12, జులై 2025, శనివారం

మహాకవుల ఊహలు

 శు భో ద యం 🙏


మహాకవుల ఊహలు మహాద్భుతాలు!

-------------------------------------------------------- 

             మ: కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్మాభర్త , మార్తాం డ మం

                     డల భేదం బొనరించి యేఁగు నెడఁ , దన్మధ్యంబునన్ హార కుం

                      డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయణుంగాంచి, లోఁ

                       గలఁగం బారుదు రయ్య! నీవయను శంకన్,కృష్ణరాయాధిపా!


                           చాటువు- తెనాలి రామకృష్ణకవి ;


               భువన విజయంలో రాయలు కవిపండిత గోష్ఠి నిర్వహించు నపుడు, రాయలను కీర్తించుచు అష్టదిగ్గజ కవులు పద్యోపహారములను సమర్పించు సందర్భమున, పెద్దన గారి పద్యమునకు రామకృష్ణుడు సొడ్డులు బెట్టఁగా మనుమడా !

యేదీ నీవొకపద్యం చెప్పు? మనగా తెనాలి విసరిన పద్యమిది!


                 యుధ్ధంలో వీర మరణాన్ని పొందిన యోధులు సూర్యమండలాన్ని దాటుకొని ఆపైనున్న వీర స్వర్గాన్ని చేరుతారని పురాణాలు చెపుతున్నాయి. దాని నాధారంగా చేసికొని తెనాలి మంచి కధనల్లాడు. వినండి!


                   శ్రీ కృష్ణరాయ సార్వభౌమా! యుధ్దంలో నీకత్తి కెరయై మరణించిన యోధులందరూ సూర్య మండలమును ఛేధించి ముందుకు బోవుచుండగా సూర్యమండల మధ్యస్తుడైన కేయూర కిరీటాది భూషణ రాజితో నొప్పారు శ్రీ మన్నారాయణుని జూచి, నీవని

భ్రమపడి , భయముతో పరుగులు పెట్టుచుందురు. అట్టి మహనీయమైన పరాక్రమ శాలివి నీవు. అని మెచ్చుకున్నాడు.


                          శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తియని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి ఆనాయణుడే నీవని భ్రమ

పడినారయ్యా అంటాడు కవి. పైగా కిరీటం, కేయూరాది విభూషణాలు రాజచిహ్నాలాయె!భ్రమ పడరా? శ్రీకృష్ణరాయలు మహాపరాక్రమ

శాలి.కాబట్టి వారు భయపడి పారిపోతున్నారని కవిమాట! 


              తన పరాక్రమానికి శత్రువు భయపడి పరుగెడు తన్నాడంటే రాజుకి సంతోషమేగదా!


          ఈరీతిగా యిందులో భ్ర్రాంతిమదలంకారం వర్ణింపబడింది. ఇదీ సంగతి!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: