1, అక్టోబర్ 2020, గురువారం

*ఆచార్య సద్భోదన*



ఆధ్యాత్మిక జీవనం కోసం మన సర్వస్వం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. ఎటువంటి  కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఉద్యుక్తులమై ఉండాలి. ఆ పరమగమ్యం కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉండాలి. మన మనస్సు అత్యున్నతమైన, శాశ్వతమైన ఆదర్శాల పట్ల ఆకర్షణ  కలిగి ఉండటం ఒక సుకృతంగా భావించాలి. మనం స్థిరంగా, క్రమక్రమంగా ఉన్నత పథంలోకి పయనిస్తూ, గమ్యం చేరే వరకూ పట్టు సడలించకూడదు. ఒక్కొక్కసారి మనం నీరసపడి పట్టు సడలించే ప్రమాదం ఉంది. 


కాబట్టి మనం ఆధ్యాత్మిక తీవ్రతను ఏ మాత్రం తగ్గించకుండా కొనసాగించాలి. చాలామంది కొంతకాలం శ్రమించిన తర్వాత ఆసక్తి కోల్పోతారు. పట్టువదలకుండా ఆధ్యాత్మిక సాధనలు, గ్రంథపఠనం, ఆత్మ విశ్లేషణ చేయగలిగేంత స్థాయిలో వారి మనస్సులు ఉండవు. వారి మనస్సులకు బాహ్యదృష్టి, చంచలత్వం ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. *అకుంఠిత దీక్ష* అనేది ఆధ్యాత్మిక జీవనానికి అత్యవసరం. పట్టు సడలించకుండా, నీరసపడకుండా, అధైర్యం, అయిష్టత దరిచేరనీయక శ్రమిస్తేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమౌతుంది.  


మన జన్మ అంతా నిద్ర, మరపు, అశ్రద్ధల మయంగా ఉంటుంది. ఈ ప్రపంచం దుర్భరం, ధన సంపాదనలోనూ, ఖర్చులోనూ మునిగిపోయి మన శక్తినంతా వృథా చేసుకుంటున్నాం. కాబట్టి మనం వీటిలో కాలం గడపకూడదు.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: