*తిరుమల సర్వస్వం 174-*
*శ్రీ హాథీరామ్ బావాజీ 6*
*బాబాజీ జ్ఞాపకాలు*
బాబాజీ జీవితచరిత్రతో ముడివడియున్న అనేక జ్ఞాపకాలను నేడు కూడా తిరుమల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
*హాథీరామ్ బాబా మఠం*
అలయ మహాద్వారానికి ఎదురుగా నిలబడితే, మనకు ఎడం ప్రక్కగా పాత సహస్రదీపార్చన మంటపం పైభాగంలో, స్వామివారితో పాచికలాడుతున్న హాథీరామ్ బాబా కుడ్యశిల్పం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. సరిగ్గా, దానికి వెనుకభాగంలోనే, ఎత్తైన గుట్టపై హాథీరామ్ బాబా మఠం ఉంది. దక్షిణ మాడవీధి లో, తిరుమలనంబి ఆలయం దాటిన తరువాత, 'సుపథం' ప్రక్కన ఉన్న సన్నటి మార్గం ద్వారా వెళ్ళి, కొన్ని మెట్లెక్కి ఈ మఠాన్ని చేరుకోవచ్చు. ఆ ప్రదేశం లోనే బాబాజీ ఒకప్పుడు నివసించేవారు. బావాజీ ఒక రాత్రి నిర్బంధించబడింది కూడా ఆ ప్రదేశంలోనే!
కొన్ని వందల ఏళ్ళ క్రితం, శేషాచల అరణ్యాలలో విరివిగా లభ్యమయ్యే ఎర్రచందనం స్తంభాలతో, వివిధ కళాకృతులు అత్యంత మనోహరంగా చెక్కబడిన తలుపులు ద్వారబంధాలతో, పటిష్ఠమైన పైకప్పుతో రాచఠీవి ఉట్టిపడేలా నిర్మించబడ్డ ఈ మఠం నేటికీ చెక్కుచెదరకుండా, తిరుమల యాత్రికులను ఆకట్టుకుంటోంది. దీనికి అనుబంధంగా తరువాతి కాలంలో నిర్మించబడ్డ కట్టడాలు యాత్రికులకు వసతిగృహంలా ఉపయోగ పడుతున్నాయి. ముందస్తుగా ఆరక్షణ (రిజర్వేషన్) చేసుకొని, ఇందులో గదులు పొందవచ్చు. అయితే, దేవాలయానికి అతి దగ్గరగా ఉండటం, సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు నడయాడిన ప్రాంతం కావటం వంటి కారణాలవల్ల, ఇందులో వసతి లభించటం కొంచెం కష్టంతో కూడుకున్నది.
ఈ అవరణలోనే, కొత్వాల్ ఆంజనేయస్వామి దేవాలయాన్ని మరియు గణపతి ఆలయాన్ని సందర్శించు కోవచ్చు.
మఠం లోపల ఉన్న కోదండరామాలయంలో చలువరాతితో హృద్యంగా చెక్కబడిన సీతారామలక్ష్మణుల ముగ్ధమనోహరమైన విగ్రహాలను కన్నులారా వీక్షించుకోవచ్చు. ఆ విగ్రహాల చెంతనే, దశావతార సాలగ్రామాలు కూడా తరతరాలుగా పూజలందు కొంటున్నాయి. ఒక్కొక్క సాలగ్రామం పై ఒక్కొక్క దశావతారపు చిహ్నం మత్స్యాకారము, తాబేటి డిప్ప, వరాహమూపురము, మొదలైనవి ప్రకృతిసిద్ధంగా ముద్రాంకితమై, చూపరులకు అచ్చెరువు గొల్పుతుంటుంది.
ఆ ఆలయానికి మూడు ప్రక్కలా ఊయలలో ఊగుతున్న చిన్నికృష్ణునికి, దశావతారాలకు ఉపాలయాలు ఉన్నాయి. ముద్దుల కృష్ణుని వెండి ఊయలను మనం కూడా ఊపి, స్వయంగా వారికి పవళింపు సేవ చేసి తరించవచ్చు.
ఈ మఠంలో అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది హాథీరామ్ బాబాతో, శ్రీవేంకటేశ్వరుడు పాచికలాడిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నిర్మించబడిన చిన్న మంటపంలో ఆనాడు పాచికలాడిన, పట్టువస్త్రపు పాచికలపటం మరియు అఖండజ్యోతి నేటికీ నిత్యపూజలందు కొంటున్నాయి. ఈ ప్రదేశం వద్ద, కొన్ని వందల సంవత్సరాలుగా ఎల్లవేళలా, విరామం లేకుండా, రామనామ జపం జరుప బడుతోంది. ఆశ్రమవాసుల కథనం ప్రకారం బావాజీ వారే ఈ రామనామ పారాయణానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి అది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆ రామనామ సంకీర్తన మహాయజ్ఞంలో మనం కూడా కొంతసేపు శృతి కలపి, బాబాజీ కృపకు పాత్రులు కావచ్చు.
బాబాజీ, వారి శిష్యులైన మహంతులు అసీనులై ఉండే గద్దె కూడా ఈ మఠంలో సంరక్షించబడింది. మఠం ప్రాంగణంలో మఠాధిపత్యం వహించిన మహంతుల సమాధులను కూడా పరిరక్షించారు. మఠం యొక్క ప్రహరీగోడకు గల గవాక్షం గుండా దేవాలయ ఉపరితల భాగాన్ని, గోపురాలను కన్నులపండువగా కాంచవచ్చు. ఇప్పటి ప్రధాన మహంతు, మహంతుమఠానికి చెందిన మరికొందరు సభ్యులు ఈ మఠంలోనే నివాసముంటారు. దాదాపు రెండున్నర ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన హాథీరామ్ బాబా మఠం, తిరుమల యందు తప్పనిసరిగా దర్శించి తీరవలసిన విశేషాల్లో ఒకటి.
దాదాపుగా ఇలాంటిదే మరొక మహంతు మఠం తిరుపతి పట్టణాన, గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ప్రస్తుతం అది మహంతుకు మరొక ఆవాసంగానూ; తిరుపతిని దర్శించుకొనే సాధవులకు, సన్యాసులకు, బైరాగులకు విడిదిగానూ ఉపయోగ పడుతోంది.
తిరుమల క్షేత్రంలో బాబాజీ జీవితంతో ముడివడిన మరికొన్ని విశేషాలను, మహంతుల పరిపాలనాకాలంలో తిరుమల క్షేత్రం తీరుతెన్నులను ఇప్పుడు తెలుసుకుందాం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి