5, నవంబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో...104

 పోత‌న త‌ల‌పులో...104


పరీక్షిత్తు! విష్ణుమాయ గురించే కాకుండ, విరాట్పురుషుని నుండి ఈ లోకాలు అన్నీ ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా. వాటన్నిటికి సమాధానంగా శ్రీమద్భాగవతమును చెప్తాను. శ్రద్ధగా విను...

                   ***


మహదహంకార పంచ తన్మాత్ర గగన

పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి

యప్రపంచంబు భగవంతునందు నగుట

సర్గ మందురు దీనిని జనవరేణ్య!

                      ***

ఓ పరీక్షిన్మహారాజ! మహత్తు, అహంకారం, పంచ తన్మాత్రలు అనెడి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన అయిదు, పంచభూతములు అనెడి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు పంచేంద్రియములు అనెడి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అయిదు, విరాట్పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు.


                  **

సరసిజగర్భుండు విరా

ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా

చర భూత సృష్టిఁ జేయుట

వరువడిని విసర్గ మండ్రు భరతకులేశా!

                   ***

మహా రాజ! పరీక్షిత్తు! బ్రహ్మదేవుడు నారాయణుని నాభి పద్మనుండి జనించి, బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగ సృజించుటను విసర్గము అంటారు.


                  **

లోకద్రోహినరేంద్రా

నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా

వైకుంఠనాథు విజయం

బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!

              **

పరీక్షిత్తు! లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.

            ***

ఓ పరీక్షిత్తు భూపతి! సర్వేశ్వరుడు, గోవిందుడు, చిదచిదానంద స్వరూపుడు నారాయణుడు. ఆయన స్వయంభూతుడు ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసికొని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తు వసించి ఉంటాడు. ఆసమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి.

               ***


జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి-

  దేహధర్మంబులై ధృతి ననేక

జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా-

  మరణంబు లాత్మధర్మంబు లయిన

ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన-

  స్థితి నొప్పి పూర్వసంచితము లైన

యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ-

  వంతుఁడై తగ భగవచ్ఛరీర



భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి

దివ్య మాల్యానులేపన భవ్య గంధ

కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ

డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి



మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.



    🏵️పోత‌న ప‌దం🏵️

🏵️హ‌రిస్వ‌రూపం🏵️

కామెంట్‌లు లేవు: