16-23-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఈ ప్రకారముగ (శాస్త్రాదేశము ననుసరించి) వర్తింపక తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో మనుజుడు ఉన్నతిని పొందలేడని వచించుచున్నారు –
యశ్శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాం గతిమ్ ||
తాత్పర్యము:- ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తనయిష్టమువచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు.
వ్యాఖ్య:- వారివారి యిష్టమువచ్చినట్లు ఆచరించుటయనునది (స్వేచ్ఛాప్రవర్తన) ఈ శ్లోకమున ఖండింపబడినది. ఒక్కొక్కరు వారివారికి తోచిన పద్ధతిననుసరించుచు అదియే సరియైనదని వాదించుట పొరపాటు. ఒకరుచేయు అనుష్ఠానము సరియైనదా కాదా యని పరీక్షించుటకు శాస్త్రప్రమాణము ఆవశ్యకమై యున్నది. వారివారి యనుభవములు శాస్త్ర ప్రమాణము ననుసరించియున్నవా? యని పరీక్షించుకొనుచుం డవలెను. అద్దానికి తన యనుభవము సరిపోయినచో అపుడు తనది సరియైనమార్గమని, సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును. శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులగు మహర్షులయొక్క నిర్ణయములు గనుకను, భగవదాశయములే గనుకను, వానినెవరును ఉల్లంఘింపరాదు. కనుకనే వాని నుల్లంఘించి వర్తించువారు మోక్షమును బడయలేరని, సుఖమును పొందజాలరని శ్రీకృష్ణమూర్తి ఇచట ఆనతిచ్చుచున్నారు. కాబట్టి విజ్ఞులెల్లరు శాస్త్రాదేశము ననుసరించియే ప్రవర్తించవలెను. దీనినిబట్టి సుఖమునుగాని, మోక్షమునుగాని వాంఛించువాడు శాస్త్రోక్తవిధిప్రకారము చక్కగ అనుష్ఠానమును శీలించవలెనని తెలియుచున్నది.
ప్రశ్న:- మనుజుడు తన యనుష్ఠానమునందు ఏ ప్రకారము ప్రవర్తింపవలయును?
ఉత్తరము:- శాస్త్రవిధి ననుసరించి ప్రవర్తింపవలెను.
ప్రశ్న:- అట్లు కాక తన ఇష్టము వచ్చిన ట్లాచరించినచో?
ఉత్తరము:- అత్తఱి యాతడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, మోక్షమునుగాని, బడయజాలడు.
ప్రశ్న:- సుఖమును బడయుటకుగాని, మోక్షమునొందుటకుగాని ఉపాయమేమి?
ఉత్తరము: -శాస్త్రాదేశము ననుసరించి చక్కగ ననుష్ఠించుటయే.
ప్రశ్న:- ప్రపంచములో గల పదవులన్నిటిలోను ఉత్కృష్టమైనదేది?
ఉత్తరము: - మోక్షము (పరాంగతిమ్).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి