22, అక్టోబర్ 2020, గురువారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

తమ్ముడు కోసం..


"నా పేరు పోతులూరయ్య..మాది మర్రిపూడి మండలం..నలభైరోజుల పాటు ఇక్కడ ఉండాలని వచ్చాము..మా తమ్ముడికి ఆరోగ్యం సరిగాలేదు..వాడి ఆరోగ్యం కుదుట పడే దాకా దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఉండాలని అనుకున్నాము..మాకు వసతి చూపించగలరా?.." అని ఆ యువకుడు అడిగాడు..అతనితో పాటు సుమారు ఇరవైరెండేళ్ల వయసున్న అతని తమ్ముడు, అతని తల్లి కూడా ఉన్నారు..విడిగా గదులు లేవనీ..అందరితో పాటు వుండటానికి గదులు ఉన్నాయనీ..వాటిలో సర్దుకోమనీ చెప్పాము..సరే అన్నాడు..తల్లీ, తమ్ముడిని తీసుకొని తనకు చూపిన బసకు వెళ్ళిపోయాడు..


విచారించగా తెలిసిందేమిటంటే..పోతులూరయ్య తమ్ముడు కొద్దికాలం నుంచీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..ఒంగోలు లోని మానసిక వైద్యులకు చూపించారు..వాళ్ళు తమ హాస్పిటల్ లో ఉంచుకొని రెండు మూడు నెలల పాటు వైద్యం చేశారు..అక్కడనుంచి వచ్చేసిన తరువాత ఓ పక్షం రోజుల పాటు అతనిలో మార్పు కనబడింది కానీ..ఆ తరువాత మళ్ళీ పూర్వ స్థితికి వచ్చేశాడు..డబ్బు ఖర్చు అయింది గానీ..జబ్బు తగ్గలేదు సరికదా..రోజు రోజుకు ఎక్కువ కాసాగింది..ఆ సమయం లో పోతులూరయ్య తో మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు తన తమ్ముడిని తీసుకు వెళ్లి..అక్కడ శ్రీ స్వామివారి సమాధి వద్ద తన తమ్ముడితో నలభైరోజుల పాటు నిష్ఠగా ప్రదక్షిణాలు చేయిస్తే..అతనిని పీడిస్తున్న ఈ వ్యాధి తగ్గుతుందని కొంతమంది సలహా ఇచ్చారు..ప్రయత్నం చేసి చూద్దాము..అనుకొని.. తమ్ముడిని తీసుకొని..తమకు వండిపెట్టటానికి తల్లినీ తీసుకొని మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయుడి మందిరానికి చేరాడు..


ప్రక్కరోజు ఉదయాన్నే తమ్ముడిని చేతితో పట్టుకొని..శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించసాగాడు పోతులూరయ్య..పోతులూరయ్య చేతులు విడిపించుకొని పారిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడా తమ్ముడు..అతికష్టం మీద తమ్ముడి చేత ఒక్కొక్క ప్రదక్షిణం చేయించసాగాడు..సాయంత్రం కూడా అదే విధంగా ప్రదక్షిణాలు చేయించాడు..మొత్తమ్మీద మొదటి రోజు రెండుపూటలకూ కలిపి పదకొండు ప్రదక్షిణాలు మాత్రం చేయించాడు..ఇలా ఒక వారం గడిచి పోయింది..రోజు రోజుకూ ప్రదక్షిణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది..పోతులూరయ్య తమ్ముడిలో మొదటి రెండు మూడు రోజుల్లో ఉన్న తీవ్ర ప్రతిఘటన క్రమంగా తగ్గుతూ వస్తున్నది..


సరిగ్గా వారం తరువాత..ఆదివారం తెల్లవారుఝామున పోతులూరయ్య నిద్రలేచి చూస్తే..తమ్ముడు కనబడలేదు..అతనిలో ఆందోళన మొదలైంది..గబ గబా తల్లిని లేపాడు..ఆమె కూడా ఆందోళన పడింది..పోతులూరయ్య తన తమ్ముడిని వెతుక్కుంటూ శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చాడు..అక్కడ ఆశ్చర్యకరంగా..పోతులూరయ్య తమ్ముడు చీపురుతో మందిర ఆవరణాన్ని చిమ్ముతూ వున్నాడు..అతని ముఖంలో ఏ భావము లేదు..తాను రోజూ చేస్తున్న పని చేస్తున్నట్లే శ్రద్ధగా చేస్తున్నాడు..అన్నను చూసి పలకరింపుగా నవ్వాడు..పోతులూరయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు..ఆరోజు నుంచీ అతను తన అన్న పోతులూరయ్య సహాయం లేకుండానే ప్రదక్షిణాలు చేయసాగాడు..అన్నతో కానీ..తల్లితో కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు..కానీ..ప్రతిరోజూ తెల్లవారక ముందే తన పాటికి తాను స్నానం చేసి..మందిరం లోపలికి వచ్చి..మందిరాన్ని శుభ్రం చేసి..కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని..నూట ఎనిమిది ప్రదక్షిణాలను చేసి..తన బసకు తిరిగి రావడం దిన చర్యగా మార్చుకున్నాడు..


పోతులూరయ్య తన తమ్ముడిలో వచ్చిన మార్పు చూసి..ఇదంతా శ్రీ స్వామివారి అనుగ్రహం తోనే జరిగిందని పరిపూర్ణంగా నమ్మాడు.. మరో వారం గడిచేసరికి..ఆ పిల్లవాడు తల్లితో అన్నతో మాట్లాడసాగాడు..మామూలుగా తన పనులు చేసుకోసాగాడు..నెల రోజుల కల్లా..అందరిలాగా మారిపోయాడు..పోతులూరయ్య మరో పది రోజుల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్దే తమ్ముడి తో సహా వున్నాడు..నలభైరోజులు పూర్తి అయిన తరువాత.. శ్రీ స్వామివారికి పొంగలి నైవేద్యం గా పెట్టుకొని..పూజలు చేయించుకొని..శ్రీ స్వామివారి కృపను పదే పదే తలచుకుంటూ..తన స్వగ్రామానికి తల్లితో తమ్ముడి తో వెళ్ళిపోయాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: