🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏
మొదటి భాగం
కామకళను గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.
కొన్ని భాగాలుగా అందిస్తాను. రహస్యం ఆగుట చేత బీజాక్షరాలు చెప్పకుండా వాటి అర్ధం చెప్పడం జరిగింది గమనింప ప్రార్ధన
జాగ్రత్తగా చదవండి.అర్దమగుటకు ఉన్నంతలో తేలికగా వ్రాశాను.
ముందుగా సత్యము -- అసత్యము గురించి తెలుసుకోవాలి.
తరువాత ప్రకాశ, విమర్శ, మిశ్రమ, సంవిద్బిందువులు తెలుసుకొని అప్పుడు కామాకళా స్వరూపం గ్రహించాలి.
ఈ సృష్టిలో సకల వస్తువులు-- జీవులు
సత్యము -- అసత్యము అనే రెండు పదార్ధముల మేళనము కలిగియున్నవి. ఇందు అసత్యమనునది నామరూపములు కలది.నామ రూపములు ఉన్నాయి అంటే అది నశిస్తుంది అంతవరకు ఎందుకు?.మనకు నామ రూపములు ఉన్నాయి కదా! ఇది శాశ్వతం కాదు. కాబట్టి అసత్యం ఇక రెండవదైన సత్యము ఆ నామ రూపములకు చైతన్యమును, వృద్ధి -- క్షయములను కలిగించునది. ఇది మనలో కనబడకుండా ఉంటుంది.అదియే జీవుడు.ఈ సత్యాసత్యములు రెండును ప్రతివస్తువందును గలవు. -ఈరెంటిలో నామరూపములు గలది అసత్యభాగము. ఈరెండును కలసి జగత్తుగా నున్నది. ఆ రెంటిలో సత్య భాగమును సారమంటారు . తిలలందు తైలము సత్యము. అదియే సారము. రెండవది పిష్టము. అది అసత్య భాగము. మనుష్యునందు జీవుడు సత్యము. దేహము అసత్య భాగము.
ఈరెండును కలసి ఉన్నపుడు ప్రవృత్తి ( జీవన విధానం ) కలుగుచున్నది కాబట్టి ప్రపంచ
మందు సత్యము ప్రతి వస్తువులోను సారభూతముగా నున్నది. సారమనగా రసము.అంటే అనందస్వరూపం .
ముందు ప్రకాశ శక్తి, విమర్శ శక్తి చూద్దాము
ప్రకాశబిందువు,( అ )విమర్శ బిందువు,(హ) మిశ్రమ బిందువు, (అహం )ఇవే బిందుత్రయము.
వాటి వివరణ చూద్దాము
అక్షరాలలో "అ " కు ముందు ఏ అక్షరం లేదు. కాబట్టి అ అనేది సదాశివ స్వరూపం. చివరి అక్షరం " హ ". హ తరువాత ఇంక ఏ అక్షరం లేదు. ళ, క్ష ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ స్వతంత్ర అక్షరాలు కాదు. ""ల ళ యోరభేదః "" అని చెప్పుటచేత ల - ళ భేదం లేదు. క్ష అనేది సంయుక్త అక్షరం ఇది కూడా స్వతంత్ర అక్షరం కాదు. కాబట్టి " హ " చివరి అక్షరంగా గ్రహించండి
హకారమే శక్తి స్వరూపం.
శివుని డమరుకం నుండి వెలువడినవి
వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు.
1 అ,ఇ,ఉ,ణ్,
2 ఋ,ఌ,క్
3 ఏ,ఓ,ఙ్
4 ఐ,ఔ,చ్
5 హ,య,వ,ర,ట్
6 ల,ణ్
7 ఞ,మ,ఙ,ణ,న,మ్
8 ఝ,భ,ఞ్
9 ఘ,ఢ,ధ,ష్
10 జ,బ,గ,డ,ద,శ్
11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్
12 క,ప,య్
13 శ,ష,స,ర్
14 హ,ల్
అనే వ్యాకరణ సూత్రములు ఇవే ప్రకటిస్తున్నాయి.
అక్షరాలలో మొదటి అక్షరం 'అ " ఇది సదాశివ స్వరూపం. "హ " చివరి అక్షరం శక్తి
స్వరూపం. రెండు అక్షరాలకు సామ్యం ఉన్నది.
"అ, కు, హ విసర్జనీయానాం కంఠః"
జాగ్రత్తగా గమనిస్తే రెండు అక్షరాల పుట్టుక కంఠ స్థానమే. తేలికగా పలికితే " అ" ఒత్తి పలికితే "హ " అంతేతేడా ఆ రెండింటి సంయోగం "అహం "
అ, హ కలిస్తే అహ అవ్వాలి గాని అహం ఎల్లా అయింది? అనే సందేహం వస్తుంది.రెండు బీజములు కలిసి నప్పుడు నాదం వస్తుంది.
రెండు వస్తువుల రాపిడి వలన ధ్వని వచ్చినట్లు. ఆ ధ్వనినే నాదం అంటాము. ఇక్కడ నాదం బిందువు (o) గ్రహించండి.అందుచేత అహం అయింది
అకార హకారములు రెండు శివ, శక్తి స్వరూపాలు.
""న శివేన వినా దేవీ దేవ్యాచ న సదాశివః
నైత యోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివ""
శివుడు లేనిదే అమ్మ లేదు. అమ్మ లేనిదే శివుడు లేడు. ఇద్దరికీ తేడా లేదు. వారు చంద్రుడు వెన్నెలా వంటివారు
అను ఆగమ సిద్ధాంతము వలన శివశక్తులకు అన్యోన్యబేధము లేదని తెలుస్తోంది.
(ఇక్కడ సమన్వయము జాగ్రత్తగా చూడండి )
ప్రకాశబిందువు శివస్వరూపము, మరియు చంద్ర మండలము. ‘అ’కారముగా గ్రహింపవలెను.
విమర్శ బిందువు శక్తి స్వరూపము. అగ్ని మండలము. ‘హ’ కారముగా గ్రహింపవలెను. ఈ ప్రకాశ, విమర్శ బిందువుల సంయోగము వల్ల అంటే చంద్ర అగ్ని కలయిక వల్ల మిశ్రమ బిందువైన సూర్యబిందువు ( అహం) జనించుచున్నది.
అకార స్వరూపమగు పరమశివుడు, హకార స్వరూప పరాశక్తిని వీక్షించినపుడు, ఈ వీక్షణ సంయోగము వల్ల జనించిన మూడవ ప్రతిబింబము ‘అహం.’ ఇక్కడ "అహం "పరాశక్తి. కాబట్టి పరాశక్తి అద్దము వంటింది.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి