12, జులై 2025, శనివారం

తిరుమల సర్వస్వం -,298*

 *తిరుమల సర్వస్వం -,298*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-13


ఆదాయ వనరులు

ఆరోజుల్లో తిరుమలేశునికి అనేకానేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరేది. కానీ, ప్రముఖంగా చెప్పుకోదగ్గవి మూడు ఆదాయ వనరులు. అవేంటంటే...


హుండీ కానుకలు, నగదు విరాళాలు - నాటికీ, నేటికీ కూడా స్వామివారికి సమకూరే ఆదాయంలో అత్యధికభాగం కానుకలు, విరాళాల రూపం లోనే! ఆనాటి భక్తులు ఆత్మసమర్పణాభావంతో అయ్యవారికి ఆర్తిగా అర్పించుకునే కానుకల వివరాలను - 1831 వ సం. నాటి, ప్రఖ్యాతి గాంచిన ఏషియాటిక్ జర్నల్ అనే ఆంగ్ల త్రైమాసిక పత్రికలో ఈ విధంగా వర్ణించారు: 


భక్తులు సాధారణంగా సమర్పించుకునే మొక్కుబడులలో - మేలిమి బంగారు, వెండి అచ్చులు, స్వదేశీ, విదేశీ నాణేలు, మనం ఇంతకు ముందు చెప్పుకున్న పగోడాలు, నగదుమూటలు, రాగి డబ్బు, సుగంధద్రవ్యాలు, ఇంగువ, తలనీలాలు - ఇలా ధనరూపం లోనూ, ద్రవ్యరూపం లోనూ ఉండేవి. స్వామివారికి సమర్పించు కోవడానికి ఏదీ అనర్హం కాదు. 


సౌందర్యం పోతపోసి నట్లుండే ఓ నవయువతి తన తల్లిదండ్రుల మొక్కు తీర్చడానికై తన తలనీలాలను సునాయాసంగా త్యాగం చేస్తుంది. ఓం కుంటి వాడు వెండిపాదాన్ని, ఓ గ్రుడ్డివాడు బంగారునేత్రాన్ని - ఇలా చెప్పుకుంటూ పోతే, భక్తులు సమర్పించుకునే కానుకలకు అంతే లేదు. ఓ యువతి తాను బాల్యం నుండి గర్వాతిశయాలతో అలంకరించుకున్న నగలన్నింటినీ మూట గట్టి హుండీలో వేస్తుంది. చినిగి చీలిక పేలికలైన దుస్తులతో కనుపించే పేదరాలు, తాను కలలో కూడా ధరించలేనంత ఖరీదైన చీనీచీనాంబరాలను స్వామికి భక్తితో సమర్పించు కుంటుంది. మరొక స్త్రీ తన శిశువు కాలికి ఉన్న బంగారు కడియాన్ని పెరికి కొప్పెరలో (హుండీకి మరోపేరు) వేస్తుంది. అప్పటివరకూ ఎండ కన్నెరగని, స్వగ్రామం దాటని ఓ ఒంటరి మహిళ వందలాది మైళ్ళు ప్రయాణించి, కాలినడకన శిఖరాన్ని అధిరోహించి తన మొక్కు తీర్చుకుంటుంది. పుత్రోత్సాహం, విరోధులతో సయోధ్య, శత్రువిజయం, సుఖవంతమైన ప్రయాణం, వ్యాపారాభివృద్ధి, రోగోపశమనం లాంటి ఎన్నో, ఎన్నెన్నో కోర్కెలు కోరుతూ, లేదా వాటిని తీర్చుకుని, కానుకలతో పాటుగా భక్తులు తిరుమల విచ్చేస్తారు. తమ బంధు మిత్రుల తరఫున కూడా కానుకలు తెచ్చి స్వామివారికి సమర్పించు కుంటారు‌.


ఆహా!! ఆంగ్లేయులు అరమరికలు లేని ఆనాటి భక్తుల ఆర్తిని, శ్రీనివాసుని పట్ల వారి నిబద్ధతను, కానుకలు సమర్పించు కోవడంలో వారి ఓదార్యాన్ని - కళ్ళకు కట్టినట్లు, ఏమాత్రం శషభిషలు లేకుండా ఎంత హృద్యంగా చిత్రించారు?? చదువరుల కనులు చెమ్మగిల్లి వారి మది భక్తి రసాస్వాదనలో ఓలలాడాల్సిందే!


వర్తన - స్వామివారికి నగదు రూపంలో, ద్రవ్యరూపంలో వచ్చే కానుకలతో బాటుగా; ఆభరణాలు, వెండి, బంగారు పాత్రలు, చీనీచీనాంబరాలు, ధనుస్సు, ఖడ్గం, గద తదితర ఆయుధాలు వంటి ఖరీదైన వస్తువిశేషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలయానికి తక్షణాదాయం చేకూర్చవు. పైగా, వాటి రక్షణకు, వాటిని పదిల పరచడానికి, శుభ్రపరచడానికి, తరచూ మెరుగు పెట్టడానికి పెద్ద మొత్తం వ్యయమవుతుంది. ఈ ఖర్చులను రాబట్టుకునే నిమిత్తం వస్తురూపంలో కానుకలు సమర్పించుకునే భక్తుల వద్దనుండి కొంత రుసుము వసూలు చేసేవారు‌. కానుక యొక్క విలువను మదింపు జేసి, దానికి సమానమైన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. ఈ మొత్తాన్నే వర్తన అంటారు. రాను, రాను ఈ మొత్తం భక్తులకు అదనపుభారం కావటం వల్ల, ఈ మధ్యకాలంలో వర్తనను రద్దు జేయటంతో భక్తులకు ఉపశమనం లభించింది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: