*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*354 వ రోజు*
*కురు పాండవ యోధుల సమరం*
అప్పటికి సూర్యోదయం అయింది. ఇరు పక్షముల వారు కొంతసేపు యుద్ధము ఆపి కాలకృత్యములు తీర్చుకుని కొంత విశ్రాంతి తీసుకుని మరలా యుద్ధము చేయుటకు ఉపక్రమించారు. సుయోధనుడు నకులుడిని, దుశ్శాసనుడు సహదేవుడిని, ద్రోణుడు అర్జునుడిని, భీముడు కర్ణుడిని ఎదుర్కొని పోరాడుతున్నారు. సహదేవుడి సారథిని దుశ్శాసనుడు చంపాడు. సహదేవుడు తానే రథము తోలుకుంటూ దుశ్శాసనుడి హయములను గాయపరిచాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడి హయములు దుశ్శాసనుడిని రథముతో సహా ఎటో లాక్కెళ్ళాయి. భీముడు కర్ణుడు పదునైన బాణములతో ఒకరిని ఒకరు ఎదుర్కొన్నారు. తరువాత గదాయుద్ధము చేసారు. తిరిగి కర్ణుడు తన విల్లు తీసుకుని భయంకరమైన బాణములతో భీముని రథమును విరిచాడు. భీముడు సహదేవుడి రథము మీదకు దూకాడు. ద్రోణుడు అర్జునుడు ఒకరి మీద ఒకరు బాణ ప్రయోగం చేసుకుంటున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రముకు వేరొకరు ప్రత్యస్త్రము ప్రయోగించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ అస్త్రము ప్రయోగించారో తెలియక చూసే వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా గురుశిష్యులు ఘోరయుద్ధము సాగిస్తున్నారు. ఆకాశం నుండి వీరి యుద్ధం చూస్తున్న దేవతలకు పరమేశ్వరుడు రెండు రూపాలుగా విడి పోయి ఒకరితో ఒకరు తలపడి వినోదిస్తున్నాడా ! అన్నట్లు ఉంది. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నియమ నిష్టలతో మంత్రజపం చేసాడు. దేవతలు భయంతో వణికి పోయారు. దిక్కులు కంపించాయి. సముద్రాలు పొంగాయి. అది ఏమీ లక్ష్యపెట్టని ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు బెదరక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని ఉపసంహరించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానిని ఒకటి ఢీకొని నిర్వీర్యం అయిపోయాయి. ఒకరితో ఒకరు యుద్ధము సేసి ప్రయోజనము కవిపించక అర్జునుడు కౌరవ సేనల వైపు ద్రోణుడు పాంచాల సేనల వైపు వెళ్ళి పోయారు. అప్పుడు దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడి అస్త్రధాటికి తట్టుకొన లేక పారి పోయాడు. నకుల సహదేవులు వెంట రాగా ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి వైపు వెళ్ళాడు. సుయోధనుడు సాత్యకి ఎదురుపడ్డారు. వారిరువురు చిన్ననాటి స్నేహితులు. కొంతసేపు విరోధము మరచి రథములు పక్కపక్కన నిలిపి చిన్న నాటి చిలిపి పనులు ఆనాటి కబుర్లు బాల్యం గుర్తు తెచ్చుకుని పొంగిపోయారు. ఒకరితో ఒకరు యుద్ధం చేయవలసిన పరిస్థితి తీసుకు వచ్చిన క్షత్రియ ధర్మం గురించి తలచుకుని బాధపడి తప్పదు కనుక కొంతసేపు యుద్ధము చేద్దాము అనుకుని యుద్ధము చేయసాగారు. మిత్రత్వము మరచి శత్రువుల వలె యుద్ధము చేయసాగారు. సాత్యకి సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరాన్ని తూట్లు పొడిచాడు. సుయోధనుడు అలసి పోయి యుద్ధరంగం నుండి తొలగి పోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సుయోధనుడికి సాయంగా కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అది చూసి భీముడు కర్ణుడితో పోరు సాగించాడు. కర్ణుడు భీముని సారథిని మూర్ఛిల్లజేసి భీముని విల్లు విరిచాడు. భీముడు తన గద గిరగిరా తిప్పి కర్ణుడి రథము మీద విసిరాడు. ఆ గద పోయి కర్ణుడి సారథి తల పగుల గొట్టి కర్ణుడి రథాన్ని ముక్కలు చేసింది. కర్ణుడు మరొక రథము ఎక్కి యుద్ధము చేయసాగాడు.
*ద్రోణుడి మరణం*
ధర్మరాజు మత్స్య పాంచాలసేనలు వెంటరాగ ద్రోణుడి మీదకు యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అప్పటికి రెండు ఝాముల పొద్దు ఎక్కింది. నకుల సహదేవులు భీముడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇక్కడ ద్రోణుడు మన సేనలను అంతమొందిస్తున్నాడు. నీవు అతడికి సాయంగా ఉన్న కౌరవ సేనలను తరుముతుండు. అప్పుడు ద్రోణుడు ఒంటరిగా చిక్కుతాడు. పాంచాల సేన అతడిని అంతమొందిస్తుంది " అని అరుస్తూ ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తనకు అడ్డం వచ్చిన సైనికులను హతమారుస్తూ వేలాది సైనికులను చంపుతున్నాడు. ధర్మరాజు భీముడు నకుల సహదేవులు నిస్సహాయంగా చూస్తూ " ద్రోణుడు ఈ రోజు చెలరేగి పోతున్నాడు. ఇలా వదిలేస్తే ఈ రోజు పాండవసేనలను అంతమొందించి మనలను కూడా అంతమొందించి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నాడు. ఇతడిని నిలువరించడం మన తరం కాదు. నిలువరించ తగిన అర్జునుడు గురువును చంపుట పాపమని ఉపేక్షిస్తున్నాడు " అనుకున్నారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి