*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము
*435 వ రోజు*
*ప్రధమాశ్వాసం*
వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహా మునులకు ఈ విదంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! రధికత్రయం నా కుమారుడి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు. ఏమి చేసారు " అని అడిగాడు. సంజయుడు" మహారాజా ! అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవశిబిరాల వైపు వెళ్ళారు. ఆ సమయంలో పాండవశిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుధిలో తేలియాడుతున్నారు. ఆ సమయంలో అక్కడకు వెళితే వారి చేతిలో చావు తప్పదని రధిక త్రయం అక్కడినుండి తూర్పు దిక్కుగా వెళ్ళి కొంతదూరం వెళ్ళి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రధములు ఆపారు. సాయం సంధ్యా కార్య క్రమాలు ముగించుకుని వారు ముగ్గురూ భూమి మీద శయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు.
*కాకులు గుడ్లగూబలు*
కృపాచార్యుడు నిద్రపోయినా అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది, మరికొన్నిటిని కాళ్ళు చేతులు విరిచింది, కొన్నింటి పొట్టలు చీల్చింది, మరికొన్నింటి రెక్కలు విరిచింది ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తళుక్కున ఒక మెరుపు మెరిసింది. " నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను, బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమ వంతులైన వారందరిని సంహరించ లేను. అది మంచిది కాదు. ఏమాత్రం సంశయించక పాండవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. రారాజు బొందిలో ప్రాణముండగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్నుమూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయముతో సంహరించడమే ముఖ్యము అని శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. శత్రురాజుల మీద దండెత్తినపుడు, శత్రురాజులు విడిది చేసినపుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తున్నదని పెద్దలు చెప్తారు కదా ! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. పాండవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా ! వారు అధర్మం పాటించినపుడు నేను అధర్మంగా నడచుకున్న ఏమి దోషం. కనుక కల్మషహృదయులగు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందార్హం కాదు " అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి