1, అక్టోబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో ...69

 

ప‌రీక్షిత్తు భ‌విష్య‌త్తు గురించి భూసురోత్త‌ములు ధ‌ర్మ‌రాజుకు చెబుతున్నారు....


హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్,

భరించున్ ధరన్ రామభద్రుండుఁ బోలెన్,

జరించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్,

వరించున్ విశేషించి వైకుంఠుభక్తిన్.

       **

ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు.


ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి, మునికుమారునివల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్నిజ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై, గోవింద చరణారవింద భజనానురాగియై, శుకయోగీంద్రులవల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీతీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్య లోకానికి చేరుకుంటాడు-అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి, ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని, భూసురోత్తములు సంతుష్టచిత్తులై వెళ్లిపోయారు.

    **

తన తల్లి కడుపులోపల

మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం

డనుచుఁ బరీక్షింపఁగ జను

లనఘుఁ బరీక్షన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా!

  **


శౌనక మునీంద్రా తన కన్నతల్లిగర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో నని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలుస్తారు. అలాప‌రీక్షిత్తు పెరిగి పెద్ద‌వాడ‌య్యాడు.

          ***

ఆ త‌ర్వాత ధ‌ర్మ‌రాజు, బంధువుల‌ను చంపిన పాప నివృత్తి కోసం మూడు అశ్వ‌మేథ యాగాలు చేశాడు.  

కొంత‌కాలం త‌ర్వాత విదురుడు తీర్థ‌యాత్ర‌లు ముగించుకుని హ‌స్తినాపురం చేరుకున్నాడు. ధర్మ‌రాజుకు త‌న ‌యాత్రా విశేషాలు వివ‌రించాడు. విదురుడు ధ్రుత‌రాష్ట్రుడి వ‌ద్ద‌కు వెళ్లి విరక్తి మార్గం బోధించాడు. వెంట‌నే ధృత‌రాష్ట్రుడు గాంధారీ నివెంట‌బెట్టుకుని ఎవ‌రికీ చెప్ప‌కుండా హిమాల‌యాల‌కు వెళ్ళిపోయాడు. విదురుడుకూడా చెప్ప‌కుండానే వెళ్ళిపోయాడు.

 విదురుడు,ధృత‌రాష్ఠ్రుడు,గాంధారీ క‌న‌ప‌డ‌క ధ‌ర్మ‌రాజు త‌ల్ల‌డిల్లాడు.

 ఆ ప‌క్క‌నే ఉన్న సంజ‌యుడు. ఇలా అంటున్నాడు....

             ***

"అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు

నడుగఁ డీ రేయి మీ తండ్రి యవనినాథ!

మందిరములోన విదురుతో మంతనంబు

నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు.

             ***

ధర్మరాజా! నీపెద తండ్రిగారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు. ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటివరకూ రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కన్పించకుండా వెళ్ళిపోయాడు. 

ఈ లోప‌ల నార‌ద మ‌హ‌ర్షి అక్క‌డక వ‌చ్చాడు.

నార‌ద మ‌హ‌ర్షిని ధ‌ర్మ‌రాజు , విదుర‌, ధృత‌రాష్ట్రుల జాడ గురించి అడుగుతున్నాడు..

                      **

"అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ

డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ

బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్

నిక్కము కర్ణధారుఁడవు నీవు జగజ్జనపారదర్శనా!"


          నార‌ద ‌మ‌హ‌ర్షీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియనిది ఏమీలేదు. ఆపదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా! ఏమని చెప్పమంటావు. తెల్లవారి చూసే సరికి మాతల్లిదండ్రులు ఇంటిలో లేరు. వారు ఇల్లు వదలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తనబిడ్డలను పేరు పేరునా తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమయిపోయిందో....

              **

ఆ పలుకుల విని నారదుడు ఇలా అన్నాడు.

”ధర్మరాజా! ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలూ, బంతులూ మొదలైన ఆటవస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు, భగవంతుని ఇచ్ఛానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తుంటాయి. అందువల్ల మహారాజా! నా తల్లిదండ్రులు దీనులే! దిక్కు లేనివారే! నన్ను వదలి ఏమైపోతారో? ఏలా జీవిస్తారో? అనే విచారం మాను, అజ్ఞానమూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు. అని నార‌దుడు ధ‌ర్మ‌రాజుకు హిత‌బోధ చేశాడు.

                  ***

అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ

డసురనాశమునకు నవతరించి

దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కిన పని

కెదురుసూచుచుండు నిప్పు డధిప!

             ***

కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటంకోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పనికోసం నిరీక్షిస్తున్నాడు.

             ***


ఎంత కాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు మీ

రంత కాలము నుండుఁ డందఱుఁ నవ్వలం బనిలేదు, వి

భ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ

చింత యేల నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్.

          ***

(నారదుడు ధృతరాష్ట్రాదుల గురించి కలత చెందిన ధర్మరాజుకి కాలసూచన చేస్తున్నాడు.)


“మహారాజా!

 కలవరపాటు వదలిపెట్టు.

 శ్రీకృష్ణ భగవానుడు ఎంత వరకు ఈ భూమ్మీద ఉంటాడో, అప్పటి దాకా మీ పాండవులు అందరు కూడ ఉండండి. ఆయన అవతారం చాలించిన పిమ్మట మీరు ఉండనక్కర్లేదు; ఎంతటి వారైనా సరే కాల ప్రభావానికి తలవంచాల్సిందే. ధృతరాష్ట్రాదులకు ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తా. విను; ఇంకా దుఃఖించటం అనవసరం. అన్నాడు.

విదురుడు, దృత‌రాష్ట్రుల గురించి తెలిపి నార‌దుడు స్వ‌ర్గానికి ప‌య‌న‌మ‌య్యాడు.


🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️క‌లిక‌ల్మ‌ష హ‌ర‌ణం🏵️

కామెంట్‌లు లేవు: