5, నవంబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము** 


చతుర్థ స్కంధం -16


పృథుని యఙ్ఞకర్మములు 


అని చెప్పి మైత్రేయ మహర్షి విదురునితో ఇలా అన్నాడు “పుణ్యాత్మా! రాజర్షి అయిన పృథుచక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలు చేయటానికి దీక్ష పూనాడు. మహానిష్ఠతో బ్రహ్మావర్త దేశంలోని మనుక్షేత్ఱ్ఱంలో సరస్వతీ నదీతీరంలో మహా వైభవంగా యజ్ఞాలు చేయటం వల్ల విశేషఫలం కలుగుతుందని భావించాడు. ఆ విధంగా ఆయన అక్కడ సాగిస్తున్న యాగవైభవాన్ని చూచి ఇంద్రుడు ఓర్వలేకపోయాడు. ఆ అశ్వమేధ యజ్ఞానికి సాక్షాత్తు భగవంతుడు, యజ్ఞస్వరూపుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, విశాల యశోవిరాజితుడు, లక్ష్మీవల్లభుడు అయిన విష్ణుదేవుడు విచ్చేసాడు. గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైన వారు కీర్తిస్తూ ఉండగా; కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు కొనియాడుతూ ఉండగా; నందుడు, సునందుడు మొదలైన పార్షదులతోను; బ్రహ్మతోను, పరమశివునితోను, అష్టదిక్పాలకులతోను కూడి వేంచేసాడు. పరమభక్తులచేత సేవింపబడేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు మొదలైనవి సమకూర్చేదై కూడ సర్వకామితాలను పిదికేదై సమస్త పదార్థాలను సమకూర్చింది. చెట్లు తమ ఆకారాలను పెంపొందించి తేనెలను కురుస్తూ చెఱకు ద్రాక్ష మొదలైన రసాలను; పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, పానకం మొదలైన వానిని వర్షింపగా అవి నదులై ప్రవహించాయి. సముద్రాలు వజ్రాలు మొదలైన వివిధ రత్నాలను సమర్పించాయి. పర్వతాలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు అనే నాలుగు విధాలైన భోజన పదార్థాలను సిద్ధపరిచాయి. లోకపాలకులతో కూడి సకల జనులు కానుకలు తెచ్చి సమర్పించారు. ఈ విధంగా విష్ణుభక్తుడైన పృథు చక్రవర్తి మహావైభవంతో తొంబదితొమ్మిది అశ్వమేధ యాగాలను బుద్ధి కౌశలంతో పూర్తి చేసి నూరవ యాగాన్ని ప్రారంభించి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధింపసాగాడు. ఆ మహాయజ్ఞ వైభవాన్ని చూచి అసూయపడి…దేవేంద్రుడు పట్టలేని రోషంతో పాషండ వేషం ధరించి, ఎవరికీ కనుపించకుండా యజ్ఞశాలకు వచ్చి యజ్ఞపశువును అపహరించి ఆకాశమార్గం పట్టాడు. ఆ విధంగా (యజ్ఞపశువును తీసుకు) వెళ్తున్నప్పుడు…అత్రి మహాముని అది గమనించి పృథు చక్రవర్తి కొడుకును హెచ్చరించగా అతడు విల్లమ్ములు ధరించి దర్పాతిశయంతో దేవేంద్రుని వెంబడించాడు. అలా (దేవేంద్రుని వెనుక) వెళ్ళి వెళ్ళి ఎదురుగా…ధర్మంలో అధర్మాన్ని పుట్టించే మాయావేషం ధరించి యజ్ఞపశువును దొంగిలించి తీసుకొని పోతున్న ఇంద్రుని సమీపించి పృథుపుత్రుడు “నిలు! నిలు!” అంటూ నారిని మ్రోగించాడు. కాని జడలు ధరించి, బూడిద పూసికొని, ఎముకలను దాల్చిన ఇంద్రుని రూపాన్ని చూచి ఆకారం ధరించిన ధర్మమేమో అని భ్రమించాడు. యజ్ఞసాధనమైన పశువును దొంగిలించినవానిని చంపటం ధర్మమే అయినా అధర్మం అనిపించింది. అందువల్ల పృథుకుమారుడు ఇంద్రునిపై బాణం వేయలేకపోయాడు. అది చూచి మహాత్ముడైన అత్రిముని కోపంతో ఇంద్రుని చూపిస్తూ పృథుసుతునితో…“ఈ ఇంద్రుడు యజ్ఞ ఘాతకుడు. దేవతలలో పరమ పాతకుడు. కాబట్టి నీవు ఇతణ్ణి జయించు” అని మూడుసార్లు పలికాడు. అప్పుడు పృథుచక్రవర్తి కుమారుడు…సింహకిశోరం మదపుటేనుగు మీదికి లంఘించినట్లు ఆకాశంలో వెళ్తున్న ఇంద్రుని పైకి వీరుడైన పృథుకుమారుడు దుమికాడు. ఇంద్రుడు దొంగ వేషాన్ని, యజ్ఞపశువును విడిచిపెట్టి అదృశ్యమయ్యాడు. వీరుడైన పృథుకుమారుడు దుర్వార పరాక్రమంతో యజ్ఞపశువును మరలించుకొని పుణ్యభూమి అయిన జనకుని యాగశాలకు చేరుకున్నాడు.ఆ సమయంలో అక్కడ ఉన్న మునివరేణ్యులు అతని అద్భుత కృత్యాన్ని చూచి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడు అనే సార్థకమైన పేరు పెట్టారు. ఆ సమయంలో…ఇంద్రుడు చిమ్మచీకటిని కల్పించి అదృశ్యరూపంలో మళ్ళీ వచ్చి బంగారు త్రాళ్ళతో కట్టివేసి ఉన్నయజ్ఞాశ్వాన్ని దొంగిలించి వేగంగా నింగివైపు వెళ్ళాడు. అది చూచి అత్రిమహర్షి చెప్పగా...

రాజపుత్రుడు జితాశ్వుడు ఇంద్రుని వెన్నంటాడు. కాని పుఱ్ఱెను, ఖట్వాంగాన్ని (శివుని చేతిలో ఉండే గద లాంటి ఆయుధము) ధరించి కపటవేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చంపటానికి సందేహించాడు. అత్రి మహర్షి రాజపుత్రుని మళ్ళీ పురికొల్పగా అతడు తోక త్రొక్కిన పామువలె కోపించి బాణాన్ని సంధించాడు. ఇంద్రుడు తన కపట రూపాన్ని, అశ్వాన్ని విడిచి మళ్ళీ అంతర్ధానమయ్యాడు. ఇంద్రుడు ఆ విధంగా వెళ్ళిపోగా ఉత్తమవీరుడైన పృథుతనయుడు బలిపశువుని తీసికొని తండ్రి యజ్ఞశాలకు వచ్చాడు. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగిలించటం కోసం ధరించి విడిచిన అమంగళకరాలైన మాయారూపాలను మూర్ఖులైన మానవులు గ్రహించారు. ఆ రూపాలు పాషండ చిహ్నాలు. దిసమొలలతో తిరిగే జైనులు, కావిగుడ్డలు కట్టే బౌద్ధులు, జడలు ఎముకలు భస్మం ధరించే కాపాలికులు మొదలైనవారు పాషండులు. ఈ విధంగా లోకంలో అధర్మమందు ఆసక్తి కలిగిన మూర్ఖులు…ఆ పాషండ చిహ్నాలను పరంపరగా ధరించడం మొదలు పెట్టారు. ఇంద్రుడు హయాన్ని అపహరించిన సంగతి పృథుచక్రవర్తి తెలుసుకొని కోపంతో విల్లెక్కు పెట్టి అపరాధి అయిన అమరేంద్రుని మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋత్విక్కులు ఇంద్ర సంహారానికి పూనుకున్న పృథుచక్రవర్తిని చూచి ఇలా అన్నారు.మహారాజా! యజ్ఞాలలో యజ్ఞదీక్షితుడైనవాడు యజ్ఞపశువును తప్ప మరి ఎవ్వరినీ వధింపరాదని విద్వాంసులు అంటారు.

కాబట్టి నీవు ఇంద్రుణ్ణి సంహరించే ప్రయత్నాన్ని విరమించు. నీకు ధర్మవిరోధి అయిన ఇంద్రుణ్ణి….రాజా! శక్తివంతాలైన మంత్రాలచేత ఆహ్వానిస్తే అత డిక్కడికి వస్తాడు. అలా వచ్చిన ఇంద్రుని వెంటనే…అతని ధైర్యం చెదరిపోగా పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తాము. రాజా! దానితో అతడు తన బలాన్ని కోల్పోయి పతనమౌతాడు.” అని ఋత్విక్కులు పృథువును ఆపి, కోపంతో చేతులలో స్రుక్కులు, స్రువాలు ధరించి వేల్చడానికి పూనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఋత్విక్కులను చూచి ఇలా అన్నాడు “యజ్ఞాలలో పూజింపబడే దేవతలు ఇంద్రుని అంశాలు. ఈ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు కలిగిన భగవంతుని అంశం కాబట్టి ఇతడు చంపదగినవాడు కాదు. భగవంతుని అంశం వల్ల పుట్టటం వలన యజ్ఞాన్ని పాడు చేయాలనే కోరికతో ఇతడు చేసిన ధర్మవ్యతికరాన్ని ఉపేక్షించి చూస్తూ ఉండవలసిందే కాని ప్రతీకారం చేయరాదు. ఈ పృథుచక్రవర్తికి తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసిన ఫలం సిద్ధిస్తుంది” అని చెప్పి బ్రహ్మదేవుడు పృథువుతో ఇలా అన్నాడు. “రాజా! నీకు మోక్షధర్మం తెలుసుకదా! ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం విరమించు. ఇంతవరకు చేసిన యజ్ఞాలు చాలు. మోక్షధర్మం తెలిసినవాడవు కనుక శతయజ్ఞాలు చేయటం వలన కలిగే ఫలం నీవు కోరరానిది. ఏ విధంగానైనా సరే.. ఇంద్రుడు నిన్ను ద్వేషించకుండా చూడు. నీవు ఇంద్రునిపై కోపాన్ని విడిచిపెట్టు. ఇంద్రుడు, నీవు శ్రీహరి అంశంవల్ల పుట్టినవారు. కాబట్టి మీరు కలిసి ఉండాలి కాని కలహింపకూడదు. మీకు శుభం కలుగుతుంది. రాజా! నీవు యజ్ఞం భంగమయిందని చింతింపవద్దు. నా మాటలు జాగ్రత్తగా విను. దైవోపహతమైన యజ్ఞాన్ని చేయటానికి నీవు పూనుకున్నావు. అది నెరవేరలేదు. అందుకని నీవు కోపంతో ఉడికిపోరాదు. కోపం వల్ల అజ్ఞానం పెంపొందుతుంది. నీ యజ్ఞాన్ని చెడగొట్టటం కోసం ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు. ఇంద్రుడు దేవతలలో చాల పట్టుదల కలవాడు. అతనివల్ల నిర్మింపబడిన పాషండ ధర్మాలవల్ల ధర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి నీ యజ్ఞాన్ని చాలించు” అని మళ్ళీ ఇలా అన్నాడు.అంతేకాదు… నీ తండ్రి వేనుడు చేసిన అత్యాచారాల వల్ల నశించిన ధర్మాలను తిరిగి రక్షించడానికి విష్ణుదేవుని అంశం వల్ల వేనుని శరీరం నుండి నీవు జన్మించావు. ఈ విశ్వం ఎవరివల్ల పుట్టింధో ఆలోచించు. ఈ విశ్వంలో ఎవరు ఎందుకు నిన్ను సృష్టించారో విచారించు. నిన్ను సృజించిన ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చు. భువనకల్యాణమూర్తీ! ధర్మాన్ని రక్షించు.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “అధర్మాన్ని పుట్టిచేది, వేదబాహ్యమైన భయంకర మార్గం పట్టించేది అయిన ఈ ఇంద్రుని మాయను నిరోధించు” అని బ్రహ్మ ఆజ్ఞాపించగా పృథుచక్రవర్తి ఆ ఆజ్ఞను తలదాల్చి ఇంద్రునితో స్నేహం చేసాడు. యజ్ఞం పరిసమాప్తమైనట్లుగా అవబృథ స్నానం చేసాడు.

ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు భూరి దక్షిణలు పొంది మిక్కిలి తృప్తి చెంది పెక్కు దీవెన లిచ్చారు. దేవత లందరు ప్రీతి చెంది పుణ్యమూర్తియైన పృథువుకు అనేక వరాలను ప్రసాధించారు. అప్పుడు అక్కడి ప్రజలు ఇలా అన్నారు. పుణ్యాత్మా! నీచేత సర్వజనులు సత్కరింపబడ్డారు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు దానమానోపచారాల చేత పూజింపబడ్డారు. సంతోషించారు.”అని చెప్తుండగా యజ్ఞభోక్త, యజ్ఞేశ్వరుడు, భగవంతుడు అయిన శ్రీహరి ఇంద్రునితో కూడి అక్కడికి వచ్చి పృథుచక్రవర్తితో, , ,రాజా! నీ శతాశ్వమేధ దీక్షను భంగం చేసినందుకు నీముందు క్షమాపణం చెప్పుకొనడానికి ఇంద్రుడు వచ్చాడు. చూశావా?”అందువల్ల ఇతనిని క్షమించు. సత్పురుషులకు దేహాభిమానం ఉండదు. కాబట్టి వారు జీవులకు ద్రోహం చేయరు. అందువల్ల నీవంటి మహాత్ములు దేవమాయకు వశులై ఇతరులకు బాధ కలిగింపకూడదు. అంతేకాక ‘ఈ శరీరం అవిద్యవల్ల పుట్టింది’ అని తెలిసిన పరమజ్ఞాని దేహంపై ఆసక్తిని పెంచుకోడు. దేహంపై ఆసక్తి లేనివానికి ఇంటిమీద, భార్యాపుత్రులమీద మమకారం ఉండదని చెప్పనక్కరలేదు కదా! దేహంలోని ఆత్మ పరిశుద్ధమైనది. స్వయంగా ప్రకాశిస్తుంది. సాక్షీభూతమైనది. కాబట్టి ఆత్మను దేహంకంటె వేరు అయినదని తెలిసికొన్న వాడు నాయందు భక్తిని పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు. స్వధర్మాచారాలలో ఆసక్తి కలిగి నిష్కాముడై శ్రద్ధతో నన్ను సేవించేవాని మనస్సు క్రమంగా నిర్మలం అవుతుంది. ఆ విధంగా నిర్మల మనస్కుడు అయినవాడు మోక్షాన్ని పొందుతాడు. కూటస్థమైన ఆత్మ ఉదాసీన మైనప్పటికీ దానిని ద్రవ్యజ్ఞాన క్రియా మనస్సులకు ఈశ్వరునిగా తెలుసుకొనేవాడు సంసార బంధాలలో చిక్కుకొనడు. ఈ సంసారం ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం కాబట్టి వేరువేరు దేహాలు ఉపాధులు కలిగి ఉంటుంది. అందువల్ల ఆపదలు, సంపదలు ప్రాప్తించినప్పుడు మహాత్ములైన నా భక్తులు వికారం పొందరు. కాబట్టి నీవు సుఖదుఃఖాలను సమంగా చూడు. ఉత్తమ, మధ్యమ, అధమ విషయాలలో సమానుడవై ప్రవర్తించి ఇంద్రియాలను జయించి మంత్రులు మొదలైనవారి సాయంతో సమస్త ప్రజలను సంరక్షించు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

“ఓ రాజేంద్రా! ప్రజలను రక్షించటం రాజుల పరమ ధర్మం. ప్రజలు చేసే పుణ్యంలో రాజులకు ఆరవ పాలు లభిస్తుంది. ప్రజలను రక్షింపని రాజుల పుణ్యాలను ప్రజలు హరిస్తారు. ఆ ప్రజల పాపాన్ని రాజు అనుభవిస్తాడు. కాబట్టి నీవు బ్రాహ్మణులు సమ్మతించిన ధర్మాన్ని ప్రధానంగా చేసుకో. అర్థ కామాలను ఆనుషంగికంగా భావించు. ధర్మార్థ కామాలు మూడింటిలోను ఆసక్తిని వీడు. ఈ విధంగా…నీవు ప్రజల అనురాగాన్ని పొంది సమచిత్తంతో పరిపాలించు. రాజా! అలా చేస్తే నీవు నీ ఇంటిలోనే సనకాది మునీంద్రులను సందర్శిస్తావు. రాజేంద్రా! తపోయోగ జ్ఞానాల చేత నేను సులభంగా లభించను. కాని సమచిత్తులైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను. కాబట్టి నీ శమశీలాలకు, అసూయారాహిత్యానికి, నీ స్తుతులకు వశుడనయ్యాను. నీకొక వరం ప్రసాదిస్తాను. కోరుకో” అని అన్నాడు. పృథుచక్రవర్తి భగవంతుడైన కమలాక్షుడు అందంగా సున్నితంగా పలికిన అమృతం వంటి తీయని పలుకులను తలపై ధరించి మనస్సులో మహానందం పొందాడు. . .తన పాదాలకు భక్తితో నమస్కరించి తాను చేసిన నీచపు పనులకు సిగ్గుపడుతున్న సురేంద్రుణ్ణి పృథువు ప్రేమతో కౌగిలించుకొన్నాడు. ఈ విధంగా కౌగిలించి ద్వేషం మాని ఉన్న తరువాత…భగవంతుడైన విష్ణుదేవుడు పృథుచక్రవర్తి చేసిన పూజా నమస్కారాలను గ్రహించి సంతుష్టి చెందాడు. పృథువు యొక్క భక్తిబంధాలు తన పాదాలను చుట్టుకొని కదలనీయకుండా పట్టుకొనటం వల్ల కనికరంతో ఆగిపోయాడు. తనపై గల అనుగ్రహంతో శ్రీహరి జాగు చేస్తున్నాడని పృథువు గ్రహించాడు. ఆ రాజు కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. కన్నులను బాగుగా విప్పి శ్రీహరిని చూడాలనుకున్నాడు. కాని పొంగి పొరలే కన్నీళ్ళవల్ల తనివి తీరా చూడలేకపోయాడు. డగ్గుత్తికతో పలుకలేకపోయాడు. చివరకు మనస్సులోనే ఆ దేవదేవుని కౌగిలించుకొని కన్నీటిని తుడుచుకున్నాడు. పాద పద్మాలను నేలపై ఉంచి గరుడుని మూపుపై కేలూది నిలుచున్న ఆ పురాణ పురుషునితో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు.


🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: