6, మార్చి 2025, గురువారం

14-13-గీతా మకరందము

 14-13-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక తమోగుణాభివృద్ధియందు జీవుడెట్లుండునో వచించుచున్నారు -


అప్రకాశోఽప్రవృత్తిశ్చ 

ప్రమాదో మోహ ఏవ చ | 

తమస్యేతాని జాయన్తే  

వివృద్ధే  కురునన్దన || 


తాత్పర్యము:- కురువంశీయుడవగు ఓ అర్జునా! తమోగుణము అభివృద్ధినొందినదగుచుండగా మనుజునియందు అవివేకము (బుద్ధిమాంద్యము), సోమరితనము, అజాగ్రత, అజ్ఞానము  (మూఢత్వము, లేక విపరీతజ్ఞానము) అనునవి కలుగుచున్నవి.


వ్యాఖ్య:- తమోగుణ మభివృద్ధినొందినపుడు జీవునియందు మత్తు, సోమరితనము, అజాగ్రత, బుద్ధిమాంద్యము మున్నగు లక్షణములు గోచరించుచుండును. ఆతని ఆహారపానీయములందును, మాటలందును ఈ తమోగుణమే వ్యక్తమగుచుండును. వగరు మామిడికాయకు ఈ తమోగుణస్థితిని పోల్చవచ్చును. మఱియు కుంభకర్ణుని ఈ గుణమునకు దృష్టాంతముగ చెప్పవచ్చును. ప్రతివారును తమ తమ హృదయములను పరిశోధించుకొని తమయం దేగుణము యొక్క లక్షణములున్నవో పరీక్షించుకొని సాధనాతిశయముచే క్రమముగ ఊర్ధ్వస్థితిని బడయుటకై యత్నించవలెను. చెట్టుమొదలుకు నీటినిబోయుచున్నచో, పిందెయొక్క వగరుదనము నెమ్మదిగా పులుపుదనముగా మారి, ఆ పులుపుదనము తీపిదనముగా పరిణమించి, ఫలము పక్వమై, తుట్టతుదకు రాలిపోవును, అదియే జీవన్ముక్తదశ.  అత్తఱి  జీవునకు సంసారబంధమునుండి విముక్తి సంభవించును. అయితే ఫలముయొక్క పరిపక్వస్థితి, రాలునట్టిస్థితి చెట్టు యొక్క మొదలుకు నీరు పోయుటవలననే సిద్ధించునట్లు  భగవద్ధ్యానము, నిరంతర పరమార్థసాధన - వీని మూలకముగనే జీవుడు క్రమపరిణామమొంది రజస్తమములనుండి సత్త్వమునందుకొని, అటనుండి గుణాతీతపదవిని చేరుకొనును. 


ప్రశ్న:- తమోగుణ మభివృద్ధి నొందియున్నపుడు జీవుడెట్లుండును?

ఉత్తరము:- (1) అవివేకము (2) సోమరితనము (3) అజాగ్రత (4) అజ్ఞానము - మున్నగు లక్షణము లత్తఱి  యాతనియందు గోచరించును. ఈ గుఱుతులున్నచో వెంటనే ఆతనియందు తమోగుణ మధికముగ నున్నదని తెలిసికొనవచ్చును.

కామెంట్‌లు లేవు: