22, ఏప్రిల్ 2025, మంగళవారం

పృథ్వి విలాపం ""

 సందర్భం :ఏప్రియల్..22... ధరిత్రి దినోత్సవం

శీర్షిక :

     ""   పృథ్వి విలాపం ""


పంచభూతాలైన నీరు, నిప్పు, నింగి, గాలి, మట్టిలను

తన స్వార్ధపు పెనుభూతానికి  తాకట్టుపెట్టి

పంచభూతాలనూ కలుషితం చేస్తున్నాడు

ప్రకృతిని వికృతిగా మార్చి

పుడమితల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నాడీ మానవుడు!

కన్నతల్లి కడ వరకే మోసేది

పుడమితల్లి కట్టే కాలే వరకూ  మోస్తుంది

కట్టెను కాల్చేందుకు ఉపకరిస్తుంది!

అధిక ఆహరోత్పత్తి కై.

రసాయనిక ఎరువులను అధికంగా వాడుతూ

కన్పించే ప్రతి జాగా లో అపార్టుమెంట్లను నిర్మిస్తూ

పృథ్విమాత  గుండెల్లో గునపాల్ని గుచ్చుతూ

హరితవర్ణాన్ని అదృశ్యపరుస్తూ

జీవరాసుల  మనుగడను ప్రశ్నర్ధకం చేస్తూ

కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ

తన వేలితో తన కంటినే పొడుచుకుంటూ

ఉన్న చూపును కోల్పోతున్నాడు

ముందుచూపు అసలే లేక

దూరాలోచన చేయక

దురాలోచనలతో వడి వడి గా

అడుగులేస్తూ

నడిచే దారిని ముళ్లమయం చేస్కుంటున్నాడు

కన్నీటి వరదను ప్రవహింప చేస్తున్నాడు!

జీవితాంతం కాపు కాసే పుడమితల్లిని

కన్నతల్లి కన్నా మిన్నగా కాపాడుకుందాం

అడగకున్నా అన్నీ ఇచ్చే ఆమనిని. అక్కున  చేర్చుకుందాం!

............................................రచన : డాక్టర్.

ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ)

కామెంట్‌లు లేవు: