1, అక్టోబర్ 2020, గురువారం

ఆదిపర్వము- 36

 

హిడింబ, భీముని వివాహం


అక్కడ పాండవులు వారణావతానికి దక్షిణంగా నడవసాగారు.అందరూ అలిసిపోగా, భీనుడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరిని విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్లి నీరు తీసుకొని వచ్చాడు. అందరూ అలిసిపోవటం చేత, ఆ చెట్టుకింద విశ్రమించారు.చీకటి పడింది, భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. జరిగిందంతా ఒకసారి తల్చుకుంటున్నాడు.


పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నర వాసన వాడి ముక్కు పుటాలకు సోకింది. చెల్లెలు హిడింబను పిలిచాడు.

“హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవి చెడి ఉన్నది. ఆ నరులను చంపి, నాకు వండి పెట్టు” అని చెప్పాడు.


హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకొని ఉన్న పాండవులను, కాపలాగా ఉన్న భీముని చెట్టు చాటున నిలబడి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే, మానవకాంత రూపం ధరించి, అన్న చెప్పిన మాటలు మరిచిపోయింది.

తన దగ్గరకు వస్తున్న హిడింబను చూసాడు భీముడు. “నువ్వు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.


“మహాభాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలిని, నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవు అయితే నా అన్న నీకు హాని చెయ్యడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరినీ లెక్కపెట్టడు. ఇది నా అన్న హిడింబాసురిడి వనము. అతను చూసిన మిమ్ములను బతుకనీయడు. నాతో రమ్ము,నిన్ను కోరిన చోటికి తీసుకొని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము” అని బలవంతం చేసింది హిడింబ.

దానికి భీముడు “ వీరు నా తల్లి,తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్ళను ఎలా వదలమంటావు?” అన్నాడు.


“ఐతే వీరలను నిద్రలేపు, అందరం వెళ్లిపోదాము” అంది హిడింబ.

“అదేమిటి అలా అంటావు. ఎవరో రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న తల్లిని, సోదరులను నిద్ర చెడగొట్టమంటావా?” అన్నాడు భీముడు.

వెళ్లిన చెల్లెలు ఎంతకూ రాకపోతే, హిడింబాసురుడే అక్కడకు వచ్చాడు.అతనిని చూసి హిడింబ, భీముని చాటుకు వెళ్లి దాక్కుంది.


“రాక్షసా, నిన్ను వధించి, ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను” అని హిడింబాసురుడి మీదికి ఉరికాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు, కుంతీ,మిగిలిన పాండవులు నిద్రలేచారు. హిడింబను చూసారు.

“అమ్మా! నువ్వు ఎవరు?” అని అడిగింది కుంతి.


“అమ్మా! నేను ఇదుగో ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెలును. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వారించాను. నా అన్నయ్య, మీ కుమారుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పింది. ఇంతలో అర్జనుడు యుద్ద్డం జరిగే చోటికి వెళ్ళాడు.


“భీమా,తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల వేళ. వెంటనే ఈ రాక్షసుడిని చంపు” అని అరిచాడు.

ఆ మాటలు విని భీముడు విజృంభించి హిడింబుని ఎత్తుకొని గిర గిరా తిప్పి నేలమీద పడేసాడు. హిడుంబుడు నడుము విరిగి నేలమీద పడ్డాడు, ప్రాణాలు విడిచాడు.


హిడింబకు ఆశ్చర్యం వేసింది. భీముడు హిడింబను చూసి “నువ్వు రాక్షస కాంతావు, మేము నిన్ను నమ్మము నువ్వు మా వెంట రావద్దు” అని అన్నాడు.

అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి “అమ్మా, సర్వ ప్రాణులకు కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కాని స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముని మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరిని వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే నేనే ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగింది, జరుగుతుంది,జరగపోఎది తెలుసు.


మీకు జరగపోయే దానిని చెపుతాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడు అనే మహాముని ఆశ్రమము ఉండి. అక్కడ ఉన్న కొలనులో నీరు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. మీకు కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు” అని చెప్పింది.

ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది. భీముని చూసి “భీమా, నా మాట, నీ అన్నగారైన ధర్మజుని మాటగా వినుము. హిడింబ ఉత్తమకాంత, ఈమెను పెళ్లి చేసుకో, నీకు మంచి జరుగుతుంది” అని చెప్పింది.

భీముడు తల్లి మాట ప్రకారం హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్లారు.


ఒకరోజు వేదవ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. “అమ్మా కుంతీ, ధర్మనందనా కష్టాలు కలకాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి, రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత ఇక్కడు దగ్గరలో ఉన్న ఏకచక్ర పురానికి వెళ్ళండి. తరువాత నేను వచ్చి చెయ్యవలసింది చెపుతాను” అని చెప్పాడు.


వేదవ్యాసుని మాట ప్రకారం పాండవులు శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది, ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతను అపరిమితమైన బలం కలవాడు. ఘటోత్కచుడు తండ్రులకు, కుంతీదేవికి నమస్కరించాడు. “అమ్మా నేను ఇక్కడే నా అ తల్లితోపాటు ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను” అని చెప్పాడు. తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు లేవు: