తాపం.


ఈ మూడు తాపాలు, అనగా మూడు రకములైన కుత్సితమైన వేడి తగ్గాలంటే ఆ లోకమాత పాదాలను ఆరాధించవలసినదే. ఆమె పాదాల చెంత భక్తిగా చిటికెడు కుంకుమ వేస్తే ఆ తల్లి తాపాన్ని పోగొడుతుంది.


ఆ తల్లి 'సువాసినీ సువసిన్యర్చనప్రీతా', కాబట్టి ఆ తల్లి పాదాల చెంత చిటికెడు కుంకుమ భక్తితో వేస్తే, దుర్గ అష్టోత్రం చేస్తే, దుర్గ సప్తశతి పైకి చదువుతూ వింటే, చండీ హోమం చేస్తే, హవిస్సు ఇస్తూ పూర్ణాహుతి చేస్తే, ఆవిడ పరమ ప్రీతీ చెంది ఈ మూడు రకములైన వేడులను ప్రబలకుండా చేస్తుంది.


"మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః" అంటూ అందరం ఆ తల్లికి దేవాలయంలో మన చేతనైన సహాయం చేసి ఆ తల్లిని ఉపాసన చేస్తే కుష్మాండ స్వరూపం తాపత్రయాన్ని తగ్గించే తల్లి. 


త్రుప్తితో బ్రతక గలిగినవాడు ఐశ్వర్యవంతుడు. ఎంత ఉన్నా లేదని ఏడ్చినవాడు బాహ్యంలో ధనవంతుడిగా కనబడినా వాడు దరిద్రుడు. అటువంటి వేడి పుట్టకుండా ధర్మంలో అర్ధకామములను ముడివేసి చల్లార్చగలిగిన తల్లి ఈమెయే. అందుకే ఆమె కూష్మాండ. అటువంటి తల్లి నవదుర్గా స్వరూపాలలో కూష్మాండ అని పేరు పొందినది. అందువల్ల ఆ తల్లి ఆరాధన తప్పక చెయ్యాలి. తద్వారా మనము ప్రకృతిని శాంతింప చెయ్యగలం.


అలాగే ధర్మబద్ధమైన జీవితం గడపడం వల్ల అర్ధాన్ని, అలాగే ధర్మబద్ధమైన కామాన్ని అనుభవించడం వల్ల, తద్వారా మోక్షాన్ని పొందేటట్లు చెయ్యగలిగిన శక్తి ఆ తల్లికే ఉన్నది.


నవదుర్గలలో ఒకరైన ఆ కూష్మాండ మాతను మనమందరం మన శక్తి మేర భక్తితో ఆరాధన చేసి ఆ తల్లి కృపకు మనం పాత్రులం అయ్యెదముగాక.


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


WhatsApp Number: +91 8886240088

కామెంట్‌లు లేవు: