5, నవంబర్ 2020, గురువారం

రామాయణమ్.115

 రామాయణమ్.115

.

సీతమ్మను చూస్తుంటే ఆవిడకు సంతోషం ఒక మురిపెం ! చిన్నపిల్లల ముద్దుమాటలకు కలిగే సంతోషం సీతమ్మమాటలవలన ఆవిడకు కలిగి ఆ మహాసాధ్విని ఆనందసాగరంలో ముంచెత్తుతున్నాయి .

.

ఆవిడ మాటలకు మెచ్చి ఏదైనా ఇవ్వాలనుకొని సీతా ! నీకు ఏమి వరము కావాలో కోరుకో అమ్మా ! నీకు కావలసినది ఇస్తాను .అని పలికింది అనసూయామాత.

.

తల్లీ! నీ ఆప్యాయతే నాకు కొండంత వరము నాకు అది చాలమ్మా అని బదులిచ్చింది సీతమ్మ.

.

పెద్దలకు అనుగ్రహము కలిగితే ఆగరుకదా !

.

విదేహపుత్రీ ! ఇదిగో నీకు దివ్యములు,శ్రేష్ఠములు అయిన ఈ పూలమాలలు,వస్త్రము,అలంకారములు,అంగరాగము,శ్రేష్టమైన మైపూతను ఇస్తున్నాను .ఇవి ఎల్లప్పుడు ఉంటాయి.ఈ వస్త్రము మాయదు,నలగదు. ఈ దివ్యమైన అంగరాగము పూసుకొని నీవు నీ భర్తను శోభింపచేయగలవు.

.

అనురాగం తో అనసూయామాత ఇచ్చిన వస్తువులు స్వీకరించింది సీతమ్మ.

.

స్థిరనియమాలు గల అనసూయా మాత తనకు ప్రియం కలిగించే ఒక విషయం సీతమ్మను అడిగింది.

.

అమ్మాయీ ఇప్పుడు చెప్పవే ! నీ పెళ్ళి ముచ్చట్లు!

 సీతమ్మను దగ్గరగా కూర్చోపెట్టుకుని ముద్దుగా చూస్తూ అడిగింది ముదుసలి ముత్తయిదువ మహాసాధ్వి అనసూయా మాత.

.

ఆవిడకు సీతమ్మ చెప్పే కబుర్లు మహదానందాన్ని కలిగిస్తున్నాయి.

.

సీతమ్మ సవివరంగా తను తన తండ్రికి ఏవిధంగా దొరికింది,తన స్వయం వరాన్ని తండ్రి ఎలా ప్రకటించినదీ,మహర్షివిశ్వామిత్రులవారితో రామలక్ష్మణులు వచ్చిన సంగతి ,రాముడు ఏవిధంగా వింటిని ఎక్కుపెట్టి విరిచాడో ఆ సంగతి వివరంగా తెలిపింది.

.

రాముడు శివధనుర్భంగం గావించిన వెంటనే నన్ను రామునకు ఇచ్చుటకై నా తండ్రి చేతిలోనికి జలకలశము తీసుకొన్నాడు.

.

కానీ!

.

రాముడు అందుకు అంగీకరించలేదు!

.

తన తండ్రీ,ప్రభువూ అయిన దశరధమహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండా స్వీకరించను అని వినయంగా మా నాన్నగారికి తెలియచేశాడు.

.

అప్పుడు నా తండ్రి జనకమహారాజు దశరథ మహారాజుకు కబురుపెట్టగా  ఆయన వచ్చి తన సమ్మతిని తెలియచేసిన తరువాత మాత్రమే నన్ను స్వీకరించాడు రాముడు..

.

మా చెల్లెళ్ళకు కూడా అదే సమయములో లక్ష్మణ,భరత,శత్రుఘ్నులతో వివాహం జరిపించారు మా తండ్రిగారు.

అని తమ వివాహ వృత్తాంతాన్ని అనసూయామాతకు తెలిపింది సీతమ్మ.

.

NB.

.

మన సినిమాలలో చూపించినట్లుగా విల్లువిరిచిన వెంటనే వరమాల రాముడి మెడలో వేయలేదు సీతమ్మ.

.

తండ్రి అభిప్రాయము ముఖ్యము రామచంద్రుడికి! 

.

తండ్రికి దశరథరాముడు ఇచ్చిన గౌరవము అది!

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: