1, అక్టోబర్ 2020, గురువారం

మహాభారతము

 **దశిక రాము**


**** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


99 - అరణ్యపర్వం.


దుర్వాసమహర్షికీ, ఆయన అనుచరులకు భోజనమెలా సమకూర్చాలో తెలియక తికమక పడుతున్న సమయంలో ద్రౌపదికి, ఆపద్బాంధవుడు, అనాధరక్షకుడు, యెంతటి వారికైనా కష్టాలలో వున్నప్పుడు చటుక్కున గుర్తుకు వచ్చేవాడు, ఆ శ్రీకృష్ణుడు మనస్సులో మెదిలాడు. వెనువెంటనే, రెండు చేతులూ జోడించి తన మూర్ధభాగాన వుంచుకుని, సంపూర్ణ శరణాగతితో, ' శ్రీ కృష్ణా ! గోవిందా ! వాసుదేవా ! జగన్నాధ ! భక్తుల కష్టాలు తీర్చేవాడా ! విశ్వాత్మా ! విశ్వపితా ! విశ్వహరా ! కౌరవసభలో దుశ్శాసనుని బారినుండి నన్నుకాపాడిన దేవా ! ఈ సంకట స్థితిలో కూడా అదేవిధంగా రక్షించు తండ్రీ ! ' అని శ్రీకృష్ణుని ఆర్తితో రెండుకనులూ మూసుకుని పిలిచింది. 


ఆర్తత్రాణ పరాయణుడు భక్తజన వల్లభుడు, ఆమె ప్రార్ధించి కనులు తెరచినంతనే, కనుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది ఆయనకు మరియొకసారి ప్రత్యక్ష వందనమాచరించి, తమ పరిస్థితి వివరించింది. ఈ పరిస్థితినుంచి గట్టెక్కించమని అడిగింది.


ఆమె మాటలు విననట్లుగా శ్రీకృష్ణుడు, ' అదేమో తరువాత చెబుదువుగాని, సోదరీ ! నాకు ప్రస్తుతం బాగా ఆకలిగా వున్నది. ముందు భోజనం వడ్డించు ' అని గారాబంగా అడిగాడు.


కృష్ణుడు యీవిధంగా భోజనం అడిగేటప్పటికి, హతాశురాలైంది ద్రౌపది. ఏ సమాధానం చెప్పాలో తెలియక, కడిగిన అక్షయపాత్ర చూపించింది. గుడ్లనీరు కుక్కుకుంది. ఆమె యేమనుకుంటున్నదీ పట్టించుకోనట్లు, ' ఏదీ ఆపాత్ర యిటుయివ్వు ద్రౌపదీ ! అందులో లేశమంతైనా ఆహారపదార్ధం వుండి వుండకపోదు. నీలాంటివారు యేది సమర్పించినా అది నాకు మృష్టాన్నభోజనమని నీకు తెలియదా ! పత్రం, పుష్పం, ఫలం, తోయం, అన్నట్లుగా యేదైనా ఫరవాలేదు, అంటూ చనువుగా ఆ పాత్ర ఆమెవద్దనుండి లాగి తీసుకుని, ఆహా ! లేశమంత ఆహరం మిగిలివుంది కదా పాత్రలో యిదిచాలమ్మా ద్రౌపదీ ! యీచిన్నిబొజ్జకు. ' అంటూ కొద్దిమెతుకులు తనకుతానే సృష్టించుకుని తిని

' అన్నదాతా సుఖీభవ ' అంటూ, యీ శేషభోజనంతో విశ్వాత్ముడు, యజ్ఞభోక్త అయిన ఆ పరమాత్మ తృప్తిచెందుగాక ! ' అని బొజ్జ నిమురుకున్నాడు శ్రీహరి.


ఇక్కడ యీవిధంగా శ్రీకృష్ణుడు సంతృప్తి చెందగానే, అక్కడ గంగాతీరంలో, దుర్వాస మహామునీ , ఆయన శిష్యగణం స్నానం చేసి బయటకు వస్తుండేసరికి, వారి కడుపులు భుక్తాయాసంతో యెగిరి యెగిరి పడుతున్నాయి. శిష్యులు దుర్వాసమహామునిని సమీపించి, ' గురుదేవా ! మా కడుపులు నిండుగా వున్నాయి, ఒక్కచుక్క గంగాతీర్ధానికి కూడా మా ఉదరములలో యిసుమంత చోటులేదు. మమ్ములను మన్నించండి. మేము ధర్మరాజు పెట్టేభోజనం గ్రహించలేము. ' అన్నారు. దానికి దుర్వాసుడు కూడా

' నా పరిస్థితీ అలాగే వున్నది. భోజనానికి వెళ్లకపొతే, ధర్మాత్ముడు ధర్మరాజు కోపగిస్తాడేమో ! ఒకప్పుడు అంబరీషుని బాధపెట్టి, నేను పడినకష్టాలు అన్నీయిన్నీ కావు. వారికికనబడి, వారి కోపానికి పాత్రులం కాకుండా యిటునించి ఇటే పలాయనం చిత్తగిస్తే బాగుంటుందని ' , శిష్యులతో కూడి, వెళ్ళిపోయాడు.


ధర్మరాజు వారికోసం యెంతోసేపు యెదురుచూసి రాకపోయేసరికి, దుర్వాసుడు తమమీద అలకపూనాడేమో అని అనుకుంటుండగా, శ్రీకృష్ణుడు హస్తినలో దుర్యోధనుడు వేసిన పథకమూ, దుర్వాసుని పావుగా వాడుకుందామనుకున్న వైనమూ, సవివరంగా చెప్పి, స్వాంతన పరచాడు. మరియొక సరి, శ్రీకృష్ణుడు తమను ఆదుకున్న విషయం గ్రహించి, పరిపరి విధాలా ఆయనను పాండవులు శ్లాఘించారు. శ్రీకృష్ణుడు వారిని దీవించి, ద్వారకకు పయనమయ్యాడు.


రోజులు గడుస్తున్నాయి. యే విపత్తు ఎటునుండి వస్తుందో తెలియకుండా పాండవులు రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకరోజు, భర్తలందరూ, అరణ్యాలలోనికి వెళ్లగా, ద్రౌపది ఒక్కతే, ఆశ్రమంలో, తోటపని చూసుకుంటూ వున్నది. అంతలో, ఆవైపు నుండి, సింధుదేశా ధీశుడైన జయద్రధుడు ( సై0ధవుడు ) సాళ్వదేశం వైపు తన పరివారంతో వెళుతూ, ద్రౌపదిని చూశాడు. మత్స్యయంత్రభేదనంలో జయద్రధుడు కూడా ఒకప్పుడు భంగపడినవాడే. ఈ జయద్రధుడు యెవరోకాదు. దుర్యోధనుని సోదరి దుస్సల భర్త. ఆ విధంగా ద్రౌపదికి అన్నవరుస అవుతాడు.  


జయద్రధుడు ద్రౌపదిని చూసి, ఆమె అందానికి పరవశించిపోయారు. ఒక చెట్టు క్రింద నిలబడి వున్న ద్రౌపది అగ్నిశిఖలాగా కనబడుతున్నది. ఆడపులిలాగా వున్నది. ఆమె దగ్గరకు నక్కలాగా అడుగులు వేస్తూ వస్తున్నాడు కామంతో మైమరచి జయద్రధుడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఓహో ! అన్నవరుసవాడు కదా అని స్థిమితపడి, ' నా భర్తలు బయటకు వెళ్లారు. విశ్రమించండి. వారు రాగానే, భోజన ఏర్పాట్లు చేస్తాను.'అని యెంతో గౌరవంగా చెప్పింది ద్రౌపది.  


'ద్రౌపదీ ! నీఅందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నది. నీభర్తల రాకతో మనకేమిపని ? నన్ను అనుగ్రహించు. నిన్ను నారాజ్యపట్టపురాణిని చేస్తాను. అడవులలో యీ కందమూలాలతో జీవించవలసిన శరీరమా నీది. నే భర్తలు రాజ్య భ్రష్టులు. ' అని యింకా యేమేమో అని తన వాచాలత్వం ప్రదర్శిస్తూ మీదమీదకు రాసాగాడు.  


ద్రౌపదికి పరిస్థితి అర్ధమైంది. తనకి యింకొక సంకటం దాపురించిందని వగచింది. అయినా ధైర్యంగా ' జయద్రధా ! నేను నీకు సోదరి సమానురాలను. నన్ను ఆపదలోవుంటే కాపాడవలసిన నీవే కామిస్తావా ? తప్పు. కోరి అగ్నిని ముట్టుకోకు. శలభంలా మాడిపోతావు. ' అని హెచ్చరించింది.     


అయినా సరే. వినాశకాలే విపరీత బుధ్హి: జయద్రధుడు బలవంతంగా, ఆమెను రధం పైకి యెక్కించుకుని తీసుకుపోసాగాడు. పాండవులు తిరిగివచ్చి చూడగా, ఆశ్రమమంతా చిన్నాభిన్నంగా వున్నది. పరిస్థితి ధౌమ్యులవారి ద్వారా తెలుసుకుని, సై౦ధవుడు వెళ్లిన మార్గం వెతుక్కుంటూ అందరూ బయలుదేరారు. శరవేగంతో పాండవులు

సై ౦ధవుని రధాన్ని కలుసుకున్నారు. అందులో ద్రౌపది భయవిహ్వల అయి వుండడం చూసి, కోపోద్రిక్తులయ్యారు.  


భీమసేనుడు వెంటనే, సై ౦ధవుని, చుట్టూ వున్న భటులనూ, ఏనుగులను తన గదతో పడగొట్టి, సరాసరి సై౦ధవుని రధంవద్దకు వెళ్లి, జుట్టు పట్టుకుని క్రిందకు లాగాడు. అంత వేగంతో వెళుతున్న రధం నుండి లాగగానే సై౦ధవుడు ఆర్తనాదం చేసాడు. శరీరమంతా రక్తమోడింది. భీమసేనుడు సై౦ధవుని చంపబోతుంటే, ధర్మజుడు అడ్డుపడ్డాడు. ' మనం వీనిని చంపితే, మన సోదరి దుస్సల విధవ అవుతుంది. ఆపాపం మనము చేయతగదు. పరాభవించి వదిలివేద్దాము. ' అన్నాడు  


భీమసేనుడు మారుమాట్లాడలేక, తన చేతిలోవున్న వాడిఅయిన బాణంతో సై౦ధవుని తలమీదవున్న కేశాలను కోసివేశాడు. శిరోముండనం అయి, అవమానభారంతో వున్న సై౦ధవుని, ధర్మజుని ముందు నిలబెట్టాడు, భీమసేనుడు. ధర్మరాజుకి, ధౌమ్యునికీ నమస్కరించి, సిగ్గుపడుతూ అక్కడనుండి వెళ్ళిపోయాడు. చేసినపనికి, జరిగిన అవమానానికి పశ్చాత్తాపబడకుండా, సై౦ధవుడు, పాండవులపై ద్వేషం పెంచుకుని, సరాసరి హరిద్వారం వెళ్లి అక్కడ పరమేశ్వరుని గురించి కఠోరతపస్సు చేసి, పాండవులను జయించే వరంకోరాడు. శివుడు చిరునవ్వు నవ్వి, ' అర్జునుడు అంటే యెవరనుకున్నావు ? సాక్షాత్తు నరనారాయణులలో నరుడు. నేను నీవు కోరిన వరం యివ్వలేను. అయితే, ఒక్క అర్జునుని తప్ప, మిగిలిన నలుగురు పాండవులను, ఒక్కరోజు, నీవు నిలువరించగలిగే శక్తి మాత్రం ప్రసాదించగలను. ' అని చెప్పి అదే విధంగా వరమిచ్చాడు.  


ఈ వరం ముందుముందు యే ఉపద్రవాన్ని తెస్తుందో, యెవరిని బలి తీసుకుంటుందో !


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.....

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: