20, అక్టోబర్ 2020, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*704వ నామ మంత్రము*


*ఓం సరస్వత్యై నమః*


జ్ఞానాధిష్ఠాన దేవతా స్వరూపిణిగా, జ్ఞానముద్రాస్వరూపిణిగా, ప్రాణుల జిహ్వలయందు వాగ్రూపిణిగా, సరస్వతి యను నదీస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సరస్వతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సరస్వత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే చక్కని వాక్పటిమ, పలువురిలో మన్ననలందగల సంభాషణా చాతుర్యత, (విద్యార్థులయినచో) విద్యాబుద్ధులు, వేదాధ్యయనులకు వాక్శుద్ధి సంప్రాప్తించును ఆ జగన్మాత ఆరాధనలో.


సరస్వతి యనగా జ్ఞానిభిమానినీ దేవత. జ్ఞానముద్రస్వరూపురాలు గూడా. అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు. అజ్ఞానముచే జ్ఞానమావరింపబడినది అనగా ప్రాణులు మోహమును పొందుచున్నారు. ఈ విషయం *సర్వమోహినీ* (703వ నామములో చెప్పబడినది. జ్ఞానమంటే అద్వైతము (జీవుడు, దేవుడు ఒకటే), అజ్ఞానము అద్వైతము అనగా జీవుడు వేరు, దేవుడు వేరు. అలా అన్నప్ఫుడు అజ్ఞాని మోహావేశభరితుడై భౌతికసుఖలోలత్వమునకు ఆశపడును.


 వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు.  ఈ దౌమ్యుడు కన్యకలకు నామకరణము చేయునపుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టెను. అందుచే రెండుసంవత్సరముల కన్యక భరద్వాజస్మృతిలో ప్రాణులందరి జిహ్వలందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడు ఉంటుంది గనుక,  సరస్వతి వాగ్రూపురాలు అయి ఉండుటచేతను,రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టిరి.   అందుచేతనే రెండు సంవత్సరముల కన్యకను సరస్వతిగా నవరాత్రులలో ఆరాధించు సాంప్రదాయము గలదు.

అందరి జ్ఞానదృష్టులు ఈ రెండు వత్సరముల కన్యకపై యుండును గనుక ఆ రెండువత్సరముల బాలికకు సరస్వతి అని నామమును నిర్ణయించిరి. జగన్మాత *సరస్వతీ* యని ఈ కారణముచే చెప్పదగును. ఈ సరస్వతి సర్వులకు జ్ఞానదృష్టులను  స్రవింపజేయుటచే గూడ, జగన్మాత *సరస్వతీ* యను నామముచే ప్రసిద్ధురాలు. జగన్మాత జ్ఞానప్రవాహ. 


పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.


సృష్టిచేయాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి పదిమంది కుమారులు, పదిమంది కుమార్తెలు ఉద్భవించారు. కుమార్తెలలో చివరిది శతరూప. ఆమెయే సరస్వతి.


సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది.  

 ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది.  కాని సరస్వతీ నది అంతర్వాహినియై ఉంటుందని, ప్రయాగవద్ద గంగా, యమునలలో అంతర్వాహినిగా కలిసి, త్రివేణీ సంగమము ఏర్పడినదని పురాణగాథ.    


మూలాధారం నుండి సహస్రారం దిశగా కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సుషుమ్నాకు ఇరువైఫుల ఉండే ఇడ, పింగళ నాడులు రెండూ గంగ, యమునలు అయితే, సుషుమ్నా నాడి సరస్వతీ రూపము. ఆవిధంగా జగన్మాత సరస్వతీ స్వరూపురాలు. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సరస్వత్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: