6, మార్చి 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*308 వ రోజు*


*కౌరవ శిబిరంలో కలవరం*


ఆ రాత్రి సమయంలో పాండవ శిబిరంలో పాంచజన్య, దేవదత్త ఘోషలు విని కౌరవసేనలలో కలవరం రేగింది. వెంటనే వారు చారులను పిలిచి అడుగగా వారు జరిగినది అంతా సవిస్తరంగా చెప్పారు. అది విన్న సైంధవుని శరీరం కంపించింది. అక్కడ నిలువ లేక సిగ్గు విడిచి నీ కుమారుని శిబిరానికి పరుగు తీసి " సుయోధనా ! నేను ఒక్కడినే అపకారం చేసినట్లు అర్జునుడు నాపై పగబూని నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసాడట. మీరంతా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం ఎందుకు దుఃఖపడాలి ? అర్జునుడి ప్రతిజ్ఞకు దేవాసురులు, సిద్ధసాధ్యులుగాని అడ్డుపడగలరా ! సుయోధనా ! ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు నీవు తలచిన యమపురి పోయిన వాడిని తీసుకురాగలరు. కానీ మీరు కాపాడవలెనని అనుకున్నట్లు లేరు కనుక నాకిక దేవుడే దిక్కు " అన్నాడు. అతడి పెదవులు ఎండి పోతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి నిలబడ లేక పోతున్నాడు. " సుయోధనా ! ముందు నేను అర్జునుడి కంట పడకుండా దాక్కుంటాను. మీకిక శలవు బ్రతికుంటే రేపు కలుస్తాను " అని వెళ్ళబోయాడు.


*సైంధవుడికి ధైర్యం చెప్పుట*


సుయోధనుడు " సైంధవా ! ఏమిటీ వెర్రి ! ఇప్పుడే కదా ! మా పరాక్రమము పొగిడావు. ద్రోణుని శౌర్యము, సోమదత్తుని ధైర్యము, శకుని వీరము, శల్యుని బలము నీకు తెలియనిదా ! మేము నిన్ను విడిచి పెడతామా భయపడకుము నిన్ను వెన్నంటి ఉంటాము " అని ధైర్యము చెప్పాడు. వెంటనే సుయోధనుడు సైంధవుని వెంటబెట్టుకుని ద్రోణుని వద్దకు వెళ్ళాడు. సైంధవుడు ద్రోణునితో అర్జునుడికి తనకు ధనుర్విద్యలో కల తారతమ్యాలు అడిగాడు. ద్రోణుడు " సైంధవా ! మీరందరూ నా దగ్గర విలు విద్య అభసించారు. నేను మీకందరికి ఒకే విధంగా నేర్పాను కాని అర్జునుడు కఠోర శ్రమకు ఓర్చి ఎన్నో ప్రయోగములు చేసి విలువిద్యలో మెళుకువలు తెలుసుకున్నాడు. కనుక మీ కంటే అర్జునుడు అధికుడు కాని నీవు అర్జునుడికి భయపడ పని లేదు నా రక్షణలో ఉండగా నిన్ను దేవతలు కూడా తేరిపార చూడ లేరు. అర్జునుడు కూడా భేదింప లేని వ్యూహము రేపు పన్నుతాను. నీవు క్షత్రియ ధర్మము ప్రకారం యుద్ధం చెయ్యి. వేదవేదాంగాలు అభ్యసించి, యజ్ఞయాగాదులు చేసిన నీవిలా మృత్యువుకు భయపడ తగునా ! యాదవులు, పాండవులు, కౌరవులు మొదలైన ఎవరైనా ఈ భూమిపై శాశ్వతులా కాలం తీరగానే అందరూ పోవలసిన వారే కదా ! మహా మునులు యజ్ఞము చేసి పొందు ఫలం వీరులు యుద్ధభూమిలో మరణించిన పొందవచ్చు. కనుక నిశ్చింతగా ఉండు " అన్నాడు. ఆ మాటలకు ఊరట చెందిన సైంధవుడు సుయోధనునితో కలిసి తమ శిబిరానికి వెళ్ళాడు. ఇరుపక్షముల సైన్యాలు జరిగిన విషాదం తలపక రేపటి యుద్ధము గురించి ఆలోచించ సాగారు. సుయోధనుడు మరునాటి యుద్ధానికి సమాలోచనలు జరుపుతున్నాడు. ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య, పాండ్య, యాదవ రాజులను మరునాటి యుద్ధానికి సమాయత్త పరుస్తున్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: