[ భాస్కర శర్మ: 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏
మొదటి భాగం
కామకళను గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.
కొన్ని భాగాలుగా అందిస్తాను. రహస్యం ఆగుట చేత బీజాక్షరాలు చెప్పకుండా వాటి అర్ధం చెప్పడం జరిగింది గమనింప ప్రార్ధన
జాగ్రత్తగా చదవండి.అర్దమగుటకు ఉన్నంతలో తేలికగా వ్రాశాను.
ముందుగా సత్యము -- అసత్యము గురించి తెలుసుకోవాలి.
తరువాత ప్రకాశ, విమర్శ, మిశ్రమ, సంవిద్బిందువులు తెలుసుకొని అప్పుడు కామాకళా స్వరూపం గ్రహించాలి.
ఈ సృష్టిలో సకల వస్తువులు-- జీవులు
సత్యము -- అసత్యము అనే రెండు పదార్ధముల మేళనము కలిగియున్నవి. ఇందు అసత్యమనునది నామరూపములు కలది.నామ రూపములు ఉన్నాయి అంటే అది నశిస్తుంది అంతవరకు ఎందుకు?.మనకు నామ రూపములు ఉన్నాయి కదా! ఇది శాశ్వతం కాదు. కాబట్టి అసత్యం ఇక రెండవదైన సత్యము ఆ నామ రూపములకు చైతన్యమును, వృద్ధి -- క్షయములను కలిగించునది. ఇది మనలో కనబడకుండా ఉంటుంది.అదియే జీవుడు.ఈ సత్యాసత్యములు రెండును ప్రతివస్తువందును గలవు. -ఈరెంటిలో నామరూపములు గలది అసత్యభాగము. ఈరెండును కలసి జగత్తుగా నున్నది. ఆ రెంటిలో సత్య భాగమును సారమంటారు . తిలలందు తైలము సత్యము. అదియే సారము. రెండవది పిష్టము. అది అసత్య భాగము. మనుష్యునందు జీవుడు సత్యము. దేహము అసత్య భాగము.
ఈరెండును కలసి ఉన్నపుడు ప్రవృత్తి ( జీవన విధానం ) కలుగుచున్నది కాబట్టి ప్రపంచ
మందు సత్యము ప్రతి వస్తువులోను సారభూతముగా నున్నది. సారమనగా రసము.అంటే అనందస్వరూపం .
ముందు ప్రకాశ శక్తి, విమర్శ శక్తి చూద్దాము
ప్రకాశబిందువు,( అ )విమర్శ బిందువు,(హ) మిశ్రమ బిందువు, (అహం )ఇవే బిందుత్రయము.
వాటి వివరణ చూద్దాము
అక్షరాలలో "అ " కు ముందు ఏ అక్షరం లేదు. కాబట్టి అ అనేది సదాశివ స్వరూపం. చివరి అక్షరం " హ ". హ తరువాత ఇంక ఏ అక్షరం లేదు. ళ, క్ష ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ స్వతంత్ర అక్షరాలు కాదు. ""ల ళ యోరభేదః "" అని చెప్పుటచేత ల - ళ భేదం లేదు. క్ష అనేది సంయుక్త అక్షరం ఇది కూడా స్వతంత్ర అక్షరం కాదు. కాబట్టి " హ " చివరి అక్షరంగా గ్రహించండి
హకారమే శక్తి స్వరూపం.
శివుని డమరుకం నుండి వెలువడినవి
వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు.
1 అ,ఇ,ఉ,ణ్,
2 ఋ,ఌ,క్
3 ఏ,ఓ,ఙ్
4 ఐ,ఔ,చ్
5 హ,య,వ,ర,ట్
6 ల,ణ్
7 ఞ,మ,ఙ,ణ,న,మ్
8 ఝ,భ,ఞ్
9 ఘ,ఢ,ధ,ష్
10 జ,బ,గ,డ,ద,శ్
11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్
12 క,ప,య్
13 శ,ష,స,ర్
14 హ,ల్
అనే వ్యాకరణ సూత్రములు ఇవే ప్రకటిస్తున్నాయి.
అక్షరాలలో మొదటి అక్షరం 'అ " ఇది సదాశివ స్వరూపం. "హ " చివరి అక్షరం శక్తి
స్వరూపం. రెండు అక్షరాలకు సామ్యం ఉన్నది.
"అ, కు, హ విసర్జనీయానాం కంఠః"
జాగ్రత్తగా గమనిస్తే రెండు అక్షరాల పుట్టుక కంఠ స్థానమే. తేలికగా పలికితే " అ" ఒత్తి పలికితే "హ " అంతేతేడా ఆ రెండింటి సంయోగం "అహం "
అ, హ కలిస్తే అహ అవ్వాలి గాని అహం ఎల్లా అయింది? అనే సందేహం వస్తుంది.రెండు బీజములు కలిసి నప్పుడు నాదం వస్తుంది.
రెండు వస్తువుల రాపిడి వలన ధ్వని వచ్చినట్లు. ఆ ధ్వనినే నాదం అంటాము. ఇక్కడ నాదం బిందువు (o) గ్రహించండి.అందుచేత అహం అయింది
అకార హకారములు రెండు శివ, శక్తి స్వరూపాలు.
""న శివేన వినా దేవీ దేవ్యాచ న సదాశివః
నైత యోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివ""
శివుడు లేనిదే అమ్మ లేదు. అమ్మ లేనిదే శివుడు లేడు. ఇద్దరికీ తేడా లేదు. వారు చంద్రుడు వెన్నెలా వంటివారు
అను ఆగమ సిద్ధాంతము వలన శివశక్తులకు అన్యోన్యబేధము లేదని తెలుస్తోంది.
(ఇక్కడ సమన్వయము జాగ్రత్తగా చూడండి )
ప్రకాశబిందువు శివస్వరూపము, మరియు చంద్ర మండలము. ‘అ’కారముగా గ్రహింపవలెను.
విమర్శ బిందువు శక్తి స్వరూపము. అగ్ని మండలము. ‘హ’ కారముగా గ్రహింపవలెను. ఈ ప్రకాశ, విమర్శ బిందువుల సంయోగము వల్ల అంటే చంద్ర అగ్ని కలయిక వల్ల మిశ్రమ బిందువైన సూర్యబిందువు ( అహం) జనించుచున్నది.
అకార స్వరూపమగు పరమశివుడు, హకార స్వరూప పరాశక్తిని వీక్షించినపుడు, ఈ వీక్షణ సంయోగము వల్ల జనించిన మూడవ ప్రతిబింబము ‘అహం.’ ఇక్కడ "అహం "పరాశక్తి. కాబట్టి పరాశక్తి అద్దము వంటింది.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
రెండవ భాగం
""స్ఫుట శివశక్తి సమాగమ బీజాంకుర రూపిణీ పరాశక్తిః
అణుతర రూపానుత్తర విమర్శ లిపి లక్ష్య విగ్రహ భూతి""
బీజాంకుర రూపమయిన( విత్తనం, మొలక)
విత్తనం ప్రకాశ బిందువు. మొలక విమర్శ బిందువు అని గ్రహించండి.) ప్రకాశ విమర్శనాత్మక శివ మరియు శక్తి స్వరూప తేజోమయమయిన ‘అహ’ మనే బీజద్వయము శరీరముగా కలిగి పరాశక్తి ప్రకాశించుచున్నది.
(అహం అనేది పరాశక్తిగా గుర్తించండి.)అందువలన పదములు, వాక్యములు, వేదాది సకల శాస్త్రములు, గాయత్రీ మొదలగు మంత్రములు సృష్టింపబడినవి. కావున అన్ని వర్ణములు శివశక్తిమయములే. మనయందుగల అజ్ఞానమనే చీకటిని ప్రారదోలి జ్ఞానమనే వెలుగును ప్రకాశింపచేయునవి సదాశివశక్తులు.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి , సరస్వతి, లక్ష్మి, పార్వతి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్నా - ఏకత్వ లక్షణములు గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ –అర్ధం : బిందువు శివుడని చెప్పబడింది. అమ్మవారు చంద్రుడు. ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెబుతోంది.
శ్రీచక్రము చూడండి
శ్రీచక్రములోని త్రికోణం చూడండి.
ఈ అథోముఖముగా ఉన్న త్రికోణంలోగల త్రిరేఖల యందు సమానముగా 16 అక్షరాలు కలవు. ఒక రేఖ యందు అ నుండి అః వరకు 16 అక్షరములు, మరియొక రేఖ యందు క నుండి త వరకు 16 అక్షరములు, మరో రేఖ యందు థ నుండి స వరకు 16 అక్షరములు కలవు.
ఇదే " అ క థ "" ఆది రేఖా త్రయం ప్రకాశ, విమర్శ, మిశ్రస్వరూపమైన మహాబిందువు ఉందికదా . అది అహమనే వర్ణద్వయం కలిగి ఉంది, ఇది రక్తశుక్ల బిందువుల మేళనము. అంటే చంద్రాగ్నుల సమిష్టి రూపం. ఈ బిందువులోని ప్రకాశవిమర్శాంశలే కామేశ్వర కామేశ్వరీ దివ్యదంపతులు. ఈ ఉభయాంశల మిశ్రబిందువే సూర్యస్వరూపం. ఇదే సర్వకారణ బిందువు.
అకారం నుండి అః వరకు ఉన్న షోడశ స్వరాలు సోమ మండలానికి సంబందించినవి.శివ స్వరూపాలు. య నుండి క్ష వరకు ఉన్న పది అక్షరాలు అగ్ని మండలానికి సంబందించినవి. శక్తి స్వరూపాలు. ఇక కకారము నుండి భకారం వరకు ఉన్న ఇరువది నాలుగు సూర్య కళలు.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించగలరు.
కకారము నుండి ఠకారం వరకు అనులోమం లోను, డకారము నుండి భకారం వరకు విలోమం లోను ఒక్కటొకటి చొప్పున "కం భం" "ఖం, బం" అని ఈవిధంగా వస్తాయి.అనులోమ అక్షరాలు శివ స్వరూపం.విలోమ అక్షరాలు శక్తి స్వరూపం. ఇవి చంద్ర, అగ్ని కళల సమ్మిశ్రమంతో వచ్చినవి. ఇవి సూర్య కళలు. ఇది అహం రూపంగా గ్రహించాలి.ఇందులో క నుండి మ ఉన్న అక్షరాలు కామకళా రూపాలు అని గ్రహించాలి.
ఈ కళలతోనే మనము శ్రీచక్రార్చనలో పాత్రలను స్థాపన చేస్తాము. ఈ అగ్ని, సూర్య, సోమకళలు ఓంకార రూపంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాత్రాధారమును అకారంగా, పాత్రను ఉకారముగా, అమృతమును మకారము గా చెబుతాము.ఇక్కడ ఓంకారము సంవిద్బిందువు.
గమనించగలరు.
ఈ మూడు బిందువులను కలిపి ఒక త్రిభుజం తయారుచేసుకొని, మూడు భుజాలు కలిసేచోట మూడు కోణాలు వస్తాయి. అనగా త్రిభుజము , త్రికోణాలు ఏర్పడతాయి . ఈ త్రికోణం మధ్యలో మూడు మండలముల యొక్క ప్రకాశముల ( కాంతుల ) కదలికలో, మూడు ప్రకాశముల యొక్క స్వభావంతో కూడి, నాలుగవ బిందువు తయారైనది ఈ నాల్గవ బిందువే సంవిద్బిందువు. నాల్గవ బిందువును కలిపి బిందు చతుష్టయం అంటారు. ఈ బిందు చతుష్టయము సృష్టికి పూర్వం ఉన్నటువంటి అవ్యక్తము. బిందు చతుష్టయము అంటే అవ్యక్తము,
బిందు త్రయాన్ని మరొక పద్ధతిలో చూద్దాము .
..సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
మూడవ భాగం
ప్రకాశ బిందువు, విమర్శ బిందు ప్రకాశాలు (కాంతులు )రెండు కలిపితే బ్రహ్మ, మాయ కలవడం వంటిది. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం, వ్యక్త స్థితిలో శివుడు శక్తి వేరుపడ్డారు. వేరుపడ్డప్పుడు శివుడు నిర్వికారం అయినప్పటికీ, ఈ వేరుపడ్డ శివుని మాయ వికారంగా ( చైతన్యంగా )చూపిస్తుంది. శివుడు వికారి కాలేదు, నిర్వికారమే, వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణ రహితమైన బ్రహ్మమును ఆశ్రయించి, ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మమును చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మముగా కనబడేలా చేస్తుంది.
పై విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి
ఋగ్వేదం అకారం తోను, యజుర్వేదం ఇకారం తోను సామవేదం ఐకారంతోను ప్రారంభం అగును.
