20, అక్టోబర్ 2020, మంగళవారం

గీతా మకరందము

 16-11,12-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


చిన్తామపరివేుయాం చ ప్రళయాన్తాముపాశ్రితాః | 

కామోపభోగపరమా  

ఏతా వదితి నిశ్చితాః || 


ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః | 

ఈహన్తే కామభోగార్థం అన్యాయేనార్థసఞ్చయాన్|| 


తాత్పర్యము:- మఱియు (ఆసురీసంపదగల)వారు అపరిమితమైనదియు, మరణమువఱకు (లేక, ప్రళయకాలమువఱకు) విడువనిదియునగు విషయచింతన (కోరికలను)ను ఆశ్రయించినవారును, కామోపభోగమే పరమపురుషార్థముగ దలంచువారును, ఇంతకుమించినది వేఱొకటి లేదని, నిశ్చయించువారును, పెక్కు ఆశాపాశములచే బంధింపబడినవారును, కామక్రోధములనే ముఖ్యముగ నాశ్రయించినవారును అయి కామముల ననుభవించుట కొఱకుగాను అన్యాయమార్గములద్వారా ధనసమూహములను కోరుచున్నారు.


వ్యాఖ్య:- అట్టి ప్రాపంచిక మనుజులయొక్క చింతలకు, కోరికలకు, మనోరథములకు అంతము యుండదు. వారి యా చింతలను చావు (లేక మహాప్రళయము) నిలుపుదల చేయవలసినదే తప్ప వారు స్వయముగ నిలుపరు. భక్తులు, ముముక్షువులు దైవమునే పరమపురుషార్థముగను, గమ్యముగను, జీవితలక్ష్యముగను ఎట్లుతలంచుదురో, అట్లే ఈ అసురప్రవృత్తికలవారు కామోపభోగమునే పరమార్థముగ దలంచి అంతకు మించి ప్రపంచములో గొప్పదికాని, సుఖసాధనమార్గముకాని లేదని వచించుదురు. మఱియు లోకములో ఒక్క త్రాటిచే కట్టబడినవారే ఎంతయో బాధనొందుచుండగా వీరు వందలకొలది ఆశలను త్రాళ్ళచే బంధింపబడియుండుటచే (ఆశాపాశశతైర్భద్ధాః) ఇక వారి బాధ, అశాంతి వర్ణనాతీతముగనుండునని ఊహించుకొనవచ్చును. అట్టివారు కామక్రోధములను ఏ కాలమందును విడిచియుండక తత్పరాయణులై యుందురు. మఱియు తమ కామోపభోగముకొఱకు అన్యాయమార్గముల ద్వారా విత్తము నభిలషించుచుందురు.


 "అర్థసంచయాన్" - అని చెప్పినందువలన వారు ఏకొద్ది ధనముతోనో తృప్తిపడువారు కారనియు, ధనసమూహమునే కోరుచుందురనియు, అదియు సత్కార్యములకొఱకుగాక కేవలము విషయభోగములకొఱకేయనియు తెలిసికొనవలసియున్నది. దీనినిబట్టి వీరు రెండు ఫెూరప్రమాదముల నాచరించుచున్నట్లు విదితమగుచున్నది - 

(1)కామాశ్రయము 

(2)అన్యాయార్జనము. కావున సాధకులు, ముముక్షువులు ఇట్టి అల్పచరితుల సాంగత్యము చేయక కడు జాగరూకులైయుండవలెను.


ప్రశ్న:- ఆసురీసంపదగల వారింకను ఎట్లుందురో తెలుపుడు?

ఉత్తరము:- (1) అంతులేని ఆశ, చింతలు గలిగియుందురు (2) కామోపభోగమే గొప్పదిగ తలంచుదురు (3) దానినిమించి మఱియొకటి లేదని భావించుదురు (4) పెక్కు ఆశాపాశములచే బంధింపబడియుందురు (5) కామక్రోధతత్పరులై యుందురు (6) విషయభోగములను మిక్కుటముగ అనుభవించుచు వానికొఱకై అధికధనమును వాంఛించి, అన్యాయమార్గములద్వారా మోసపుపద్ధతులద్వారా దానిని సంపాదింపదలంచుదురు.

కామెంట్‌లు లేవు: