*తిరుమల సర్వస్వం 216-*
*శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)-1*
వందల ఏళ్ళ నుండి శ్రీవారి భక్తులైన ఎందరో చక్రవర్తులు, మహారాజులు, జమీందార్లు మున్నగువారు శ్రీవెంకటేశ్వరునికి బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు, వెండిపాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, రత్నఖచితమైన ఆయుధాలు, ఇలాంటివెన్నో భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు. శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తి, వారి రాచరికపు వైభవం, ఆనాటి కళాకారుల సృజనాత్మకత, ఈ మూడింటి మేళవింపైన ఈ వస్తువిశేషాలన్నీ ఆయా కాలాలలో ఉన్న రాజకీయ, సామాజిక, సాంస్కతిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక స్థితిగతులకు నిలువుటద్దాలు. పల్లవులు, చోశసామ్రాట్టులు, విజయనగర రాజులు, మట్లకుమారులు, ఇలా ఎందరెందరో శ్రీవారికి సమర్పించుకున్న కానుకలను ఎప్పటికప్పుడు ఆలయ కోశాధికారి నమోదు చేసుకుని, ఆ వస్తువులన్నింటికీ గుర్తింపు సంఖ్యనిచ్చి, వాటిపై దాతల వివరాలను చెక్కించి, కానుకలు మరీ విలువైనవైతే వాటి వివరాలను ఆలయం కుడ్యాలపై శిలాఫలకాల రూపంలో మలచి; వాటి విలువ-పరిమాణాన్ని బట్టి, వేర్వేరు ప్రదేశాల్లో కట్టుదిట్టమైన రక్షణా ఏర్పాట్లతో భద్రపరిచేవారు. అవన్నీ క్రమంగా ఈనాటి శ్రీవేంకటేశ్వర పురావస్తుప్రదర్శనశాల (మ్యూజియం) కు భద్రంగా, అంచెలంచెలుగా చేరుకున్నాయి.
*ఎప్పుడు? ఎక్కడ?? ఎలా???*
1939వ సంవత్సరంలో ప్రాచ్యసాహిత్యం మరియు కళలపై పరిశోధన, అధ్యయనం జరపటం కోసం; తి.తి.దే. ఆధ్వర్యంలో, తిరుపతి-చంద్రగిరి రహదారిలో ప్రాచ్యకళాశాల ప్రారంభించబడింది. ఆ కళాశాల ఆవరణలోనే ఉన్న ఒక హాలులో, కళాశాల సిబ్బంది స్వచ్ఛంద సహకారంతో చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఈ వస్తుసంపదనంతా తిరుమల నుంచి తరలించి, ఆ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రాచ్యకళాశాలలో పనిచేసిన ఎందరో మహామహులు కూడా ప్రాచీన కళాఖండాలను సేకరించేందుకు, వాటి చరిత్రను శోధించి ఇతివృత్తాల వారిగా అమర్చేందుకు ఎంతగానో తోడ్పడ్డారు. వారిలో ముఖ్యులు, దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్తగా సేవలందించిన - సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, మున్నగువారు.
అయితే, ఆ మ్యూజియం తిరుమల-తిరుపతి పట్టణాలకు దూరంగా ఉండటం, అప్పట్లో ప్రజారవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్ల సందర్శకుల సంఖ్య అంతంతమాత్రం గానే ఉండేది. అలా ఆ మ్యూజియం అరకొర ప్రేక్షకులతోనే కొన్ని దశాబ్దాల కాలం నడచిన తరువాత, ఆ అమూల్యమైన చారిత్రక సంపదను జనబాహుళ్యంలోకి తీసుకురావడం కోసం 1980వ సంవత్సరంలో అప్పటి కార్యనిర్వహణాధికారి గారి చొరవ మరియు ప్రముఖ చరిత్రకారుడు జయచంద్ర గారి సహకారంతో ఆ వస్తుసంపదనంతా ఆలయానికి ఎదురుగా ఉన్న 'వెయ్యికాళ్ళ మండపం' లోకి మార్చి, దానికి *'శ్రీవేంకటేశ్వర వస్తుసంగ్రహాలయం'* గా నామకరణం చేశారు. ఆ మండపంలో దక్షిణదిక్కున వస్తువులన్నింటిని అందంగా అమర్చి, తగిన సిబ్బందిని నియమించారు. దాంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో ప్రక్క తిరుమలలో అప్పుడు చేపడుతున్న పాలనా సంస్కరణలలో భాగంగా; అప్పటివరకు ఆదరణకు నోచుకోకుండా కొండపై ఎక్కడెక్కడో పడి ఉన్న కళాఖండాలన్నింటినీ ఒక్కచోటకు జేర్చే ప్రక్రియ కూడా వేగవంతమవ్వడం వల్ల, ప్రదర్శించబడే వస్తువుల సంఖ్య దాదాపుగా రెండింతలయ్యింది. ఈ రెండు కారణాల వల్లా విపరీతమైన స్థలాభావం ఏర్పడింది. వేలాదిగా తరలి వస్తున్న భక్తుల ఉత్సాహాన్ని, కళాఖండాలను అర్థవంతంగా అమర్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని; ఆలయానికి సమీపంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి, దానిలో ఈ కళాకృతులన్నింటిని ప్రదర్శించాలని అప్పటి తి.తి.దే. పాలకవర్గం నిర్ణయించింది.
*సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న నూతన వస్తుప్రదర్శనశాల భవనం*
ఈ నేపథ్యంలో అన్ని హంగులతో కూడుకున్న లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, వైకుంఠం-2 క్యూ సముదాయానికి ఎదురుగా, శిలాతోరణానికి వెళ్ళే దారిలో, గొప్ప రాజప్రాసాదం లాంటి భవనాన్ని నిర్మించారు. అప్పటివరకూ వెయ్యికాళ్ళమంటపంలో ప్రదర్శించబడుతున్న వస్తుసామగ్రినంతా ఈ భవనంలోకి తరలించి, విభాగాల వారిగా అమర్చి, ప్రతివస్తువు వద్ద దాని చరిత్రను వివరంగా మరియు ఆసక్తికరంగా సూచించి, సుశిక్షితులైన సిబ్బందిని నియమించారు. 1997వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించ బడడంతో, ఈ సంగ్రహాలయానికి ఎంతో ప్రాచుర్యం వచ్చింది. దానికి తోడు భక్తులందరికీ తగిన వసతులతో పాటుగా, ఉచితప్రవేశం కూడా కల్పించడంతో ప్రేక్షకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగి; రోజువారి సందర్శకుల సంఖ్యలో భారతదేశంలోనే ప్రథమస్థానాన్ని సంపాదించుకుంది. కాలక్రమంలో ఎప్పటికప్పుడు సంగ్రహాలయానికీ, అందులో ప్రదర్శింపబడుతున్న వస్తుసంపదకు కొత్త సొబగులు చేకూర్చడం వల్ల; ఈ మ్యూజియం తిరుమల చరిత్రనే కాకుండా, దక్షిణాది పాలకులందరూ శ్రీవారి భక్తులే కావడం వల్ల, దాదాపు రెండు వేల సంవత్సరాల యావత్ దక్షిణభారత చరిత్రను ప్రతిబింబించే గొప్ప వారసత్వ భాండాగారంగా రూపు దిద్దుకుని, తిరుమల సిగలో కలికితురాయిలా భాసిస్తోంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి