5, నవంబర్ 2020, గురువారం

అరణ్యపర్వము-17

 అరణ్యపర్వము-17


చ్యవన మహర్షి వృత్తాంతం


పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులను వెంటపెట్టుకుని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళడం వారికి వివరించాడు. బలరాముడు ” ఆ దృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడి గట్టాడు. కనుక మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం ” అని తనతో వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి ” అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగటం భావ్యమా? భయంకర మైన యాదసేనల ధాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం. అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాం ఏమంటారు ” అని ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు ” అయ్యా! మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి మీరు శాంతించండి ” అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలు దేరి పయోష్ణి నదిలో స్నానం చేసాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరాడు. అక్కడ వారు వైడూర్య పర్వతాన్ని చూసారు. రోమశుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని చెప్పసాగాడు.


రోమశుడు ధర్మరాజుతో ” ధర్మరాజా! భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేసాడు. దీర్గకాల తపస్సు కారణంలేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు వాటి పై తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య, చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకుని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేసాడు. సుకన్య చ్యవనుడికి సేవలు చేస్తూ ఉంది.


ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను ” అమ్మా!నీవెవరు? ” అని అడిగారు. సుకన్య ” అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను ” అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి ” నీ వంటి అందెగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త. ఇంకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము ” అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి ” నాకు నా భర్త మీద ప్రేమ ఉంది ” అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి చెప్పింది. చ్యవనుడు సుకన్యతో ” వారు చెప్పినట్లు చేయవచ్చు కదా ” అన్నాడు. సుకన్య చ్యవనునితో ” మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను ” అన్నది. ఆమె అశ్వినులతో ” నాకు నవయవ్వన వంతుడైన వరుని ప్రసాదించండి ” అని అడిగింది. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి ముగ్గురు నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో ” మాలో ఎవరు కావాలో కోరుకో ” అన్నారు. సుకన్య వారిలో చ్యవనుని గుర్తించి ఆయనను వరించింది. చ్యవనుడు అశ్వినులతో ” మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం తాగిస్తాను ” అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు.


తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడటానికి వచ్చాడు. చ్యవనుడు శర్యాతితో ” రాజా! నేను నీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను ” అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చ్యవనునితో ” వారు దేవ వైద్యులే కాని దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు ” అన్నాడు. చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చ్యవనుడు హోమంచేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతిచెందాడు. ఇంద్రుడు చ్యవనుడితో ” మహర్షీ ! మీ తపశక్తి తెలియక అపరాధం చేసాను క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు ” అని అంగీకరించాడు. చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోను, మధ్యం లోనూ, పాచికలలోను, మృగములలోను ప్రవేశించాడు ” అన్నాడు.

కామెంట్‌లు లేవు: