☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(68వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*యయాతి చరిత్ర*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*‘‘అగ్రకులజులట! అగ్రకులజులు. ఏమిటే మీ కులం? మా ఇళ్లల్లో పౌరోహిత్యం చేసుకుని బతికే మీ సంగతి ఎవరికి తెలియదే? లేచింది మొదలు మీరంతా మా ఇంటి ముందు కుక్కల్లా పడి ఉంటారు. చాల్లే నీ గొప్పలు.’’ అంది ఆమె.*
*అలా మాటా మాటా పెరిగి, ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి చేరుకున్నారు.*
*ఆ స్థితిలో దేవయానిని ఓ పాడుబడ్డ బావిలోనికి తోసి వేసి, చెలికత్తెల సహా వెను తిరిగింది శర్మిష్ఠ. అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. నూతిలో ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది దేవయాని*.
*ఆ సమయంలో యయాతి మహారాజు వేటకై అటుగా వచ్చి, దేవయాని ఆర్తనాదాలు విన్నాడు. నూతి దగ్గరగా వచ్చాడు. తొంగి చూశాడు. వివస్త్రగా అతనికి దేవయాని కనిపించింది.దయతో తన ఉత్తరీయాన్ని దేవయానికి అందించాడతను. చేయి అందించి, ఆమెను నూతిలోంచి బయటికి తీశాడు. తన మానాన్ని కాపాడి, ప్రాణాలు కాపాడిన యయాతిని దేవయాని మోహించింది. అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశించింది. జరిగిన కథంతా యయాతికి చెప్పింది.*
*‘‘మహారాజా! మీరు నా పాణిని గ్రహించారు. పాణిగ్రహణం జరిగింది. మీరే నా భర్త.’’ అన్నది దేవయాని. ఆలోచనలో పడ్డాడు యయాతి. తను క్షత్రియుడు. దేవయాని బ్రాహ్మణకన్య. పైగా శుక్రాచార్యుని కూతురు. ఆ వివాహం యుక్తం కాదనుకున్నాడు యయాతి. పాపహేతువన్నాడు. ఆ మాటే చెప్పాడు దేవయానికి. అయినా యయాతే తన భర్తని పట్టుబట్టింది దేవయాని. దోషం లేదన్నది. తండ్రి శుక్రాచార్యుని అనుమతి తీసుకున్న అనంతరమే తనని వివాహం చేసుకోమన్నది. పూర్వం కచుడు తనకు ఇచ్చిన శాపకారణంగా కూడా ఈ వివాహం జరగాల్సి ఉందన్నదామె.*
*ఇక్కడ కచుడు-దేవయానుల కథ కొంత మేరకు తెలుసుకోవాలి.*
*దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు. మృతసంజీవనీ విద్య నేర్చుకునేందుకై అతను శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాడు. శుక్రునికి శుశ్రూషలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించాడు. మృతసంజీవనీ విద్య నేర్చుకున్నాడు. అప్పుడే అతనికి దేవయానితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఆడారు పాడారు. విద్య పూర్తయి కచుడు వెళ్ళిపోతున్న వేళ, తన కోరికను తెలియజేసింది దేవయాని. తనని వివాహమాడమన్నదామె. ‘‘నాకు నువ్వు గురుపుత్రివి. సోదరితో సమానం. నిన్ను పెళ్ళాడడం పాపం.’’ అన్నాడు కచుడు. కాదన్నదామె. రకరకాలుగా వేడుకున్నది. వినలేదు కచుడు. ఆఖరికి కోపంతో ఇలా శపించింది.‘‘మృతసంజీవనీ విద్య నీకు పనిచేయకుండుగాక.’’తనని అకారణంగా శపించినందుకు కచుడు కోపగించుకుని, దేవయానిని ఇలా శపించాడు.‘‘నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక.’’శాప ప్రతిశాపాలతో కచ దేవయానులు విడిపోయారు.*
*నాటి శాపఫలితంగా దేవయానికి బ్రాహ్మణేతరుణ్ణి పెళ్ళాడే యోగ్యత ఉన్నది. ఆ మాటే యయాతికి ఇప్పుడు చెప్పింది దేవయాని. తనని స్వీకరించడంలో తప్పు లేదన్నది. ఒప్పించిందతన్ని.*
*తండ్రి శుక్రాచార్యుని సమీపించి, తనకి శర్మిష్ఠ చేసిన అవమానాన్ని వివరించింది దేవయాని. ఏడ్చింది. పౌరోహిత్యం కంటే భిక్షాటనే మేలు అనుకున్నాడు శుక్రాచార్యుడు. కుమార్తెను వెంటబెట్టుకుని వృషపర్వుని విడచి వెళ్ళిపోయాడు.*
*శర్మిష్ఠ కారణంగా గురువుగారు తనని విడచి వెళ్ళిపోయారని ఎంతగానో బాధపడ్డాడు వృషపర్వుడు. శుక్రాచార్యుడు లేకపోతే దేవతల ఆగడాలకు అంతు ఉండదనుకున్నాడు. ఎలాగయినా గురువుగారి అనుగ్రహం సంపాదించుకోవాలనుకున్నాడు. వెళ్ళి శుక్రాచార్యుని పాదాలపై మోకరిల్లాడు.*
*‘‘శర్మిష్ఠ చేసింది తప్పే! ఒప్పుకుంటాను. ఈ కారణంగా మీరు నన్ను విడచి రావడం భావ్యం కాదు. నా కూతురు చేసిన తప్పు క్షమించండి. మీరు లేకపోతే దానవకులం అంతరించిపోతుంది. మాకు దిక్కులేదు.’’ వేడుకున్నాడు. శుక్రాచార్యుడు కరిగాడు. కోపాన్ని తగ్గించుకున్నాడు. కూడా వృషపర్వునితో వచ్చేందుకు సిద్దమయ్యాడు. అయితే దేవయాని కోరిక తీర్చాలని వృషపర్వుని ఆజ్ఞాపించాడు శుక్రాచార్యుడు. తప్పకుండా అన్నాడు వృషపర్వుడు. కోరికను తెలియజేయమన్నాడు.*
*‘‘నాకు పెళ్ళి చేసి నా తండ్రి నన్ను ఎక్కడకి పంపితే అక్కడకి శర్మిష్ఠ తన చెలికత్తెలతో వచ్చి, నాకు ఊడిగం చెయ్యాలి. నా దగ్గరే ఉండాలి. ఇందుకు నువ్వు ఒప్పుకోవాలి.’’ అన్నది దేవయాని. శర్మిష్ఠను దేవయాని వెంట దాసిగా పంపడం భరించలేనిదే! అయినా తప్పదు. రాక్షసకులానికి కీడు మూడితే కాపాడేదెవరు? అనుకున్నాడు వృషపర్వుడు. తప్పనిసరయి దేవయాని కోరికను అంగీకరించాడు. విధిలేక శర్మిష్ఠ తండ్రి ఆజ్ఞకు కట్టుబడింది. చెలికత్తెలు సహా శర్మిష్ఠ, దేవయానిని చేరింది.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి