6, మార్చి 2025, గురువారం

విరించి పరిహాసం-

 శు భో ద యం 🙏


విరించి పరిహాసం-వాణిదరహాసం!!

సరస్వతీ వైభవం:


"నెమలికి నాట దిద్దు నగ, నెయ్యపుఁజిల్కకు గానమాధురిన్

దమియిడు నేర్పు నీకు విదితంబగు, నింక విరాళి చాలి గా

త్రమున రహింపజాలుటగదా యరు" దంచు విరించి మెచ్చ హా

సము నునువాతెఱం జొనుపు శారద పొల్చుఁ గృతీంద్రు సూక్తులన్.


  (చంపూ రామాయణము - వెంకటాచలపతికవి)


(ఆట = నాట్యము, నెయ్యపుఁజిల్క = గారాల చిలుక, గానమాధురి = గానమాధుర్యము, తమియిడు నేర్పు = అభ్యసింపజేసే నైపుణ్యము, విదితంబు = తెలుసు, విరాళి = విరహము, గాత్రము రహింపజాలుట = కంఠముతో రాగాలాపన చేయుట, విరించి = బ్రహ్మ, హాసము = చిరునవ్వు, నునువాతెఱం జొనుపు = మృదువైన పెదవిపై చిందించుట, పొల్చు = ప్రకాశించు, కృతీంద్రుడు = కవీంద్రుడు)


భావము: "మయూరమునకు నాట్యం నేర్పడం, నీ చేతిలోని పెంపుడుచిలుకకు గానమును అభ్యసింపచేయడం నీకు కరతలామలకములైన విద్యలేనని నాకు తెలుసు. నీకు ఆ పనులతోనే సరిపోతున్నది. నీ పతిదేవుడనైన నా యొక్క విరహమును ఉపశమింపచేసేలా నీ మధురగాత్రముతో రాగాలాపన చేయుటయే చాలా అరుదైపోయినది కదా!" అంటున్న బ్రహ్మదేవుణ్ణి చూసి, తన మృదువైన అధరముపై చిరునవ్వు చిందించే వాణీమాత కవీంద్రుని వాక్కులలో విరాజమానం అవుతూవుంటుంది,🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: