*తిరుమల సర్వస్వం 169-*
*శ్రీ హాథీరామ్ బావాజీ 1*
*శ్రీ హాథీరామ్ బావాజీ*
స్వామివారి భక్తాగ్రేసరులలో అత్యంత ప్రముఖుడైన శ్రీ హాథీరామ్ బావాజీని స్మరించుకోకుండా తిరుమల క్షేత్ర చరిత్ర కానీ, శ్రీవేంకటేశ్వరుని ఇతిహాసం కానీ అసంపూర్తిగానే మిగిలిపోతాయంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ళక్రితం, ఎక్కడో వేలమైళ్ళ దూరంలోనున్న హిమాచల్ ప్రదేశ్ నుంచి కాలినడకన వచ్చి, తిరుమలకొండపై జనావాసాలు ఏమాత్రం లేని రోజుల్లో స్థిరనివాసమేర్పరచుకుని, స్వామివారిని సేవించుకుంటూ, వారితో నిత్యము పాచికలాడిన శ్రీహాథీరామ్ బావాజీ చరిత్ర శ్రీవారి భక్తులందరికీ చిరపరిచితమే!
వారి జీవనగమనం, శ్రీవేంకటేశ్వరునితో వారికున్న ప్రగాఢమైన అనుబంధం, తిరుమలలో బావాజీ జీవితంతో ముడివడి ఈనాటికీ దర్శించుకోదగ్గ ప్రదేశాలు, బ్రిటీషువారి హయాం అనంతరం ఆలయ నిర్వహణను తొంభై సంవత్సరాల పాటు చేపట్టిన మహంతు వ్యవస్థ - మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*పుట్టుపూర్వోత్తరాలు*
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 'ఉనా' అనబడే గ్రామంలో, వంశపారంపర్యంగా శ్రీరామచంద్రుడి పరమభక్తుడైన 'దేశ్ రాజ్ బల్తోత్' అనే మధ్యతరగతి కుటుంబీనికి కలిగిన నలుగురు పుత్రులలో ఒకరిగా బాబాజీ జన్మించారు. వారి అసలు పేరు 'ఆశారామ్ బల్తోత్'. తరువాతి కాలంలో, 'లంబాడా' గిరిజన తెగకు చెందిన బలౌత్ కుటంబం పంజాబ్ రాష్ట్రానికి వలస వెళ్ళింది.
మరి కొందరు చరిత్రకారులననుసరించి, బావాజీ పూర్వీకులు రాజస్థాన్ లోని 'నాగౌర్' పట్టణానికి చెందినవారు. తిరుమల లోని హాథీరాంజీ మఠంలో ప్రస్తుతం నివాసముంటున్న బావాజీ అనుయాయులు ఈ వాదాన్నే బలపరుస్తున్నారు.
*తిరుమల యాత్ర*
బల్తోత్ వంశస్థులు, ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉధృతంగా ప్రచారంలోనున్న రామానంద భక్తి ఉద్యమానికి చెందిన వైష్ణవులు. ఈనాటి 'ఢిల్లీ' పట్టణానికి కొద్ది దూరంలో 'రామానంద మఠం' ఉండేది. శ్రీరామ భక్తిని వంశపారంపర్యంగా పుణికి పుచ్చుకున్న హథీరాం బాబా ఆ రోజుల్లో రామానంద మఠానికి అధిపతి యైన అభయానంద్ స్వామీజీకి ప్రియశిష్యుడు.
గురువాజ్ఞ మేరకు, కౌమారదశలోనున్న ఆశారామ్ బడ్జత్, ఒక భక్తబృందంలో సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోని తీర్ధాలన్నింటిని కాలినడకన దర్శించుకుంటూ, తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. కొద్ది రోజులు శ్రీవారిని సేవించుకున్న తరువాత భక్తబృందం లోని సభ్యులందరూ తిరిగి వెళ్ళిపోగా, బావాజీ మాత్రం తిరుమల క్షేత్రం లోని ప్రకృతి సోయగానికి, శ్రీవేంకటేశ్వరుని దివ్యసౌందర్యానికి ముగ్ధుడై సప్తగిరులే తన దీక్షకు అనువైన స్థానమని తలంచి కొండపైనే ఉండిపోయాడు. ఆలయానికి అతి సమీపంలో ఆగ్నేయ దిక్కున ఒక చిన్న ఆశ్రమం ఏర్పరుచుకొని, అనునిత్యం స్వామివారిని సేవించుకునేవాడు. ఆ కాలంలో తిరుమల ప్రాంతమంతా దట్టమైన అడవులతో, క్రూరమృగాలతో, భరింపశక్యం గాని చలితో దుర్గమంగా ఉండడం వల్ల కొండపై వేరెవరూ నివాసముండేవారు కాదు. అర్చకులతో సహా అందరూ కొండ దిగి, చీకటి పడకముందే దిగువ తిరుపతికి చేరుకునే వారు. బావాజీ ఒక్కరే స్వామివారిపై భారం వేసి, ఆశ్రమంలో నివాసముంటూ శ్రీవారిని సేవించుకునేవారు.
బావాజీ స్వతహాగా, వంశపారంపర్యంగా శ్రీరాముడి భక్తుడవ్వడంతో; శ్రీవేంకటేశ్వరుని ముఖారవిందంలో కూడా స్వామివారి త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకునే వాడు. 'కౌసల్యా సుప్రజా రామా' అంటూ స్వామి వారిని శ్రీరాముని వలెనే కీర్తించే వారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి