శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 29)
(పరశురాముడు - 6)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
----
(7-4-'26 పోష్టు తరువాయి భాగము)
చాలామంది తెలియక,
' పరశురాముని గర్వభంగం ' అంటారు.
శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురామునికి గర్వభంగం ఏమిటి ?
భూభారం అణచటానికి వచ్చిన భగవంతునిగా పురాణాలన్నీ పరశురాముని కీర్తిస్తున్నాయి.
పాలక వర్గమైన క్షత్రియ జాతి అధర్మవర్తనులైనప్పుడు వారిని శిక్షించేందుకు విష్ణువు పరశురాముడి ఉపాధి స్వీకరించాడు.
అయితే ఆ ఉపాధి ఋచీక మహర్షి క్షత్రియ స్వభావంతో కూడినవాని జన్మకొఱకు
నిర్మించిన ' చరువు ' వల్ల ఏర్పడింది.
ఆ ఉపాధి దోషం తొలిగి పరశురాముడు బ్రహ్మజ్ఞాని అవటమే శ్రీరాముడు భార్గవరాముని నుండి వైష్ణవ ధనస్సును స్వీకరించడం అనే ఈ సంఘటన తాత్పర్యం.
శ్రీరాముడు, శీఘ్రమైనపరాక్రమముతో,
పరశురాముని చేతిలోని వైష్ణవ ధనస్సును గ్రహించి, బాణం సంధించాడు.
వెంటనే జగత్తంతా కంపించింది.
శ్రీరాముడు భార్గవరామునితో ఇలా అన్నాడు.
"ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవగుట చేతను,
విశ్వామిత్రునకు బంధువు వగుట చేతను,
నాకు పూజ్యుడవు.
అందువలన, నీ ప్రాణములు హరించేందుకు ఈ శరాన్ని, ప్రయోగింపజాలను.
శ్లో//ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్/
లోకా న ప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి//
(భార్గవరామా! నీ పాదగమన శక్తిని గాని,
తపోబలముతో నీవు సంపాదించుకున్న,సాటిలేని ఉత్తమ లోకములను గాని,
ఈ బాణముతో కొట్టివేసెదను.
నీకు ఏది ఇష్టమో చెప్పుము).
దివ్యమైన ఈ వైష్ణవ శరము వ్యర్ధమగుటకు వీలు లేదు, అన్నాడు.
ఆ విధంగా శ్రీరాముడు వైష్ణవ ధనస్సును స్వీకరించగానే, అవతార ప్రయోజనము పూర్తి అయిన పరశురాముడు నిర్వీర్యుడైనాడు.
శ్లో// జడీకృతే తదా లోకే రామే వర ధనుర్ధరే/
నిర్వీర్యో జామదగ్న్యో౽సౌ రామో రామ ముదీక్షత//
(రాముడు, శ్రేష్ఠమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే, అత్యంత ప్రభావంతో కూడిన ఆ దివ్య వైష్ణవ శరమును చూచి లోకమంతా భయపడి, స్తంభించి పోయింది. పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయినాడు.
ఆయన రామునివంక అత్యాశ్చర్యముతో చూచాడు).
క్షత్రియులపై ద్వేషం వల్ల ఉత్పన్నమైన పరశురాముడి అజ్ఞానం తొలగిపోయింది.
ఆయనలో జ్ఞానం భాసించింది.
ధర్మరక్షణకు అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడని పరశురాముడు అప్పుడు గ్రహించాడు.
రామునకు నమస్కరించాడు.
శ్లో//అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్/
ధనుషో౽స్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప//
(ఈ ధనస్సును గ్రహించుటవల్ల, నీవు అక్షయుడవు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడవు, సర్వదేవతలకు ఈశ్వరుడవు అయిన శ్రీమహావిష్ణువు వని తెలుసుకొన్నాను. ఓ పరంతపా! నీకు స్వస్తియగుగాక.)
త్రిలోకనాధుడవైన నీ చేత నిర్జింపబడటం వల్ల నేను సిగ్గుపడటం లేదు.
అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ భూమిని కశ్యపునకు దానమిచ్చినందున నేను మహేంద్ర పర్వతముపై నివసిస్తున్నాను.
నేను అక్కడకు వెళ్ళాలి. అందువల్ల నా గమన శక్తిని నశింపజేయవలదు.
నీ బాణం ప్రయోగించి నేను తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలు నశింపజేయుము,అన్నాడు.
బ్రహ్మజ్ఞానికి, పుణ్యము, పాపము, రెండూ ఉండకూడదు కాబట్టి, పరశురాముని కోరిక ప్రకారము, రాముడు ఆ పుణ్యలోకాలనన్నింటినీ బాణప్రయోగంతో నశింపజేశాడు.
పరశురాముడు, దశరథ రాముని స్తోత్రం చేసాడు.
ప్రదక్షిణము చేసి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు.
శ్రీమద్భాగవతంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు.
"ఓ మహారాజా!వంశోద్ధారకుడైన పుత్రుడు పరశురాముని వల్ల, జమదగ్ని మహర్షి సంకల్ప శరీరం పొంది,తన తపోబలంతో ఆకాశంలోని సప్తర్షి మండలంలో ఏడవ ఋషిగా వెలుగొందుచున్నాడు.
శ్లో// జామదగ్న్యో౽పి భగవాన్ రామః కమలలోచనః/
ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్//
( ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు,కమలముల వంటి నేత్రములు గల వాడు,జమదగ్ని పుత్రుడు, అయిన పరశురాముడు రాబోయే మన్వంతరంలో సప్తర్షులలో ఒకడై వేదములను ప్రవర్తింపజేస్తాడు)
పరశురాముడు చిరంజీవి.
ఈనాటికీ, ప్రసన్నమైన అంతఃకరణముతో భక్తులను అనుగ్రహిస్తూ మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.
దేవతలు, సిద్ధులు, గంధర్వులు,చారణులు, ఆయన చరితమును కీర్తిస్తూ ఉంటారు.
పోతన మహాకవి ఇలా అంటున్నారు.
క// ఆ జమదగ్ని తనూజుడు,రాజీవాక్షుండు, ఘనుడు,రాముడధికుడై/
యోజను వేదర్షులలో,రాజిల్లెడు మీది మనువు రా నవ్వేళన్//
(వచ్చే మన్వంతరంలో ఆ జమదగ్ని తనూజుడు,కమల నేత్రుడు అయిన పరశురాముడు, సప్తర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు).
ఆ// శాంత చిత్తుడగుచు, సంగ విముక్తుడై,భవ్యుడై, మహేంద్ర పర్వతమున/
నున్నవాడు రాముడోజతో గంధర్వ, సిద్ధవరులు, నుతులు సేయుచుండ//
(గంధర్వులు, సిద్ధులు,తన పవిత్ర చరితమును గానం చేస్తుండగా,ఆ పరశురాముడు ఐహిక బంధములన్నింటి నుండీ విముక్తుడై, ప్రశాంత చిత్తంతో, తేజోవంతుడై, ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు).
🙏 శ్రీ పరశురామాయ నమః🙏
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/
న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/
గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/
లోకా: సమస్తాః సుఖినో భవంతు//
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
8-4-'26.