. పరమేశ్వరుడు వేదానికి మొదలైన "అ"కార రూపుడైతే వేదాలు తరువాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏమి వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్న ''ఓం'' వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినవి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలైనవి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్ర శక్తి ఉంటుంది. మంత్రంలో మంత్రార్థం ఉంటుంది. మంత్రం ఒట్టి అక్షరాలు కాదు. ప్రాణం ఉన్న అక్షరాలు. ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థంలేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడినది ఒక అర్థాన్ని ,ఒక పరమార్ధాన్ని, ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. దానిని బట్టి ఈ వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందురూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినపుడు, శివశక్త్యాత్మకమైనపుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుండి వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుని వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైన ఆత్మశక్తియందు ప్రవేశించి, శుక్లబిందు రూపమును పొందెను. ఇదియే పురుషుడయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువు నందు జేరి, రక్తబిందు భావమును పొందినది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ బిందువు వలన నాదము పుట్టెను.అదే అహం లోని బిందువు యొక్క నాదము వలన షోడశ కళలు ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైన పదునాలుగు భువనములను సృష్టించినది.
సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘అస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట.
ఈ బిందు నాదములు అహం అనే రెండక్షరాలకు శరీరముగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువైనది. శుక్ల బిందువు చంద్ర బిందువైనది. ఈ రెండింటి మిశ్రమ రూపమైన బిందువు సూర్య బిందువైనది. అదే "అహం "ఈ బింద్రత్రయము వలన శ్రీచక్రములో త్రికోణ చక్రం ఆవిర్భవించెను. ఆ చక్ర మధ్యలో నున్నది సంవిద్బిందువు అని గ్రహించండి . ఈ సంవిద్బిందువే పరాశక్తి. ఈ నాల్గు బిందువులు కలసిన ఈ ఆవరణయే భ్రమణ వేగముతో కదలి, మిగిలిన చక్రములు సర్వము ఏర్పడినవి .
శ్రుతులు అనేక భేదములుగా ఉన్నను, ఉపనిపదర్థమందు సర్వశ్రుతులును లయ మగుచున్నవి గాన ఉపనిపత్తులకన్న వేరే ప్రమాణము లేదు గాన ఈ వివరణ సర్వోవనిషత్ సమ్మతముగా నున్నది.
ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు - ఈ మూడు బిందువులను మూడు కోణములుగా చేసి త్రిభుజమును తయారుచేస్తే ఈ మూడు బిందువులను కలుపుతూ ఒక వృత్తము గీస్తే ఆ వృత్తమే సూక్ష్మ శ్రీచక్రము.
ఆ ప్రకాశ విమర్శ బిందువులు ప్రవంచావిర్భావ పరిపాలన లయములు గలవి.(సృష్టి, స్థితి సంహారం ) నిత్యయుతములు.(ఎప్ప్పుడు జరుగుతుంది )కామేశ్వరీ కామేశ్వరులు వాగర్థరూపములని చెప్పినందున పైన చూపించిన త్రికోణమందు ' మధ్యబిందువు నందు ప్రకాశ విమర్శ శక్తి సూక్ష్మముగా నున్నది, అదియే అత్మ. అంటే సంవిద్బిందువు. .
సృష్టి ఆది వస్తువునందు ఉన్నది శివశక్తులే.
ఆత్మ యందు శివశక్తుల వస్తుద్వయ మేళనము గలదు. అది భావిసృష్టికి కారణము. సృష్టికొరకు
సత్వరజస్తమస్సులనే గుణత్రయరూపములను పొందినది.
అవే కోణబిందువులుగా నున్నవి. ఆకోణ బిందువులు త్రిగుణమయ
రూపములుగాను, వాగ్భవ కామరాజ శక్తి బీజములుగాను, అందు ప్రతి
బిందువునందును ప్రకాశ విమర్శశక్తులు ఇమిడియున్నందున వాణీ హిరణ్య
గర్భ ద్వంద్వమును, లక్ష్మీనారాయణద్వంద్వమును, ఉమామహేశ్వర
ద్వంద్వమును అయియున్నవి. ఇక ఈ కోణబిందు త్రయమే సృష్టిలో
ప్రధాన వస్తువులగు చంద్రాగ్ని సూర్యమండ లముల "కాస్పద మైనది. వీని వలన ఆకాశాది పంచభూతములును, వాటివలన శాఖోవశాఖలుగా సృష్టి అంతయు పెరిగినది.
ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరించగా, ఒకటి ‘పుం’ రూపము, మరియొకటి స్త్రీ రూపమయినది.అవే శివశక్తి రూపములు. ఒకే తత్త్వమును స్వభావమును, రూపమును, నామము కలవి. ఆయన సదాశివుడు ఆమె శక్తి. ‘నమశ్శివాభ్యం నవయౌవనాభ్యం’ అని శంకరాచార్యుల వారి స్తుతిని పరిశీలిస్తే . వారు నిత్య యవ్వనులు అనే మాట స్పష్టము అవుతుంది..
పరమాత్మ అంశములు – ఆస్తి, భాతి, ప్రియం, నామరూపములు , అనగా మొదటి మూడు పరమాత్మ యొక్క అవ్యక్తమైన స్థితి. నామమన్నది వాగర్ధ రూపము. వాక్కు శక్తిరూపం – అర్ధం శివరూపము. ఇది అక్షరము, సకలము, వ్యక్తము, మూర్తము కనుకనే శివశక్తులను గురించి మనము అనగలము, వినగలము, మాట్లాడగలము. ‘నశవేన వినాశక్తిర్న శక్తి రహితః శివః’, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు లేనిదే శక్తి లేదు.
ప్రకృతి అంతా శివునిచే చైతన్యవంతమైనది. ప్రకృతిలో లీనమైన పరమాత్మ వలన ప్రకృతి ప్రకాశించుచున్నది. అది అజడ ప్రకృతి. జడ ప్రకృతి జీవము లేనిది కనుక ప్రకృతికి శివుడే రూపము. రూపము కాలమును బట్టి, స్థలమును బట్టి ఏర్పడును. ఈ రూపము శక్తి భాగము. ఈ రూపమును చైతన్యము చేయువాడు శివుడు. ఇతి స్థూలంగా శివశక్తిమయమైన అంశపంచకము యొక్క లక్షణము.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
నాల్గవ భాగం
వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము(మాయచేత చలించు లేదా స్పందించు బ్రహ్మము ). ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది.అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత మొట్టమొదట ఆవిర్భవించినది అనాహతం నుంచి ఆవిర్భావించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలు రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి.
ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబశక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయింది . అప్పుడు మహత్ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి (వ్యాపాక శక్తి) విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య-అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు.(సృష్టి మొత్తం ఒకే పురుషుడుగా ఉండుట) అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్, అహంకారము అని పేరు కలిగినది.
కామకళ నిరూపణ
మూలకూటత్రయ-కళేబరా - లలితా సహస్రనామంలోని నామము .
మూలస్య కుటత్రయమేవ కళేబరం (=స్థూలరూపం) యస్యాః సా
మూల మంత్రం యొక్క మూడు విభాగాలు ఆమె శరీరాన్ని ఏర్పరుస్తాయి.అదే అమ్మవారి స్థూలరూపం అని గ్రహించండి
మంత్రం యొక్క మూడు కూటాలు ఆమె భౌతిక లేదా సూక్ష్మ రూపాన్ని ఏర్పరుస్తాయి.
అసలు అర్థంలో మూల అనే పదానికి కామకళ అని పిలువబడే సూక్ష్మ శరీరం అని అర్ధం , మరియు విభజనలు కామకళ యొక్క భాగాలు. కామకళ లోని మొదటి భాగాన్ని ఊర్ధ్వ బిందువు అని , రెండవ భాగాన్ని రెండు సూర్య చంద్ర బిందువులని మరియు చివరి భాగాన్ని సార్ధకళ అని అంటారు .
త్రయ అంటే మూడు. పంచదశి మంత్రంలోని మూడు కూటాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పంచదశికి 'కామకళ ' మూలమని మనం చూశాం. కాబట్టి, ఆమె భౌతిక మరియు సూక్ష్మ రూపాలు రెండూ 'కామకళ'ను సూచిస్తాయని ఇది సూచిస్తుంది. మూడు సూక్ష్మ రూపాలలో, మొదటి సూక్ష్మ రూపం పంచదశి మంత్రం, . రెండవ సూక్ష్మ రూపం , కామకళ రూపం ఇక్కడ చర్చించబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మూడు బిందువులు త్రికోణంగా కలిగిన హంస మరియు సోహం (హంస మంత్రం) కలయికను కామకళ అంటారు. ఇది లలితాంబిక యొక్క వాస్తవ భౌతిక రేఖాచిత్రం. ఇందులో ఉన్న బీజం 'ఈం '. ఈ బీజం చాలా శక్తివంతమైనది మరియు షోడశీ మంత్రంలో ఈ బీజాన్ని ఎలా ఉపయోగించాలో ఈ అంశం తెలుసుకొని శ్రీం బీజం చేర్చుకోవాలి .
మంత్రాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి - పురుష, స్త్రీ మరియు తటస్థ .
హుమ్ , వషట్ మరియు ఫట్‌తో ముగిసే మంత్రాలు పురుష మంత్రం.
స్వాహా మరియు వౌషట్ తో ముగిసేవి స్త్రీ దేవతా మంత్రాలు ;
నమః తో ముగియడం తటస్థ మంత్రాలు .
పురుష మరియు తటస్థ మంత్రాలను "మంత్రం" అని పిలుస్తారు మరియు స్త్రీ దేవతా మంత్రాలు " విద్య " అని పిలుస్తారు, అందుకే షోడశి మంత్రానికి శ్రీవిద్య అని పేరు.
జపం మూడు రకాలు:
1.వాచ్యం - వినబడేలా చేయబడింది
2. ఉపాంశు - గుసగుసల వలె జపించడం
3. మానస – మానసికంగా చేస్తారు.
హ్రీం, శ్రీం సౌః వంటి బీజ మంత్రాలు అని పిలువబడే ఏక-అక్షర మంత్రాలు గుర్తుంచుకోవడానికి మరియు పఠించడానికి సులభమైనవి; అవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న విత్తనంలో గంభీరమైన చెట్టు ఉన్నట్లుగా, ప్రతి బీజంలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృజనాత్మక శక్తి ఉంటుందని గ్రహించండి . ఈ బీజాలలో పురాతనమైనది మరియు విస్తృతంగా తెలిసినది ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్ చెబుతోంది.
ఓంను ప్రణవ మని పిలుస్తారు,
ఓం అనేది విశ్వం యొక్క “ప్రాథమిక బీజం ”-ఈ ప్రపంచం మొత్తం, “ఓం తప్ప మరొకటి కాదు” అని ఒక పురాతన వచనం చెబుతోంది. ఇది అన్ని ఇతర మంత్రాలు ఉద్భవించే మూల మంత్రంగా కూడా పరిగణించబడుతుంది మరియు వేదాల యొక్క అనేక వేల శ్లోకాల యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. కఠోపనిషత్తు ప్రకారం, ఓం అనేది "వేదాలన్నీ సాధన చేసే పదం."
అందుకని, ఓం అనేది ధ్యాన బీజం ., ఓం "మనలోని అనంతమైన అనుభవాన్ని" వ్యక్తపరుస్తుంది . ఈ విధంగా, ఓం జపించడం అనేది మనలో ఉన్న దైవాన్ని తాకడానికి సులభమైన మార్గం.
ఓం అనేది వైదిక కామకళ
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
ఐదవ భాగం
యోగులు తరచుగా ఓంను ధ్యానం చేస్తారు.
సన్యాసం తీసుకున్నవారు కేవలం ఓం మాత్రమే జపిస్తారు. రుద్ర నమకం ఒక్కటి పారాయణం చేయవచ్చు. ఇంక ఏ మంత్రములు చూడరు.
సాధారణంగా ఓం అని ఉచ్ఛరించినప్పటికీ, మంత్రం వాస్తవానికి మూడు అక్షరాలను కలిగి ఉంటుంది, అ , ఉ మరియు o( మ్ .) ఉన్నాయి.
చంద్రుని యొక్క కళలు పదహారు. పాడ్యమి నుంచి పూర్ణమి వరకు తిథులు పదిహేను. కాగా పదహారవ కళ సాక్షాత్తూ ఆ పరమేశ్వరి అయి ఉన్నది.అదే కామకళ
షోడశీ తు కళా జేయా సచ్చిదానంద రూపిణీ ||
అంటే పరమేశ్వరియే షోడశీకళ. సాదాఖ్యకళ, చిత్కళ, ధృవకళ, బ్రహ్మకళ, పరమాకళ, కామకళ అని పిలువబడుతోంది.
కామము అంటే కోరిక. సాధకుని కోరికలు తీర్చేకళ. అదే కామకళ. సాధకుడి కోరికలు అనేకానేకాలు ముఖ్యంగా అవి రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఇహానికి సంబంధించినవి అర్ధకామాలు. పరానికి సంబంధించినవి ధర్మమోక్షాలు. సంసార లంపటంలో కూరుకుపోయిన మానవుడు తన కష్టాలన్నీ తీరిపోవాలని, సుఖాలు పొందాలనుకుంటాడు. అందుకోసం ధన సంపాదన కావాలి. ఈ రెండింటి కోసమే అతడు ప్రాకులాడతాడు. అయితే ఉత్తర జన్మ ఉత్తమ జన్మ కావాలంటే ధర్మము తప్పనిసరి.
దానిద్వారానే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా భక్తులకు చతుర్విధ పురుషార్ధాలను తీర్చేది ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. కాబట్టి
కామకళ అనబడుతుంది.
ఇది సచ్చిదానంద స్వరూపము. కాబట్టి బిందుమండలంలో ఉంటుంది. అనగా శ్రీచక్రంలోని బిందువులో ఈ పరమేశ్వరి ఉంటుంది. మరి అక్కడ ఒక్క పరమేశ్వరియే ఉంటుందా? అన్నప్పుడు ఆ దేవి పరబ్రహ్మ స్వరూపము. అంటే శివశక్తుల సమ్మేళనము. కాబట్టి 'శివేన వినాశక్తిః' శివుడు లేకుండా శక్తి లేదు.
శివశక్తులు ఇద్దరూ కలిసిన లలితా సహస్ర నామాలలో కామకళను వివరించటం జరిగింది.ఆ నామాలు ఇక్కడ చూద్దాము
కామ్యా - కోరదగినటువంటిది.
జ్ఞానముచే పొందబడినది. ముముక్షువులచే కోరదగినది.
పరమేశ్వరి జ్ఞానరూపిణి. సాధకులు జ్ఞానభావంతో జీవాత్మ పరమాత్మ వేరుకాదు అని ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినట్లైతే, అట్టివారికి మోక్షం ప్రసాదిస్తుంది. అందుచేత దేవి కామ్యా అనబడుతుంది. సృష్టి ప్రారంభం కాక ముందు పరమేశ్వరుణ్ణి సృష్టికి సుముఖునిగా చేసిన రూపవిశేషము ఆ దేవి. అందుకే ఆమె కామ్యా అనబడుతోంది.
కామము అనగా కోరిక. ఈ కోరికలన్నీ బుద్ధివలన కలుగుతాయి. బుద్ధికి చైతన్యము కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసిన కర్మానుసారము ఈ కోరికలు కలుగుతాయి. అంటే జీవుల స్థాయిని బట్టే కోరికలు కలుగుతాయి..
అయితే ఈ కోరికలు నాలుగురకాలుగా ఉంటాయి. వీటిని ధర్మ, అర్ద కామ మోక్షలు అనే క్రమంలో కాకుండా వారి స్వభావాన్ని వేరే విధంగా వ్రాయవలసి వచ్చింది అవి
1. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు పొందాలి అనుకోవటం. ఇది కామము. సాధారణంగా ఎక్కువ మంది ఈ మార్గంలో ఉంటారు కదా
2. జీవించి ఉన్నంతవరకు దుఃఖము లేకుండా ఉండటము, సుఖాలు పొందాలి అనుకోవటము ఇది అర్ధము.
3. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేటట్లు కోరటం. ఇది ధర్మము.
4. అన్ని జన్మలలోను నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరటం. ఇది మోక్షము.
వీటిలో ధర్మాన్ని కోరేవాడు - ఉత్తముడు
అర్ధాన్ని కోరేవాడు - మధ్యముడు
కామాన్ని కోరేవాడు - అధముడు
మోక్షాన్ని కోరేవాడు - ఉత్తమోత్తముడు
జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె కామ్యా అనబడుతుంది.
కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.కామేశ్వరుని యొక్క కళా రూపమే కామకళారూపా అనే నామము
కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.
కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
ఆరవ భాగం
కళావతీ -కళా స్వరూపిణీ.
కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.(ఆలాపనా అంటే పాటకు ముందు పాడే మధురగానము ) మరొక అర్ధం కూడా ఉంది
కలాలాపా. :- అలాపము అనగా మాట్లాడుట . అమ్మవారు కలాలాపా కావున మృదువుగా పలుకు స్వభావము కలది. అందరు అలవరచుకోవలసిన ముఖ్య లక్షణం
సమస్త వెలుగులకు కారణభూతులైన అగ్ని ,సూర్య ,చంద్రులకు కళలను ప్రసాదించి ఆ కళల ద్వారా మరియు సృష్టి స్థితి లయ కారకులగు బ్రహ్మ, విష్ణు , రుద్రులకు శక్తినిచ్చి దేవతా స్వరూపాలకు తానే వెలుగులను అందిస్తూ వివిధ కళా రూపాలతో విరాజిల్లుచున్నది
కాంతా - కామింపబడినటువంటిది. ఆకర్షణీయమైన శక్తి స్వరూపం
మరొక అర్ధం చూద్దాము
కాంతా :-క అనగా బ్రహ్మ. అనగా బ్రహ్మ అంతమును కూడా సిద్ధింపజేయునది . బ్రహ్మమయ సిద్ధాంతము ద్వారా పరమార్థము తెలుపునది . బ్రహ్మ దేవుని జీవిత కాలపరిమితిని కూడా తానే నిర్ధారించి అంతమొందించునది
కాదంబరీ ప్రియా - ఆనందంతో పరవశించుటను ఇష్టపడునది
మరొక అర్ధం చూద్దాము
కాదంబరీ అనగా కడిమి పువ్వుల మకరందము గ్రోలుట యందు ఇష్టపడుతుంది .
మరియొక అర్థంలో
మనము భక్తి భావ పూర్వకముగా పూజలో భాగముగా విశేషార్ఘ్యఅమృత తర్పణము మిక్కిలి ఇష్టపడును .
కాదంబరి అనగా సర్వ విద్యాధి దేవత అయిన సరస్వతి మాత అనిన అమ్మ లలితాదేవికి అత్యంత ప్రీతికరం . ఏలయన సరస్వతీ దేవి విద్య ద్వారా జ్ఞానం పెంపొందించు జ్ఞాన ప్రదాత. అందువలన ఆ జ్ఞాన ప్రకాశంతో జ్ఞానామృత పానము చేసిన తన భక్తుల యందు ప్రియత్వం కలిగియుండును
కామకలారూపా - అనే నామంలో కామకళను వివరించటం జరిగింది. ఆ దేవి యొక్క తత్త్వాన్ని వివరిస్తూ ఆమె కదంబ కుసుమప్రియ, మంగళ స్వరూపమైనది, చరాచర జగత్తుకూ మూలాధారమైనది. ఆమె కళాస్వరూపిణి. కళలు అంటే విద్యాకళలు, వృత్తి కళలు, దేవతా కళలు, షోడశ కళలు వీటన్నింటి స్వరూపము ఆ పరమేశ్వరి. ఆ దేవి మృదుమధురమైన వాక్కు గలిగినది. జగత్తులోని గొప్ప స్త్రీత్వమంతా ఆమెలోనే ఉన్నది. విలాసము కొరకు ఉత్తమమైన మధువును గ్రహిస్తుంది.
మహిషాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆ రాక్షసుడు గర్జిస్తుంటే
గర్జ గర్జ క్షణం మూఢ మధు యావ త్విబా మ్యహమ్
అర్ధం
ఓరి మూర్ఖుడా ! నేను ఈ మద్యము తాగేవరకు నువ్వు గర్జిస్తూ ఉండు అంటుంది.
కామకళను అర్చిస్తే వచ్చే ఫలితము ఏమిటో చెబుతున్నాడు. ఆ పరమేశ్వరి కరుణామృతసాగరా, కరుణా సముద్రురాలు. భక్తులందరి కోరికలు తీరుస్తుంది. దయాసముద్రురాలు. ఆమె కామ్యా అనబడుతోంది. అంటే భక్తుల యొక్క అన్ని కోరికలను తీరుస్తుంది. ఇహపరాలు రెండూ ఇస్తుంది.
కామేశ్వర కామేశ్వరీ రూపమును , నాదరూపము, కామకళా రూపము అంటారు .
ఈశ్వరునియొక్క ఇచ్చాశక్తియైన మొదటి రూపమే కామకళ.
బిందువుతో కూడిన నాదరూపమే అమ్మవారు. ఈ రూపాన్నే 'కామకళారూపం' అంటారు
కామకలా విలాసము అనే 55 సూత్రాలున్న గ్రంథాన్ని పుణ్యానంద మునీంద్రుడు వ్రాశారు .
ఆ గ్రంథములోని విషయాలు ఈ వ్యాసములో వ్రాస్తున్నాను.
కామాకళా ధ్యానం వలన వచ్చే ఫలితం గురించి ఈ శ్లోకం వివరిస్తోంది
యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః
శ్రీ సుందరీ సాధక పుంగవానాం
భోగ శ్చ మోక్ష శ్చ కరస్థ ఏవ
ఆ దేవిని అర్చిస్తే తీరని కోరిక అంటూ ఏదీ లేదు
. ""కామకళా రూపా "" అయిన శ్రీ లలితాంబికకు నమస్కారములు
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